Telangana Elections: తెలంగాణ ఎన్నికలలో అసలు పేర్లతో కాకుండా వేరే పేర్లతో పోటీచేస్తోన్న అభ్యర్థులు వీరే
అయితే కొందరి నామినేషన్లలో అసలు పేరుతోపాటు వ్యవహారికంలో ఉన్న పేర్లను కూడా పొందుపరిచారు. ఇలా తెలంగాణలో ఆరుగురు అసలు పేర్లతో కాకుండా వేరే పేర్లతో ప్రసిద్ధి పొందారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..

Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 2,898 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎలెక్షన్ సంఘం ఆమోదించగా, 606 నామినేషన్లను ఎలెక్షన్ ఆఫీసర్లు తిరస్కరించారు. పోటీ చేసే అభ్యర్థులందరూ నామినేషన్లలో తమ పేర్లను పొందుపరచడం తెలిసిందే. అయితే కొందరి నామినేషన్లలో అసలు పేరుతోపాటు వ్యవహారికంలో ఉన్న పేర్లను కూడా పొందుపరిచారు. ఇలా తెలంగాణలో ఆరుగురు అసలు పేర్లతో కాకుండా వేరే పేర్లతో ప్రసిద్ధి పొందారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
పోచారం శ్రీనివాస్‌రెడ్డి..
బాన్సువాడ నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి. ఆయన అసలు పేరు పరిగె శ్రీనివాస్‌రెడ్డి. శ్రీనివాస్‌రెడ్డి సొంతూరు బాన్సువాడ మండలం పోచారం. ఊరి పేరే శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపేరుగా మారింది.
రసమయి బాలకిషన్..:
మానకొండూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ అందరికీ సుపరిచితులే. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆయన ఆట పాటలతో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర సాసంస్కతిక సారథి చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆయన అసలు పేరు ఇరుపుల బాలకిషన్. రసమయి సాంస్కృతిక సంస్థను బాలకిషన్ స్థాపించారు. అప్పటి నుంచి ఆ సంస్థ పేరే ఆయన ఇంటి పేరుగా మారింది.
పద్మా దేవేందర్‌రెడ్డి..
మెదక్ నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి, అసలు పేరు మాధవరెడ్డిగారి పద్మ. అయితే ఆమె భర్త పేరుతో కలిపి పద్మా దేవేందర్‌రెడ్డిగా పాలిటిక్స్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు.
సీతక్క..
తెలంగాణ పాలిటిక్స్‌లో ఈ పేరు తెలియనివారు ఉండరు. ములుగు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దనసరి అనసూయ.. సీతక్కగా ప్రాచుర్యం పొందింది. ఆమె నక్సలిజంలో పనిచేసినపుడు సీతక్కగా పేరు పొందారు. అదే పేరుతో రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు. కరోనా సమయంలో ఆమె గిరిజనులకు చేసిన సేవ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
మధు యాష్కీగౌడ్..
ఎల్‌బీ.నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థి మధు యాష్కీ గౌడ్. ఆయన అసలు పేరు మధుసూదన్. ఆమెరికాలో ఉండి వచ్చిన ఆయన అక్కడ వాడుకలో ఉన్న పేరుతోనే ఇక్కడ గుర్తింపు పొందారు.
బోగ శ్రావణి..
జగిత్యాల బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణి, ఆమె నామినేషన్ పత్రాల్లో ఆమె ఇంటి పేరు బండారు శ్రావణిగా పేర్కొన్నారు. అయితే ఆమె భర్త ఇంటి పేరుతో బోగ శ్రావణిగా ప్రాచుర్యం పొందారు.
