CBN Election Team : ఎన్నికల టీమ్ రెడీ.. ఆ ఐదుగురికి బాబు గ్రీన్ సిగ్నల్
తాజాగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జిలతో చంద్రబాబు సమావేశమయ్యారు. నిమ్మల రామానాయుడు (పాలకొల్లు), మండలి బుద్ధ ప్రసాద్ (అవనిగడ్డ), బొండా ఉమామహేశ్వరరావు (విజయవాడ సెంట్రల్), తంగిరాల సౌమ్య (నందిగామ), శ్రీరాం తాతయ్య (జగ్గయ్యపేట)లతో నియోజకవర్గాల వారీగా సమీక్ష చేశారు. కీలక సూచనలిచ్చారు.

CBN Election Team : చంద్రబాబు ఎన్నికల టీమ్ ను రెడీ చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా.. షెడ్యూల్ ప్రకారం జరిగినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న లోపాలను సరిచేసుకోవాలని నాయకులకు సూచిస్తున్నారు. ఎక్కడైనా ఇబ్బందులుంటే సమన్వయం చేసుకోవాలని.. పార్టీ మేనిఫెస్టో ప్రకారం ప్రజల్లోకి వెళ్లాలని సూచిస్తున్నారు. ఇబ్బందులు లేని నియోజకవర్గాల్లో ఆశావహులకు క్లియరెన్స్ ఇస్తున్నారు. వెళ్లి పనిచేసుకోవాలని సూచిస్తున్నారు. నలుగురు సీనియర్లకు చంద్రబాబు గ్రిన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
చివరి వరకూ జాప్యం చేస్తారని చంద్రబాబుపై ఒక అపవాదు ఉంది. చివరి నిమిషంలో టిక్కెట్ల ఖరారుతో ప్రతికూల ప్రభావం అధికం. ఇది గతంలో చాలా సందర్భాల్లో జరిగింది. అందుకే ఈసారి ముందుగానే అలెర్టవుతున్నారు. అటు పార్టీ శ్రేణులకు అలెర్టు చేస్తున్నారు. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలపై రకరకాల ప్రచారం వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు పావులు కదుపుతున్నారు. తాజాగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జిలతో చంద్రబాబు సమావేశమయ్యారు. నిమ్మల రామానాయుడు (పాలకొల్లు), మండలి బుద్ధ ప్రసాద్ (అవనిగడ్డ), బొండా ఉమామహేశ్వరరావు (విజయవాడ సెంట్రల్), తంగిరాల సౌమ్య (నందిగామ), శ్రీరాం తాతయ్య (జగ్గయ్యపేట)లతో నియోజకవర్గాల వారీగా సమీక్ష చేశారు. కీలక సూచనలిచ్చారు.
ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులపై తన దగ్గర ఉన్న నివేదికతో చంద్రబాబు మాట్లాడారు. ఎక్కడెక్కడ సరిచేసుకోవాలో వారికి సూచించారు. తాను ఎవరినీ వదులుకోవటానికి సిద్దంగా లేనని చెప్పుకొచ్చారు. బాగా పనిచేస్తే తన ప్రోత్సాహం ఉంటుందన్నారు. పనిచేయకుండా వెనుకబడిపోతే తాను మరొకరిని వెతుక్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇవ్వాల్సిన గౌరవం ఇస్తానని… అదే సమయంలో పనిచేయకపోతే కూడా ఊరుకోనని స్పష్టం చేసారు. అవసరమైన చోటు ఒక అడుగు తగ్గి అందిరనీ కలుపుకొని వెళ్లాలని సూచించారు. మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని నిర్దేశించారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను టార్గెట్ చేయాలన్నారు.
టీడీపీ నేతల్లో కలవరం ప్రారంభమైంది. అటు లోకేష్ సైతం నియోజకవర్గ ఇన్ చార్జిలు ఫైనల్ అభ్యర్థులు కాబోరని మహానాడు వేదికగా ప్రకటించడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు సైతం నియోజకవర్గాల్లో సర్వే చేసిన నివేదికతో సమీక్షిస్తుండడంతో టీడీపీ ఇన్ చార్జిల్లో ఒక రకమైన భయం నెలకొంది. ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు మొహమాటాలకు పోవడం లేదు. అలాగని ఏ ఒక్కర్నీ వదులుకోనని ప్రకటించారు. అధినేత వైఖరితో టీడీపీలో జోష్ నెలకొంది.
