Gannavaram YCP: గన్నవరం విషయంలో వైసీపీ ది స్వయంకృతాపం
వాస్తవానికి గన్నవరం నియోజకవర్గం టిడిపికి పెట్టని కోట. వరుసగా టిడిపి అభ్యర్థులు ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. దాసరి బలవర్దన్ రావు, అటు తర్వాత వంశీ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు.

Gannavaram YCP: గన్నవరం నియోజకవర్గ విషయంలో వైసీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. వల్లభనేని వంశీ మూలంగా ఇబ్బందులు పడిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. వల్లభనేని వంశీ తో కలిసి నడిచేందుకు ససేమీరా అంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వంశీకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నాయి. ఒకరిద్దరు వైసీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను సైతం వెళ్ళగక్కారు. నియోజకవర్గంలో దాదాపు వైసీపీ శ్రేణుల్లో ఇదే అభిప్రాయం ఉండడంతో హై కమాండ్ మల్లగుల్లాలు పడుతోంది.
వాస్తవానికి గన్నవరం నియోజకవర్గం టిడిపికి పెట్టని కోట. వరుసగా టిడిపి అభ్యర్థులు ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. దాసరి బలవర్దన్ రావు, అటు తర్వాత వంశీ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. వైసిపి ఆవిర్భావం నుంచి దుట్టా రామచంద్ర రావు జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో వంశీ టిడిపి అభ్యర్థిగా పోటీ చేయగా.. దుట్టా రామచంద్రరావు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో వంశీ గెలిచిన తర్వాత వైసీపీ శ్రేణులను టార్గెట్ చేసుకున్నారు. పోలీస్ కేసులతో ఇబ్బంది పెట్టారు. వెంటాడారు.. వేటాడారు. అటువంటి సమయంలోనే యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ ఇన్చార్జిగా తెరపైకి వచ్చారు. వంశీ బాధితులుగా ఉన్న వైసీపీ శ్రేణులకు అండగా నిలిచారు. గట్టిగానే పోరాడారు. గత ఎన్నికల్లో కేవలం 700 ఓట్లతో టిడిపి అభ్యర్థిగా ఉన్న వల్లభనేని వంశీ చేతిలో వెంకట్రావు ఓడిపోయారు. అయినా సరే వైసీపీ శ్రేణులకు అండగా నిలుస్తూ వచ్చారు. ఇప్పుడు అదే వంశీ వైసిపి వైపు రావడంతో ఆయన చేతిలో దెబ్బలు తిన్న, కేసులు బారిన పడిన వైసీపీ శ్రేణులు ఆయన నాయకత్వాన్ని సహించలేకపోతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావుకు మరోసారి టికెట్ ఇచ్చి ఉంటే… వైసీపీ శ్రేణులు బలంగా పనిచేసేవి. వంశీ పై కోపంగా ఉండే టీడీపీ శ్రేణులు సైతం బాహటంగానే మద్దతు తెలిపేవి. వైసీపీ అభ్యర్థి విజయం సునాయాసం అయ్యేది. కానీ వైసిపి నాయకత్వం చేజేతులా యార్లగడ్డ వెంకట్రావును దూరం చేసుకుంది.కనీసం రాజ్యసభ, ఎమ్మెల్సీ హామీ ఇచ్చి ఉన్నాయార్లగడ్డ వెంకట్రావు వైసీపీలోనే కొనసాగే వారు. వైసిపి హై కమాండ్ ఒకవైపు.. వల్లభనేని వంశీ రెచ్చగొట్టే ధోరణి మరోవైపు.. యార్లగడ్డ వెంకట్రావు పార్టీ వీడడానికి కారణమైంది. గన్నవరం నియోజకవర్గాన్ని చేజేతులా వైసీపీ హై కమాండే దూరం చేసుకుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
