Paddy Procurement Telangana: ధాన్యం అమ్మకంలో ఓ కార్పొరేషన్ చైర్మన్ కీ రోల్.. 900 కోట్ల సర్కారు సొమ్ముకు స్కెచ్

ప్రభుత్వం అమ్మాలని నిర్ణయించిన 25 లక్షల టన్నుల ధాన్యం ప్రస్తుతం రాష్ట్రంలోని పలు రైస్‌మిల్లుల్లో ఉంది. టెండర్లలో బిడ్డింగ్‌ వేసినవారు ఈ ధాన్యాన్ని దక్కించుకుంటే.

  • Written By: Bhaskar
  • Published On:
Paddy Procurement Telangana: ధాన్యం అమ్మకంలో ఓ కార్పొరేషన్ చైర్మన్ కీ రోల్.. 900 కోట్ల సర్కారు సొమ్ముకు స్కెచ్

Paddy Procurement Telangana: కష్టపడేది ఉండదు. చెమట చుక్క చిందించేదీ ఉండదు. పైసా ఖర్చు చేయాల్సిన అవసరం అసలు ఉండదు. అధికారం ఉంది. ఆ పై పదవి ఉంది. పార్టీ పెద్దల అండ ఉంది. ఇంకేముంది దర్జాగా ప్లాన్ రెడీ అయింది. 900 కోట్లు కొట్టేసేందుకు స్కెచ్ దాదాపుగా ఓకే అయింది. సర్కారు సొమ్మును దిగమింగడమే మిగిలింది.

ఓ పది బడా కంపెనీలు! రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏడాదికి రూ.200 కోట్ల టర్నోవర్‌, రూ.20 కోట్ల నికర లాభం ఉన్న కంపెనీలే! అయితే కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఆ బడా కంపెనీలకు, వాటితో లోపాయికారీ ఒప్పందంలో ఉన్న కొందరు పెద్దలకు కాసుల పంట పండించేలా ఉంది. గత యాసంగి సీజన్‌లో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం.. మద్దతు ధరగా రూ.2060 చెల్లించింది. కాగా, వాటి రవాణాకు, ఇతర ఖర్చులకు సుమారు రూ.240 అయిందని అంచనా. అంటే ఒక క్వింటా ధాన్యానికి అయిన ఖర్చు రూ.2300. ఈ ధాన్యం కొనుగోలు చేసిన ఆరు నెలల తర్వాత ప్రభుత్వం అమ్మేయాలని నిర్ణయించింది. సాధారణంగా ఎవరైనా.. కొన్న ధరకు కొంచెం అధికంగా, లేకుంటే కనీసం ఆ ధరనైనా కనీస ధరగా నిర్ణయిస్తారు. కానీ, ధాన్యం టెండర్లలో అసలు కనీస ధరనే నిర్ణయించలేదు. వచ్చిన టెండర్లలోనూ కోట్‌ చేసిన కనిష్ఠ ధర రూ.1618 కాగా, గరిష్ఠ ధర రూ.1732 మాత్రమే. అంటే ప్రభుత్వానికి అయిన ఖర్చుకు, టెండర్లలో వేసిన కొటేషన్‌కు మధ్య తేడా కనీసం రూ.600 ఉంది. ఒక క్వింటాలుకు ఇంత తేడా చొప్పున ప్రభుత్వం అమ్మాలని నిర్ణయించిన 25 లక్షల టన్నులకు ఇది రూ.1500 కోట్లు అవుతుంది. ఇంత భారీ మొత్తాన్ని చేతికి మట్టి అంటకుండా పంచుకోవడానికి స్కెచ్‌ వేసేశారన్నది అంతర్గత రహస్యం.

దక్కించుకుంటే చాలు..

ప్రభుత్వం అమ్మాలని నిర్ణయించిన 25 లక్షల టన్నుల ధాన్యం ప్రస్తుతం రాష్ట్రంలోని పలు రైస్‌మిల్లుల్లో ఉంది. టెండర్లలో బిడ్డింగ్‌ వేసినవారు ఈ ధాన్యాన్ని దక్కించుకుంటే.. లారీలు పెట్టేది ఉండదు.. ధాన్యం లోడెత్తేది ఉండదు.. ఎక్కడికీ రవాణా చేసి అమ్ముకునేదీ ఉండదు. రైస్‌మిల్లర్లు అడిగిన ధరకు అమ్ముకుంటే చాలు.. కూర్చున్న చోటికి వందల కోట్ల రూపాయలు నడుచుకుంటూ వస్తాయి. ఎందుకంటే.. క్వింటా ధాన్యానికి రూ.2060 ఇస్తామని రైస్‌ మిల్లర్లే చెబుతున్నారు. ‘ఎమ్మెస్పీ’కి ధాన్యం కొనుగోలు చేయటానికి సిద్ధంగా ఉన్నామని వారు లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చారు కూడా! అంటే టెండరుదారుకు సరుకు తీసుకోకుండానే క్వింటాలుకు రూ.360 చొప్పున.. మొత్తం రూ.900 కోట్లు లాభం వస్తుంది. కాగితాల మీద టెండర్‌ దక్కించుకుని.. మిల్లర్ల వద్ద రూ.2060 తీసుకుని అందులో సుమారు రూ.1700 ప్రభుత్వానికి చెల్లించి.. మిగిలింది తాము, ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కలిసి పంచుకుంటారన్నమాట! ఈ పంపకాల విలువ తక్కువలో తక్కువ రూ.900 కోట్లు ఉండే అవకాశముంది. ఒకవేళ ఆ ధాన్యాన్ని బయట అమ్మితే ఈ అక్రమ లబ్ధి విలువ రూ.1500 కోట్లు కూడా ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, ఇప్పుడు దానిని అడ్డికి పావుశేరు చొప్పున అమ్ముకొని రూ.1,500 కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వం ముందుడగు వేస్తే, ఆ టెండరుదారులకే ధాన్యం అప్పగించాలని నిర్ణయిస్తే.. టెండర్లు వేసిన ఏజెన్సీలకు ప్రజాధనాన్ని దోచిపెట్టినట్లు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం టెండర్ల ప్రక్రియలో లోటుపాట్లు ఇంత స్పష్టంగా కళ్లముందు కనిపిస్తున్న నేపథ్యంలో.. కేసీఆర్‌ ప్రభుత్వం ముందుకు వెళ్తుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఓ కార్పొరేషన్‌ చైర్మన్‌ కీ రోల్‌

ధాన్యం టెండర్ల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 25 లక్షల టన్నులను 25 లాట్లుగా విభజించి టెండర్లు పిలవగా.. ఇందులో 10 లాట్లకు సింగిల్‌ బిడ్డింగ్‌లు దాఖలు కావడం గమనార్హం. పేరుకు గ్లోబల్‌ టెండర్లు నిర్వహించినట్లు చెబుతున్నా.. వాస్తవానికి లోకల్‌ టెండర్లు ఎలా జరుగుతాయో అలాగే జరిగాయి. ఆన్‌లైన్‌ టెండర్లు పిలిస్తే.. ఒకరు కోట్‌ చేసిన ధర మరొకరికి తెలిసే అవకాశం ఉండదు. టెక్నికల్‌ బిడ్లు తెరిచేవరకు కూడా ఎవరెవరు పోటీ పడతారో, ఎన్ని బిడ్డింగులు దాఖలు చేస్తారో, ఎంత కోట్‌ చేస్తారో కూడా తెలియదు. కానీ, తాజాగా కేసీఆర్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న ధాన్యం టెండర్లలో 10 లాట్లకు సింగిల్‌ బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి. అంటే 10 లక్షల టన్నుల ధాన్యానికి పోటీయే లేదు. బిడ్డింగ్‌ దాఖలు చేసిన ఆ ఒక్కరికే టెండరు కట్టబెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సింగిల్‌ టెండర్లు దాఖలైతే.. టెండరు ప్రక్రియను కొనసాగించకుండా రద్దు చేయడమే మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే టెండర్లు వేయటానికి పోటీకి వచ్చిన బిడ్డర్లను ఒక రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ ‘రింగ్‌’ చేసినట్లు చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో బిడ్డర్లను కూర్చోబెట్టి నయానా, భయానా ఒప్పించి కూటమి కట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. టెండర్లు ఎందుకు వేయకూడదని ప్రశ్నించిన ఒకరిద్దరు బిడ్డర్లకు వార్నింగ్‌లు కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు