Chhattisgarh Officer: ఫోన్ కోసం డ్యామ్ ఖాళీ చేశారు.. తీరాచూస్తే..!
ఫోన్ ఎలాగైనా తీసుకోవాలని 30 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లను తెప్పించాడు సదరు అధికారి. మూడు రోజులపాటు మోటార్లు 24 గంటలు పనిచేయడంతో 21 లక్షల లీటర్ల నీటిని నీటిని ఎత్తిపోశారు. సోమవారం నుంచి గురువారం వరకు నిరంతరాయంగా నీటిని తోడిపోశారు.

Chhattisgarh Officer: అసలే ఎండాకాలం. నీటి ఎద్దడి సమస్యను చాలా ప్రాంతాల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నారు. డబ్బుల లాగే నీటిని కూడా పొదుపుగా వాడాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ ఓ అధికారి తన సెల్‌ఫోన్ కోసం ఏకంగా రిజర్వాయర్‌లోని నీటిని బయటకు ఎత్తిపోయించాడు. తన స్వార్థం కోసం వందల ఎకరాలకు సాగునీరు అందించే నీటిని వృథా చేశాడు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఆ నీరు వాడుకకు పనికిరానిదని, కలెక్టర్ నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు చెబుతున్నాడు.
ఫోన్ రిజర్వాయర్‌లో పడిందని..
చత్తీస్‌గఢ్ రాష్ట్రం కంకారా జిల్లాలోని కొల్లా్లబేడ ప్రాంతానికి చెందిన రాజేశ్ విశ్వాస్ ఆహార ధాన్యాల సరాఫర శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సెలవు రోజు సరదాగా గడపడానికి ఖేర్‌కట్ట డ్యామ్‌కు వచ్చారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో తన రూ.లక్ష విలువైన స్మార్ట్‌ఫోన్ రిజర్వాయర్‌లో జారిపడింది. స్థానిక ఈతగాళ్లు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. డ్యామ్ దాదాపు 15 అడుగుల లోతు ఉంటుందని, నీరు 10 అడుగుల వరకు ఉన్నాయని డ్యాం అధికారులు తెలిపారు.
నీళ్లన్నీ ఎత్తిపోయించి..
ఫోన్ ఎలాగైనా తీసుకోవాలని 30 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లను తెప్పించాడు సదరు అధికారి. మూడు రోజులపాటు మోటార్లు 24 గంటలు పనిచేయడంతో 21 లక్షల లీటర్ల నీటిని నీటిని ఎత్తిపోశారు. సోమవారం నుంచి గురువారం వరకు నిరంతరాయంగా నీటిని తోడిపోశారు. ఈ నీటితో దాదాపు 1,500 ఎకరాల సాగుకు ఈ నీరు అందించవచ్చు. చివరికి స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన నీటివనరుల శాఖ అధికారులు ఆ ప్రక్రియను నిలుపుదల చేశారు. కానీ అప్పటికే 21 లక్షల లీటర్లను తోడిపోశారు.
చివర కు ఫోన్ దొరికినా..
అయితే చివరికి రాజేశ్‌కు తన ఫోన్ లభించింది. కానీ అది మూడు రోజులు నీటిలోనే ఉండటం వల్ల పనికి రాకుండా పోయింది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ సదరు అధికారిని సస్పెండ్ చేశారు. ఫోన్ కోసం నీటిని ఎత్తిపోయడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఫోన్ కోసం వందల ఎకరాలకు ఉపయోగపడే నీటిని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై ఫుడ్ ఆఫీసర్ రాజేశ్‌విశ్వాస్ మాట్లాడుతూ.. ‘నేను స్నేహితులతో డ్యామ్‌లో ఈతకొట్టడానికి వెళ్లాను. ఈ క్రమంలో ఫోన్ నీటిలో పడిపోయింది. అందులో అధికారిక సమాచారం ఉంది. ఈతగాళ్లు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. నాలుగు అడుగుల మేర నీటిని ఎత్తిపోస్తే ఫోన్‌ను కనిపెట్టొచ్చని అన్నారు. దీంతో స్థానిక నీటి వనరుల అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాను. నా ఫోన్ దొరికింది. ఈ నీరు సాగుకు పనికి రాదు. నా చర్య వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగలేదు.’ అని తెలిపారు.