Telangana JanaSena: తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన.. పోటీ చేసే స్థానాలు ఇవే!
ఈ ఏడాది డిసెంబర్‌లోపు ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీసగఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు ప్రస్తుతానికి జమిలి ఎన్నికలు లేవని దాదాపు తేలిపోయింది.

Telangana JanaSena: వైసీపీ ముక్త ఆధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలో జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని నిర‍్ణయించారు. గతంలోనే ఆయన 15 నుంచి 20 స్థానాల్లో తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించారు. తాజాగా 32 స్థానాల్లో అభ్యర్థులను నిలపాలని డిసైడ్ అయ్యారని తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీ ప్రకటన కూడా చేసింది.
డిసెంబర్‌లో ఎన్నికలు..
ఈ ఏడాది డిసెంబర్‌లోపు ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీసగఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు ప్రస్తుతానికి జమిలి ఎన్నికలు లేవని దాదాపు తేలిపోయింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్, నవంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని భావిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ ఉంటుందని టాక్. ఈ నేపథ్యంలో తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్ధమవుతోంది.
32 స్థానాలు ఇవే..
తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా జనసేన కేవలం 32 స్థానాల్లోనే పోటీకి దిగుతోంది. ఈ 32 సీట్లలో అధిక భాగం గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోనే ఉన్నాయని తెలుస్తోంది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, మల్కాజిగిరి, ఖైరతాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, పఠాన్ చెరు, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడ తదితర స్థానాల నుంచి జనసేన పోటీ చేయొచ్చని టాక్. మరోవైపు గతంలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును తొలగించింది. మళ్లీ కొద్ది రోజుల క్రితం దాన్ని పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇన్‌చార్జీల ప్రకటన..
ఇప్పటికే జనసేన పార్టీ పోటీ చేసే 32 నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను ప్రకటించింది. మరోవైపు ఏపీలో బీజేపీతో పొత్తులో కొనసాగుతున్న జనసేన తెలంగాణలో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుండటం విశేషం. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు, అంతకుముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. తటస్థంగా వ్యవహరించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్ తరఫున మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె పోటీ చేయడంతో ఆమెకు పవన్ మద్దతు ప్రకటించారు. ఏపీలో తమతో పొత్తులో కొనసాగుతున్న బీజేపీ తెలంగాణలో మాత్రం తమను కనీసం సంప్రదించకపోవడంతో ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు.
