Onion Price: ఉల్లి.. ఇక మీరు కొనలేరు మళ్లీ మళ్లీ
సెప్టెంబర్ మొదటి వారంలో కిలో ఉల్లి రూ. 30 వరకు పలికేది. ఇప్పుడు మూడు రెట్లు పెరిగి.. రూ.100 వైపు పరుగులు తీస్తోంది. దీంతో ఉల్లి అంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

Onion Price: ఉల్లి చేసిన మేలు తల్లి చేయదంటారు. అంతటి ఆరోగ్య ప్రదాయిని ఉల్లి. ఉల్లి లేని ఆహారాన్ని అస్సలు ఊహించుకోలేము. అటువంటి ఉల్లి సామాన్యుడికి అందనంత దూరంలో ఉంది. కిలో ఉల్లి 100 రూపాయలు వైపు ఎగబాకుతోంది. మొన్నటి వరకు టమాట మోత మోగించగా.. ఇప్పుడు ఆ వంతు ఉల్లికి వచ్చింది. ఉల్లి అంటేనే ఉలిక్కిపాటుకు గురయ్యేలా ధర అమాంతం పెరుగుతోంది. టమాటా అయితే ఎలాగోలా సరిపుచ్చుకున్నా.. ఉల్లి విషయంలో అలా కాదు. తప్పనిసరిగా వినియోగించాల్సిందే. దాని వాడకం అనివార్యం. అందుకే ఉల్లి కోస్తున్న సామాన్యుల కళ్ళల్లో నీరు తెప్పిస్తోంది.
సెప్టెంబర్ మొదటి వారంలో కిలో ఉల్లి రూ. 30 వరకు పలికేది. ఇప్పుడు మూడు రెట్లు పెరిగి.. రూ.100 వైపు పరుగులు తీస్తోంది. దీంతో ఉల్లి అంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. హోటళ్లలో అయితే ఉల్లి నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అటు ఆహార పదార్థాల్లో ఉల్లి వినియోగాన్ని సైతం తగ్గించారు. దాని ప్రభావం రుచి పై పడుతోంది. సామాన్యులైతే ఇంటి అవసరాలకు తగ్గట్టు.. రెండు కిలోలు కొనుగోలు చేసిన వారు.. అరకిలో తో సరిపెడుతున్నారు.
మహారాష్ట్ర, కర్ణాటకలో ఉల్లి సాగు అధికం. ఆ రెండు రాష్ట్రాల నుంచే ఉల్లి సరఫరా జరుగుతోంది. మొన్నటి వరకు వర్షాలతో పంట నాశనమైంది. ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల తో సాగు తగ్గింది. మార్కెట్లో ఉన్న నిల్వలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో వ్యాపారుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఫలితంగా అది ధర పెరుగుదలకు కారణమవుతోంది. అయితే సరిగ్గా ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఉల్లి ధర అమాంతం పెరగడంతో.. మరి ఎవరికి రాజకీయ గండిపడుతుందో చూడాలి.
