
KCR- Jagan
KCR- Jagan: రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. తెలంగాణలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటును బిజెపి కైవసం చేసుకోగా, ఆంధ్రప్రదేశ్లోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని, మరో స్థానంలో హోరాహోరీగా పోటీనిస్తోంది. ఇది రెండు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పునకు దోహదం చేసే అంశాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు అండగా ఉంటూ వస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి ఝలక్ ఇవ్వడం చూస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం పై ఆయా వర్గాల్లో వ్యతిరేకత ప్రారంభమైనట్లు అర్థమవుతుంది. తెలంగాణలో సుమారు తొమ్మిదేళ్ల తర్వాత అధికార పార్టీపై ఈ రెండు వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా, ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల కాకముందే అధికార పార్టీపై పట్టభద్రులు తీవ్ర వ్యతిరేకతను ఓటు రూపంలో చూపించడం గమనార్హం. ఉత్తరాంధ్రతోపాటు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల సీటును తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఇది అధికార పార్టీపై ఆయా వర్గాల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను స్పష్టం చేస్తోంది.
తెలంగాణలో మూడో ప్రత్యామ్నాయం..
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనివిధంగా త్రిముఖ పోటీ నెలకొంది. ఒకప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ మధ్య పోటీ ఉంటే రాష్ట్ర విభజన తర్వాత టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ నెలకొంది. అయితే తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎక్కడ గత కొంతకాలంగా త్రిముఖ పోటీ నెలకొంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలమైన ప్రతిపక్షంగా నిలదొక్కుకుంది. బిజెపికి ఈ రాష్ట్రంలో బలమైన నాయకులు ఉండడంతో భారీగానే సీట్లు సాధిస్తోంది. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలు అధికార బీఆర్ఎస్ పార్టీకి కఠినంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒకపక్క రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ బలంగానే కనిపిస్తుండగా, మరోపక్క బండి సంజయ్, ఈటెల రాజేంద్ర కీలక నేతల ఆధ్వర్యంలో బీజేపీ కూడా బలంగా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేకతను కనబరచాలనుకునే ఓటర్లకు మూడో ప్రత్యామ్నాయంగా బిజెపి కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు అన్నది వేచి చూడాల్సిందే.
ఏపీలో భిన్నమైన పరిస్థితి..
తెలంగాణ మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు త్రిముఖ పోటీ లేదు. తెలుగుదేశం పార్టీ, ప్రస్తుత అధికార వైసీపీ మధ్య గత రెండు ఎన్నికల్లో పోటీ నెలకొంది. అయితే రాష్ట్రంలో క్రమంగా జనసేన పార్టీ బలం పుంజుకుంటూ బలమైన పార్టీగా విస్తరిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి టిడిపి, జనసేన పొత్తు లేకపోతే ఇక్కడ కూడా త్రిముఖ పోటీ అనివార్యం అవుతుంది.

KCR- Jagan
ప్రభుత్వాలపై పెరుగుతున్న వ్యతిరేకత..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయితే ఈ రెండు ప్రభుత్వాలు తమకున్న వ్యతిరేకతను ఏ మేరకు సరిదిద్దుకొని వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతాయన్నది వేచి చూడాల్సిన అంశంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని భవాని మూటగట్టుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనా తాజా ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలపై ఓటర్లకు ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తే, ప్రతిపక్షాలకు మాత్రం సానుకూలంశంగా చెప్పవచ్చు.