Chandrababu: చంద్రబాబుకు దక్కని ఊరట.. షాకిచ్చిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కింద.. క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ కేసు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

Chandrababu: చంద్రబాబుకు కోర్టులో ఊరట దక్కడం లేదు. గత మూడు వారాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సానుకూలంగా తీర్పు రావడం లేదు. దాదాపు మూడు వారాలుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టు తో పాటు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అటు ఏసీబీ కోర్టులో సైతం తన రిమాండ్ పై పిటిషన్ దాఖలు చేశారు. అయితే కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకూ చంద్రబాబుకు ఉపశమనం కలిగించే తీర్పు కానీ, ఆదేశాలు కానీ లేవు. అటు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్. అక్టోబర్ 2 తరువాత విచారణకు వచ్చే అవకాశం ఉండడంతో.. చంద్రబాబు రిమాండ్ అనివార్యంగా మారింది.
సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కింద.. క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ కేసు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ప్రస్తావనకు వచ్చిన పిటీషన్ను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. ధర్మాసనంలో ఉన్న తన సహచర జడ్జి ఎస్వీ భట్… ఈ పిటిషన్ పై విచారించడానికి నాట్ బిఫోర్ మీ అంటున్నారని జస్టిస్ ఖన్నా తెలిపారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ లూథ్ర ఈ పిటిషన్ను త్వరగా విచారించాలని.. అవసరమైతే ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు. అయితే మీరు చీఫ్ జస్టిస్ ను కలవడానికి ఇబ్బంది లేదని.. తాను మాత్రం కేసును వాయిదా వేస్తున్నానని జస్టిస్ ఖన్నా స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణను వాయిదా వేశారు. సోమవారం అయినా వాదనలకు అవకాశం ఇవ్వాలని హరీష్ సాల్వే కోరారు. అయితే సోమవారం కూడా అవకాశం లేదని.. వచ్చేవారం వింటామని జస్టిస్ ఖన్నా బదులిచ్చారు.
మరోవైపు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో అక్టోబర్ 2 తర్వాతే విచారణకు రానుంది. మరోవైపు హైకోర్టులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోరారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై వాదనల సందర్భంగా ఆయన కోర్టుకు ఈ మేరకు విన్నవించారు. వేర్వేరు కేసుల్లో సెక్షన్ 428 వర్తించదని గుర్తు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసుల్లో చంద్రబాబు కీలక సూత్రధారి, పాత్రధారి అని.. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. మరోవైపు విజయవాడ ఏసిబి కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై విచారణ చేయాలని ఏసీబీ న్యాయవాది వివేకానంద కోరారు. మరికొద్ది రోజులపాటు ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. ఐదు రోజులపాటు కస్టడీని కోరుతూ ఏసీబీ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ కొనసాగనుంది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసును సిబిఐకి అప్పగించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు స్వీకరించింది. ప్రత్యేక బెంచ్ కేటాయించింది. కానీ ఇంత త్వరగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని ఓ జడ్జ్ అభిప్రాయ పడడంతో కేసు విచారణ పై ఏ నిర్ణయం తీసుకోలేదు. మొత్తానికైతే కోర్టుల్లో చంద్రబాబుకు ఊరట దక్కకపోవడం టిడిపి శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు చంద్రబాబు రిమాండ్ మూడు వారాలకు సమీపిస్తోంది.
