Hyderabad: ఓల్డ్ సిటీలో టెన్షన్.. ప్రజల్లో భయాందోళన
జిహెచ్ఎంసి ,ఎన్ఫోర్స్మెంట్ ,విజిలెన్స్ బృందాలు ఆదివారం నాడు సంఘటనా స్థలాన్ని సందర్శించి చుట్టుపక్కల పరిశీలించడం జరిగింది.

Hyderabad: హైదరాబాద్ బహదూర్‌పురాలో నిర్మాణం దశలో ఉన్న ఒక భవనం ఒక్కవైపుకి ఒరిగిపోవడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. నాలుగు రోజుల క్రితం ఈ భవనంలోని సెల్లార్ కు సంబంధించిన కొన్ని పనులను చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో నాలుగు అంతస్తుల ఎత్తు ఉన్న ఈ భవనం ఒక్కసారిగా ఒరిగిపోవడం మొదలైందని ఆ ప్రాంతం వాసులు తెలియజేశారు. మరికొందరు భవన నిర్మాణానికి ఉపయోగించినటువంటి వస్తువుల నాణ్యత లోపం కారణంగానే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
జిహెచ్ఎంసి ,ఎన్ఫోర్స్మెంట్ ,విజిలెన్స్ బృందాలు ఆదివారం నాడు సంఘటనా స్థలాన్ని సందర్శించి చుట్టుపక్కల పరిశీలించడం జరిగింది. ముందు జాగ్రత్త చర్యగా భవన నిర్మాణం సమీప ప్రాంతాల నివాసితులను ఖాళీ చేయమని కోరడం జరిగింది. ఎప్పుడు బిల్డింగ్ ఎత్తిన పడుతుందో అన్న భయంతో ఉన్న సమీప నివాసస్తులు చాలా మంది తమ బంధువుల ఇంటికి వెళ్ళగా… కొంతమంది మాత్రం ఆశ్రయం కోసం స్థానిక కమ్యూనిటీ హాల్స్ లేక దేవాలయాలు వంటి వాటిని ఆశ్రయించారు.
భవనం నిర్మాణ స్థిరత్వం బలహీన పడిన కారణంగా ఇలా ఒక పక్కకు ఒరిగిపోవడం జరిగిందని అంచనా వేసిన జిహెచ్ఎంసి అధికారులు త్వరలోనే ఈ బిల్డింగ్ ని కూల్చివేయబోతున్నట్లు తెలియపరిచారు.”ఈ భవనానికి సంబంధించిన యజమానిని సంప్రదించి వీలైనంత త్వరగా దీనిని కూల్చివేయాలని చెప్పాను. చుట్టుపక్కల ఉన్న వారికి ఎటువంటి నష్టం కలగకుండా క్రేళ్ల ద్వారా భవనాన్ని నెమ్మదిగా కిందకు దించేందుకు ఏర్పాటు చేస్తున్నాము..”అని జిహెచ్ఎంసి అధికారి తెలియజేశారు.
బిల్డింగ్ పూర్తిగా ఒక పక్కకి ఒరగడంతో ఎప్పుడు అది కింద పడుతుందో అర్థం కాని స్థితిలో ఆ ప్రాంతం ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అందుకే ఇప్పటికే చాలా వరకు ఆ స్థలం సమీపంలోని నివాసితులను ఖాళీ చేయించి ముందు జాగ్రత్త కోసం ప్రాంతాన్ని చుట్టుముట్టి పరిశోధనలు కొనసాగిస్తున్నారు జిహెచ్ఎంసి, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు. భవనానికి సంబంధించిన యజమానులు భవనాన్ని తిరిగి పైకి ఎత్తడానికి హైడ్రాలిక్ జాక్కులను ఉపయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అధికారులు తెలియపరిచారు.
