Telangana Congress: బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్.. ఆ విధానంలోనే అభ్యర్థుల ఎంపిక
అభ్యర్థుల ఎంపికలో కచ్చితత్వానికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తోంది. ఇందుకు ఫ్లాష్ సర్వే మార్గాన్నీ ఎంచుకుంది. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల విషయంలోనూ ఇదే విధానాన్ని ఆయన అనుసరించారు.

Telangana Congress: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభించింది. అయితే ఈసారి జరిగే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే భారత రాష్ట్ర సమితికి గట్టి పోటీ ఇచ్చేదుకు కసరత్తు చేస్తోంది.ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఆచి తూచి వ్యవహరిస్తోంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో అధికారుల్లో ఉన్న భారత రాష్ట్ర సమితి బాటనే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నది. భారత రాష్ట్ర సమితిని తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని పాటించడం వెనుక మతలబు వేరే ఉంది.
అభ్యర్థుల ఎంపికలో కచ్చితత్వానికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తోంది. ఇందుకు ఫ్లాష్ సర్వే మార్గాన్నీ ఎంచుకుంది. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల విషయంలోనూ ఇదే విధానాన్ని ఆయన అనుసరించారు. ఆయన రంగంలోకి దింపిన బృందం ఫ్లాష్ సర్వే చేసి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే కెసిఆర్ టికెట్లు ఇప్పుడు ఇదే మార్గాన్ని కాంగ్రెస్ కూడా అనుసరిస్తున్నది. ఇటీవల ఢిలీలో జరిగిన స్ర్కీనింగ్ కమిటీ సమావేశంలో ఎంపికైన సింగిల్ నేమ్, డబుల్ నేమ్‌లలో అభ్యంతరాలు వ్యక్తమైన చోట్ల ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తోంది. మొత్తం 20 నుంచి 25 స్థానాల్లో రెండు సంస్థలు ఈ ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. స్ర్కీనింగ్ కమిటీ చైర్మన్ మరళీధరన్ నేతృత్వంలో కమిటీ సభ్యులు జిగ్నేష్ మేవాని, సిద్దిఖి, మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్‌లు ఇటీవల ఢిల్లీలో రెండు రోజుల పాటు అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా సమీక్షించిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో 42 సీట్ల విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చి సింగిల్ నేమ్‌లను ఎంపిక చేయగా.. 30 నుంచి 35 స్థానాల్లో ప్రాధాన్యతా క్రమంలో రెండు నుంచి మూడు పేర్లు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణలు, సర్వే నివేదికలనూ పరిగణనలోకి తీసుకుని ఈ కసరత్తు పూర్తి చేశారు. అయితే ఈ ఎంపిక ప్రక్రియలో పలు స్థానాల్లో ప్రాధాన్యాల నిర్ణయం, సామాజిక సమీకరణలు వంటి వాటిపైన స్ర్కీనింగ్ కమిటీ సమావేశంలోను, బయటా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
రెండు నుంచి మూడు పేర్లు ఎంపిక చేసిన సీట్లలో అభ్యంతరాలు వ్యక్తమైన 20 నుంచి 25 స్థానాల్లో ఫ్లాష్ సర్వేలు నిర్వహించాలని, స్ర్కీనింగ్ కమిటీ మరోమారు భేటీ అయి తొలి జాబితా అభ్యర్థుల ఎంపిక కసరత్తును పూర్తి చేయాలనుకున్నారు. ఆ మేరకు పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలోని ఒక సర్వే బృందం.. అధిష్ఠానం ఆధ్వర్యంలోని మరో సర్వే బృందం ఆయా స్థానాల్లో ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఫ్లాష్ సర్వేలు పూర్తి కానున్నాయని, ఆ సర్వే నివేదికల ఆధారంగా ఈ నెల 29న స్ర్కీనింగ్ కమిటీ ఢిల్లీలో మరోమారు భేటీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లోపు పార్టీ కొంత వీక్‌గా ఉన్న స్థానాల్లో ఇతర పార్టీల నుంచి చేరికల ప్రక్రియలూ జరగనున్నాయని, ఆయా సీట్లలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా 29న స్ర్కీనింగ్ కమిటీలోనే సమీక్షించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో అభ్యర్థుల నిర్ణయానికి ఈ నెల 30 లేదా అక్టోబరు 1న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితాకు ఆమోదముద్ర పడనుందని, 80 మందికి పైగా అభ్యర్థులతో అక్టోబరు మొదటి వారంలో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏకాభిప్రాయం వచ్చిన 42 పేర్లలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పోదెం వీరయ్య, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్ నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఉత్తమ్ పద్మావతీ రెడ్డి తదితర ముఖ్యనాయకులే ఉన్నారు. సామాజిక సమీకరణాల రీత్యా ఒకటి, రెండుచోట్ల మినహా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. నియోజకవర్గానికి రెండు నుంచి మూడు పేర్లు ఎంపికైన చోట్లనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సవాలుగా మారింది. ఉదాహరణకు సూర్యాపేటలో మాజీ మంత్రి రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమే్‌షరెడ్డిలలో ఎవరిని ఎంపిక చేయాలన్నది స్ర్కీనింగ్ కమిటీకి సవాలుగా మారింది. సర్వేలు ఏమి తేల్చినా ఒకరిని ఎంపిక చేస్తే మరో నేత ఎంతవరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకంగా ఉంది. తుంగతుర్తిలో డాక్టర్ రవి, పిడమర్తి రవి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. అద్దంకి దయాకర్ తనవంతు ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు. బాన్సువాడలో మూడు సార్లుగా పోటీ చేస్తున్న కాసుల బాలరాజుతో పాటుగా డాక్టర్ అజయ్‌కుమార్ అనే ఎన్నారై పేరూ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ నేత మధన్‌మోహన్‌రావునూ బాన్సువాడ నుంచి రంగంలో దించితే ఎలా ఉంటుందన్న ఆలోచనా ఉన్నట్లు చెబుతున్నారు. జనగామలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతా్‌పరెడ్డి అభ్యర్థిత్వానికి స్ర్కీనింగ్ కమిటీ మొగ్గు చూపుతుండగా.. టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇలా పలు నియోజకవర్గాల్లో రెండు నుంచి మూడు పేర్లలో అభ్యర్థిని ఎంపిక చేయడం సవాలుగా మారడంతో ఫ్లాష్ సర్వేల మార్గాన్ని స్ర్కీనింగ్ కమిటీ ఎంచుకుంది. కమిటీ సూచించిన వారికే టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపుకు సంబంధించి మొదట దరఖాస్తులను స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించే విధానానికి శ్రీకారం చుట్టింది.
