YCP Govt: ఎమ్మెల్సీ తేడా కొడితే ‘మండలి’కి జగన్ మంగళం!
YCP Govt: ఏపీ సీఎం జగన్ ది వింత మనస్తత్వం. అది చాలా సందర్భాల్లో భయటపడింది. మగధీర సినిమాలో తనకు దక్కనిది.. మరెవరికీ దక్కకూడదు అన్న విలన్ పలికే డైలాగుకు జగన్ మనస్తత్వం దగ్గరగా ఉంటుందని సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు జగన్ శాసన మండలిని రద్దుచేస్తారన్న ప్రచారం ఒకటి జరుగుతోంది. అయితే అందులో వాస్తవం ఎంత ఉందో చెప్పలేం కానీ.. చేసినా చేస్తారన్న టాక్ అయితే మాత్రం వినిపిస్తోంది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు […]


YCP Govt
YCP Govt: ఏపీ సీఎం జగన్ ది వింత మనస్తత్వం. అది చాలా సందర్భాల్లో భయటపడింది. మగధీర సినిమాలో తనకు దక్కనిది.. మరెవరికీ దక్కకూడదు అన్న విలన్ పలికే డైలాగుకు జగన్ మనస్తత్వం దగ్గరగా ఉంటుందని సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు జగన్ శాసన మండలిని రద్దుచేస్తారన్న ప్రచారం ఒకటి జరుగుతోంది. అయితే అందులో వాస్తవం ఎంత ఉందో చెప్పలేం కానీ.. చేసినా చేస్తారన్న టాక్ అయితే మాత్రం వినిపిస్తోంది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడం, తన సొంత ప్రాంతంలో పార్టీ అభ్యర్థి ఓటమి, పులివెందులకు చెందిన టీడీపీ నేత ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవడంతో జగన్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు.ఇప్పుడు ఎమ్మెల్యేలు కొందరు పార్టీని ధిక్కరిస్తారన్నవార్త కలవరపెడుతోంది. అందుకే మండలి రద్దుకు పదును పెడుతున్నారన్న వార్త హల్ చల్ చేస్తోంది.
టీడీపీ ఆధిక్యాన్ని సహించలేక..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో శాసనమండలిలో టీడీపీదే మెజార్టీ. శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ వంటి పదవులు టీడీపీ వారే ఉండేవారు. చైర్మన్ గా షరీఫ్, డిప్యూటీ చైర్మన్ గా రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యవహరించేవారు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లులు శాసన మండలిలో ఆమోదం పొందేవి కావు. సవరణలకు టీడీపీ సభ్యులు పట్టుబట్టేవారు. దీంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. 2020 జనవరి 27న శాసనమండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఏకపక్షంగా ఆమోదించారు. పరిశీలనకు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. వాస్తవానికి మూడేళ్లలో శాసనమండలిలో వైసీపీకి ఆధిక్యం వస్తుందని తెలిసినా జగన్ రద్దుకే మొగ్గుచూపారు. ఏడాదికి రూ.60 కోట్ల ఖర్చు అవసరమా అని ప్రశ్నించారు. కానీ 2021 నవంబరులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలతో శాసనమండలిలో వైసీపీ బలం పెరిగింది. దీంతో శాసన మండలి రద్దు నిర్ణయాన్ని వైసీపీ సర్కారు వెనక్కి తీసుకుంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఎదురయ్యేసరికి మరోసారి రద్దుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏరికోరి కష్టాలు…
గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు అంతులేని విజయాన్ని ఇచ్చారు. మొత్తం 151 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. నలుగురు టీడీపీ సభ్యులతో పాటు మరో జనసే ఎమ్మెల్యే వైసీపీలోకి ఫిరాయించారు. శాసనసభలో వైసీపీ బలం 156 ఎమ్మెల్యేలకు పెరిగింది. శాసనమండలిలో సైతం సంపూర్ణ మెజార్టీ దక్కింది. ఇటువంటి సమయంలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీలను ఎన్నిక జరుగుతోంది. అయితే ఇందులో స్థానిక సంస్థల స్థానాల్లోవైసీపీకి బలం ఉంది కాబట్టి పోటీచేయవచ్చు. అయితే పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలు మాత్రం ఎప్పుడూ పీడీఎఫ్ సభ్యులే ప్రాతినిధ్యం వహించేవారు. అయితే అవి కూడా వైసీపీ ఖాతాలో పడాలని జగన్ ప్లాన్ చేశారు. విపరీతమైన ప్రజావ్యతిరేకత ఉన్న సమయంలో పోటీకి దిగారు. కానీ చావు తప్పి కన్నులొట్టపోయిన విధంగా ఉపాధ్యాయ స్థానాల్లో గెలుపొందారు. కీలకమైన పట్టభద్రుల స్థానాల్లో మాత్రం ఓటమి చవిచూశారు. రాజకీయ ప్రతికూల పరిస్థితులను చేజేతులా మూటగట్టుకున్నారు.

YCP Govt
ఫలితం తారుమారైతే…
ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేసినా… చెల్లని ఓటు వేసినా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ గెలిచే చాన్స్ ఉంది. అధికార పార్టీలో కొంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు బయట పడ్డారు. అలా జిల్లాకు ఒకరు చొప్పున సైలెంట్ గా ఉంటున్న ఎమ్మెల్యేల విషయంలో నిఘా వర్గాలు సమాచారాన్ని జగన్ కు చేరవేసినట్లు తెలుస్తుంది. దీంతో ఏడో స్థానం విషయంలో ఆయన టెన్షన్ పడిపోతున్నారు. ఎలాగైనా గట్టెక్కాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు, సీనియర్ నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే ప్రతికూల ఫలితం వస్తే జగన్ మరోసారి మండలిని రద్దుచేస్తారా? అన్న సెటైర్లు పడుతున్నాయి. ఒక వేళ ఎమ్మెల్సీ స్థానాన్ని ఓడిపోతే మండలికి మంగళం పాడేస్తారన్న ప్రచారం ఏపీలో ఊపందుకుంటోంది.