Telangana BJP: బీజేపీ లో ఆ నేతల రహస్య భేటీ.. అందులో అంతర్యం ఏమిటో?
మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు గరికపాటి రామ్మోహన్ రావు, చాడా సురేష్ రెడ్డి హైదరాబాదులో మాజీ ఎంపీ వివేక్ నివాసంలో భేటీ అయ్యారు.

Telangana BJP: తెలంగాణలో బిజెపి పరిస్థితి ఆశించినంత బాగోలేదు. క్రమశిక్షణకు మారుపేరయిన ఆ పార్టీలో నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతమంది నేతలు కలిసి ప్రత్యేకంగా భేటీలు అవుతుండడం కలకలం సృష్టిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిస్థితి ఉండేది. అయితే కాంగ్రెస్ పార్టీ సమైక్య భావనను ప్రదర్శిస్తుండగా.. బిజెపి మాత్రం కాంగ్రెస్ దారిలో ప్రయాణం చేస్తోంది. ఎవరికి వారే యమునా తీరే అనే సామెతను గుర్తుకు తెస్తోంది. అంతేకాదు కొంతమంది నేతలు పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వారంతా అనువైన వాతావరణం కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం అందుతోంది. అయితే కొంతమంది కీలక నేతలు రహస్యంగా భేటీ అవుతుండడం పై వ్యాఖ్యలకు బలం చేకూర్చుతోంది.
మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు గరికపాటి రామ్మోహన్ రావు, చాడా సురేష్ రెడ్డి హైదరాబాదులో మాజీ ఎంపీ వివేక్ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం తనపై వ్యవహరిస్తున్న తీరుపై వీరు తమ అభిప్రాయాలు చెప్పుకున్నారు. భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితికి దగ్గరవుతోందని, అది వారి రాజకీయం మనుబడకు ప్రతి బంధకమని వారు తీర్మానించుకున్నట్టు తెలుస్తోంది. అసలు పార్టీలో ఉన్నామో లేదో కూడా గుర్తించడానికి పెద్దలు ఆసక్తి చూపడం లేదని వారు వాపోయినట్టు సమాచారం. కాంగ్రెస్ అనుకూల వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో వారంతా తమ భవిష్యత్తు కార్యాచరణ పై ఆలోచనలు జరిపినట్టు తెలుస్తోంది.
రహస్యంగా భేటీ అయిన ఈ 8 మందిలో ఐదుగురు లేదా ఆరుగురుని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. అయితే ప్రస్తుతం వారంతా రహస్యంగా భేటీ కావడం, తమ రాజకీయం మొనగాడు కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని సంకేతాలు వినిపిస్తుండడంతో కమలం పార్టీలో కలకలం రేగుతోంది. ఇక ఇప్పటికే విజయశాంతి సోనియా గాంధీ అంటే తనకు గౌరవం అంటూ చేసిన ట్వీట్ పార్టీలో కలకలం రేపుతోంది. బిజెపి పరిస్థితి ఆశించినంత మేర గొప్పగా లేకపోవడం వల్లే, వారంతా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వివేక్ ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లోకి వెళ్లారని.. చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి దీనిపై ఇంతవరకు వివేక్ నోరు మెదపలేదు. ఆయన మౌనంగా ఉన్నారు అంటే అది అర్ధాంగికారమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
