Delhi MCD Election Result: ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆప్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బుధవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల సమయానికి ఆప్ స్వల్ప ఆధిక్యంతో కొనసాగుతోంది. అమ్ అద్మీ పార్టీ 129 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. భారతీయ జనతా పార్టీ 105 స్టానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికలకు సంబంధించి డిసెంబరు 4న పోలింగ్ జరిగింది. 250 డివిజన్లకుగాను దాదాపు 1350 మంది అభ్యర్థులు పోటీచేశారు. ప్రధానంగా అమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోటీ అని విశ్లేషకులు భావించారు. కానీ ఇప్పుడు ఫలితాల్లో మాత్రం బీజేపీ, ఆప్ మధ్యే హోరాహోరీ పోరు నడుస్తున్నట్టు కనిపిస్తోంది. గత కొంతకాలంగా ఢిల్లీపై పట్టు సాధించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలేవీ వర్కవుట్ కాలేదు. కానీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఆప్ నకు దీటుగా బీజేపీ సత్తా చాటింది. అయితే ప్రస్తుతానికైతే ఆప్ మేజిక్ ఫిగర్ ను అధిగమించింది. అతి పెద్ద పార్టీగా నిలిచింది.

Delhi MCD Election Result
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1958లో ఎంసీడీ ఏర్పాటైంది. దేశంలోనే అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్లలో ఢిల్లీ ఒకటి. అయితే పాలనా సౌలభ్యం కోసం 2012లో అప్పటి సీఎం షీలాదీక్షిత్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ను మూడు విభాగాలు విడగొట్టారు. ఈ ఏడాది తిరిగి మూడు విభాగాలను ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ లో విలీనం చేసి గెజిట్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించారు. 2017 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. రికార్డు స్థాయిలో 181 స్టానాలను దక్కించుకుంది. ఆప్ 48, కాంగ్రెస్ 27 స్థానాలకే పరిమితమైంది. అయితే ఈ సారి అమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. పట్టు నిలబెట్టుకుంది. మెజార్టీ స్థానాల వైపు దూసుకెళుతోంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ తన పట్టు కాస్తా చేజార్చుకున్న పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉనికి చాటుకునేందుకు నానా తంటాలు పడుతోంది.

Delhi MCD Election Result
కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ విస్తరిస్తున్న బీజేపీకి అమ్ ఆద్మీ పార్టీ మాత్రం నలుసుగా మారింది. ఢిల్లీ రాజకీయాల్లో కొరకరాని కొయ్యగా మారింది. అటు పంజాబ్ లోనూ అధికారంలోకి వచ్చి బీజేపీకి గట్టి సవాల్ నే విసిరింది. తమ రాజకీయ చాణుక్యంతో పెద్ద పెద్ద రాష్ట్రాలనే గడగడలాడిస్తున్న మోదీ షా ద్వయానికి కేజ్రీవాల్ చిక్కడం లేదు. మహారాష్ట్ర ఎపిసోడ్ తో ముందే జాగ్రత్తపడిన కేజ్రీవాల్ తనకు తాను అవిశ్వాస తీర్మానాన్ని పెట్టుకున్నారు. ఎమ్మెల్యేల విశ్వాసాన్ని పొందారు. మరోసారి ఢిల్లీ పీఠంపై పట్టు సాధించుకున్నారు. వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగారు. ఇప్పుడు వరుసగా ఎన్నికల్లో సైతం పట్టు నిలుపుకుంటున్నారు.