Pawankalyan : పవన్ ఆ రెండు లేవనెత్తింది అందుకే
వచ్చే ఎన్నికల్లో వలంటీరు వ్యవస్థ ద్వారా గట్టెక్కుదామనుకుంటే.. ఉన్న ఒక్క అవకాశాన్ని సైతం పవన్ చెడగొట్టేలా ఉన్నారే అని అధికార పార్టీ నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. సో ఈ విషయంలో పవన్ వ్యూహం సక్సెస్ అయినట్టేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Pawankalyan : ఏపీలో వలంటీర్ల పాత్రపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. వలంటీర్ల వెనుక ఇంత కథ ఉందా? అని సామాన్య జనాలు సైతం ఆరాతీస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ఏ ఇద్దరు కలిసినా వలంటీర్ల ప్రస్తావనే. ఇన్నాళ్లు పింఛన్లు, ఇతర పథకాల గురించి వివరాలు సేకరిస్తున్నారని అంతా భావించారు. అయితే ఎప్పుడైతే వ్యక్తిగత సమాచారం, గోప్యంగా ఉండాల్సిన వివరాలు వారి ద్వారా బయటకు వెళుతున్నాయని ఆరోపణలు రావడంతో ఒకరకమైన భావన వారిపై ఏర్పడింది. ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత? అని ఆరాతీసేవారు ఎక్కువవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఎక్కువగా చర్చిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ ఒక నిర్మాణాత్మకమైన అంశాన్ని బయటపెట్టినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒకటి మాత్రం నిజం. నాలుగేళ్లలో వలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడేందుకు ఏ నాయకుడూ సాహసించలేదు. అంతెందుకు మొన్న ఆ మధ్యన టీడీపీ అధికారంలోకి వస్తే వలంటీర్లను తొలగిస్తారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే దీనిపై యువగళం పాదయాత్రలో ఉన్న లోకేష్ స్పందించారు. అటువంటిదేమీ ఉండదని మాత్రమే చెప్పుకొచ్చారు. కానీ వలంటీరు వ్యవస్థలో లోపాలు, దాని వెనుక ఉన్న పొలిటికల్ స్ట్రాటజీ గురించి ఒక్క మాట కూడా అనలేకపోయారు. కానీ పవన్ మాత్రం అధికార పార్టీ నుంచి ఎదురుదాడి, అధికార పార్టీ అస్మదీయులైన మేధావి వర్గం నుంచి అభ్యంతరాలు వస్తాయని తెలిసినా వలంటీరు వ్యవస్థ గురించి నిర్మాణాత్మకమైన పోరాట పంథాను కొనసాగిస్తున్నారు.
అయితే పవన్ పక్కా పొలిటికల్ వ్యూహంతోనే రెండు అంశాలను తెరపైకి తెచ్చారు. ముల్లును ముల్లుతో తీయ్యాలన్న కాన్సెప్ట్ ను ఎంచుకున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు జన్మభూమి కమిటీలను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. పార్టీ నేతలతో ఏర్పాటైన కమిటీ సంక్షేమ పథకాల అమలు నుంచి సిఫారసు వరకూ బాధ్యతలు చూసేది. అప్పట్లో జన్మభూమి కమిటీలు పంపించిన వివరాలను సేవామిత్ర యాప్ ద్వారా నమోదుచేశారు. ఈ డేటాను హైదరాబాద్ లో ఓ ఏజెన్సీలో దాచేవారు. అప్పట్లో జన్మభూమి కమిటీలతో పాటు డేటా చౌర్యం జరిగిందని జగన్ ఆరోపణలు చేశారు. అవి వర్కవుట్ అయ్యాయి. ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.
ఇప్పుడు అవే అంశాలను పవన్ బయటకు తీసేసరికి అధికార వైసీపీ గిలగిలలాడుతోంది. అసలు పాయింట్ ను పవన్ పట్టేసరికి ఏంచేయాలో పాలుపోక మల్లగుల్లాలు పడుతోంది. కక్కలేక మింగలేక వలంటీర్లను ముందుపెట్టి నానా యాగీ చేస్తోంది. అటు పవన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెబుతుండడంతో అధికార పార్టీలో కలవరం ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో వలంటీరు వ్యవస్థ ద్వారా గట్టెక్కుదామనుకుంటే.. ఉన్న ఒక్క అవకాశాన్ని సైతం పవన్ చెడగొట్టేలా ఉన్నారే అని అధికార పార్టీ నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. సో ఈ విషయంలో పవన్ వ్యూహం సక్సెస్ అయినట్టేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
