Janasena Glass simbol: ఏపీ రాజకీయాల్లోకి దూసుకొచ్చిన జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ‘గాజు గ్లాస్’ గుర్తును కేటాయించింది. ఈ గాజు గ్లాస్ లో టీ తాగుతూ.. పవన్ కళ్యాణ్ చేతబట్టి ఎన్నికల ప్రచారంలోకి వెళ్లారు. ప్రజల్లోనూ ఇప్పుడు ‘గాజు గ్లాస్’ అంటే జనసేన గుర్తు అని అందరికీ తెలిసిపోయింది. గాజు గ్లాస్ జనసేనకే సొంతమన్నట్టుగా ఫోకస్ అయ్యింది.

glass janasena
అయితే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ సరిపడా ఓట్ల శాతాన్ని చేజిక్కించుకోకపోవడంతో ఆ పార్టీకి ఇప్పుడు ‘గాజు గ్లాస్’ దూరమైంది. ప్రతిసారి ఎన్నికల్లో పోటీచేయకుండా బీజేపీకి మద్దతిచ్చిన జనసేనకు ఇప్పుడు అదే శాపమైంది. జీహెచ్ఎంసీ, తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడంతో సరిపడా ఓట్లశాతం దక్కించుకోలేదు. ఎన్నికల్లో నిలబడకపోవడం ఆ పార్టీకి శాపమైంది. అదే ఇప్పుడు జనసేన సింబల్ గాజు గ్లాస్ ను దూరం చేసింది.
ఎన్నికల్లో పోటీచేసే ఏ పార్టీ అయినా తమకు కేటాయించిన గుర్తును నిలుపుకోవాలంటే ఈసీ నిబంధనల ప్రకారం.. ఓట్ల శాతాన్ని తెచ్చుకోవాలి. జనసేన ఇక్కడే దెబ్బతింది. పోటీచేయకుండా తన గుర్తును కోల్పోయింది.
ఇప్పుడు బద్వేలు ఉప ఎన్నికల్లో నవతరం పార్టీ అభ్యర్థి డాక్టర్ గోదా రమేశ్ కుమార్ కు ఈసీ ఈ ‘గాజు గ్లాస్’ గుర్తును కేటాయించింది. అక్కడ బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థికి గుర్తింపు లేని రాజకీయ అయిన జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలోనే బీజేపీ, జనసేనలు ఇప్పుడు ‘గాజు గ్లాసు’కు ఓట్లు వేయవద్దని ప్రచారం చేస్తున్నారు. పొత్తులో ఉన్నందున కమలం గుర్తుకు ఓట్లు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఇది నవతరం పార్టీకి నష్టం కలిగిస్తుందని ఆ పార్టీ అభ్యర్థులు తాజాగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
జనసేన పార్టీ అధికారిక వెబ్ సైట్లో గాజు గ్లాసు గుర్తు తొలగించాలని.. జనసేన పార్టీ అధికారిక వెబ్ సైట్లో గాజు గ్లాసు గుర్తు ప్రదర్శించడం వల్ల నవతరం పార్టీ అభ్యర్థికి బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నష్టం కలిగే వీలుందని వారు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ కు ఈసీ గాజు గ్లాసు గుర్తు ఉపయోగించకుండా చూడాలని కోరారు. సోము వీర్రాజు ను ఈ గుర్తుకు వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా చూడాలని ఫిర్యాదులో కోరారు.
దీంతో ఈ పరిణామం ఇప్పుడు జనసేనకు, బీజేపీకి ఇబ్బందులు కలిగించేలా ఉంది. మరి జనసేనాని ఈ గుర్తు బాధను ఎలా అధిగమిస్తాడన్నది వేచిచూడాలి.