Governor Tamilisai- KCR: సమకాలీన తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ను మించిన వారు లేరు.. ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టడంలో, ప్రజలను తన వైపు మళ్లించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి.. 2014లో మొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతిపక్షాలను ఒక ఆట ఆడుకుంటూ వస్తున్నారు.. కానీ ఎప్పుడైతే దుబ్బాకలో బిజెపి గెలిచిందో, ఎప్పుడైతే బిజెపి నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుందో… అప్పటినుంచి తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది.. మరీ ముఖ్యంగా కెసిఆర్ ప్లాన్లన్ని బెడిసి కొట్టడం మొదలైంది.

Governor Tamilisai- KCR
రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ మీద షాక్ తగులుతోంది. ముఖ్యంగా రాజ్ భవన్ విషయంలో దెబ్బ మీద దెబ్బ పడుతోంది.. మొన్న గణతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించాలని, పెరేడ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది.. దీంతో సర్కార్ కొంత వెనక్కి తగ్గక తప్పలేదు.. ఇప్పుడు తాజాగా గవర్నర్ తో రాజీ పడేలా చేసి, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించేలా చేసింది.. గవర్నర్ తీరును ఎత్తిచూపాలని తలచిన ప్రభుత్వానికి ఇది ఊహించని పరిణామం.. తేదీ లేక గవర్నర్ ప్రసంగాన్ని ఉండేలా చూస్తామంటూ హైకోర్టుకు చెప్పాల్సి వచ్చింది.. అసలు గవర్నర్ పై లంచ్ మోషన్ లో పిటిషన్ వేయడమే తప్పని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ముందుగా పిటిషన్ వేయడం ఎందుకు? అనక నాలుక కర్చుకోవడం ఎందుకు? అని తప్పు పడుతున్నారు..
రాజ్ భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య గత కొంతకాలంగా భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.. దీంతో గత ఏడాది మాదిరిగానే ప్రభుత్వం ఈసారి కూడా శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేసింది.. శాసనసభ ఇంకా ప్రొరోగ్ కాలేదని, గత సమావేశాలకు కొనసాగింపుగానే ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తున్నామని, ఈ దృష్ట్యా గవర్నర్ ప్రసంగం అవసరం లేదంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతూ వచ్చాయి.. ఈ నెల మూడో తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తలచింది.. ఆ మేరకు 2023_24 బడ్జెట్ ముసాయిదాను ఈనెల 21న గవర్నర్ అనుమతి కోసం పంపించింది. కానీ గవర్నర్ ఈ అవకాశాన్ని వినియోగించుకొని, ఉభయ సభలను ఉద్దేశించి తాను చేయాల్సిన ప్రసంగం తాలూకు కాపీని పంపించాలని ఆదేశించింది.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.. దీంతో గవర్నర్ కూడా బడ్జెట్ కు ఆమోదం తెలపలేదు.. రాజ్యాంగంలోని 202 అధికరణ ప్రకారం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టేముందు గవర్నర్ ఆమోదం పొందాలి.. గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో ప్రభుత్వం సోమవారం లంచ్ మోషన్ లో పిటిషన్ వేసింది. రాజ్ భవన్, ప్రభుత్వ న్యాయవాదుల మధ్య చర్చ జరిగింది.. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం ఉండాలని నిర్ణయించారు.. ఒక రకంగా కెసిఆర్ ప్రభుత్వానికి షాక్ వంటిదని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.. గత సంవత్సరం మాధుర్యాన్ని ఈసారి కూడా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేయాలనుకోవడం సరైనది కాదని చెబుతున్నారు.. గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవి అని, దానికి ప్రభుత్వం ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిందేనని, గవర్నర్ విషయంలో విధిగా ప్రోటోకాల్ పాటించాలని సూచిస్తున్నారు.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్న ప్రభుత్వం.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నైనా తగ్గాల్సి ఉండి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ రెండోసారి ప్రసంగించబోతున్నారు.. 2019 సెప్టెంబర్ లో ఆమె గవర్నర్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటికీ… గతంలో ఒకసారి మాత్రమే ఆమె ప్రసంగించే అవకాశం వచ్చింది.. 2020లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ఆమె ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.. 2021 లో మాత్రం కోవిడ్ కారణంగా ప్రభుత్వం బడ్జెట్ ను వర్చువల్ గా ప్రవేశపెట్టింది. దీంతో అప్పుడు ప్రసంగాలు, సమావేశాలు పెద్దగా లేవు.. 2022 మార్చి 7న బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం లేకుండా చేసింది.. అప్పుడు కూడా ఇది పెద్దగా చర్చకు దారి తీసింది.. గత సమావేశాలకు కొనసాగింపుగానే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నామంటూ అప్పట్లో ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి.. ఇప్పుడు కూడా అదే తీరును ఎంచుకున్నాయి.. ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేయాలనుకున్నాయి.. కానీ హైకోర్టు రాజీ పడాలని చెప్పడంతో ప్రసంగం ఉండేలా చూస్తామని ప్రభుత్వం చెప్పింది.. దీంతో రెండోసారి మూడున ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగించబోతున్నారు.

Governor Tamilisai- KCR
రాజ్ భవన్, సీఎంవో మధ్య కుదిరిన సంధి ఎంతకాలం కొనసాగుతుందని చర్చ జరుగుతోంది. ప్రతిసారి గణతంత్ర ఉత్సవాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, దానికి సీఎం, మంత్రులు రావడంలేదని రాజ్ భవన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.. గణతంత్ర దినోత్సవ సందర్భంగా సీఎం, మంత్రులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. గవర్నర్ విషయంలో అనుసరించాల్సిన ప్రోటోకాల్ ను ప్రభుత్వం అమలు చేస్తోందా అన్నది ఇప్పుడు తేలాలి.. వరదల సమయంలో కొత్తగూడెం, మరో సందర్భంలో నాగర్ కర్నూల్ చెంచుగూడాలలో గవర్నర్ పర్యటించారు.. మేడారం సమ్మక్క సారక్క జాతర కూడా వెళ్లారు.. అప్పుడు ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి.. యాదాద్రి ఆలయ సందర్శనకు వెళ్ళినప్పుడు కూడా అధికారులు ఆమెకు స్వాగతం చెప్పలేదు.. భవిష్యత్తులో ఇలాంటి ప్రోటోకాల్ పొరపాట్లు లేకుండా ప్రభుత్వం చూసుకుంటుందా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది..