Aditya _ L1 : శంకర సుబ్రహ్మణ్యన్.. ‘ఆదిత్య_ ఎల్1’ కు కర్త, కర్మ, క్రియ
ఆదిత్య-ఎల్1ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయనకు శాస్త్రవేత్తలు నివాళులర్పించారు.

Aditya _ L1 :చంద్రయాన్-3 విజయంతో భారత్ చరిత్ర సృష్టించింది. ఇక వాట్ నెక్ట్స్..? అనేలోపే.. ఇస్రో సూర్యుడిపై గురిపెట్టింది. తొలిసారిగా ఆదిత్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 125 రోజులు.. 15 లక్షల కిలోమీటర్ల పాటు సాగే ఈ సుదీర్ఘ యాత్రలో తొలి అడుగు ఘనంగా పడింది. కోట్లాది భారతీయు ఆశలను మోసుకుంటూ నింగిలోకి ఎగిరిన పీఎస్‌ఎల్వీ-సీ57 రాకెట్ ఆదిత్య-ఎల్1ను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. దీంతో ఈ ప్రయోగం తొలి ఘట్టం విజయవం తమైనట్టు ఇస్రో ప్రకటించింది. సరే ఇదంతా ఒక ఎత్తు. ఇంతకీ ఈ సూర్యయాత్ర ఎవరి మదిలో పురుడు పోసుకుంది? ఈ ప్రయోగం ఆయన మానస పుత్రిక ఎలా అయింది? దీని కోసం ఆయన ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నారు? వీటిపై ప్రత్యేక కథనం.
సూర్యునిపై పరిశోధనల కోసం ఇస్రో ప్రారంభించిన మరో ప్రతిష్ఠాత్మకమైన అంతరిక్ష మిషన్ ‘ఆదిత్య ఎల్1’. ఈ మిషన్‌తోపాటు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కె.శంకరసుబ్రహ్మణ్యన్. ఈ ప్రాజెక్టుకు ఆయన సారథ్యం వహిస్తున్నారు. అయితే, ఇస్రోలో శంకర సుబ్రహ్మణ్యం ఉద్యోగి కాదు. ప్రత్యేకించి ఆదిత్య మిషన్ కోసమే ఆయనను ఇస్రో ఎంపిక చేసింది. అపార సౌర పరిజ్ఞానం కలిగిన ఈయన సోలార్‌కు సంబంధించిన విషయాల్లో ఎన్నో విలువైన పరిశోధనలు చేశారు. అంతరిక్ష పరిశోధనలకు తరచూ శంకర సుబ్రహ్మణ్యన్ సేవలను ఇస్రో వినియోగించుకుంటోంది.
గతంలోనూ కీలక భూమిక
గతంలో ఆస్ర్టోశాట్, చంద్రయాన్-1,2 పరిశోధనల్లోనూ అనేక స్థాయుల్లో కీలక భూమిక పోషించారు. ఈ నేపథ్యంలో తాను తొలిసారి భానుడిపై చేపట్టిన ‘ఆదిత్య ఎల్1’ ప్రాజెక్టుకు ముఖ్య శాస్త్రవేత్తగా ఇస్రో ఆయనను ఎంపిక చేసింది. ఇదిలా ఉండగా, ఆదిత్య-ఎల్1 మిషన్ ఇస్రో మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు కన్న కల. ప్రొఫెసర్ యు.ఆర్. రావుగా సుపరిచితులైన ఆయన మానస పుత్రిక ఈ ప్రాజెక్టు. దీన్ని సాకారం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. భారతదేశ అంతరిక్ష కార్యక్రమ కార్యక్రమానికి పితామహుడిగా పిలుచుకొనే ప్రొఫెసర్ రావు.. ఆదిత్య మిషన్‌పై ఎంతో ప్రత్యేక శద్ధ చూపేవారని ఇస్రో వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. ఆదిత్య-ఎల్1ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయనకు శాస్త్రవేత్తలు నివాళులర్పించారు.
