Janasena Pawan Kalyan : జనసేనలోకి మేధావుల వలసలు మొదలయ్యాయి. సమర్థ నాయకత్వం అందిస్తూ.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతున్న పవన్ కళ్యాణ్ వైపు ప్రముఖులు ఆకర్షితులవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సహజంగా మేధావులైన ఐఏఎస్, ఐపీఎస్ లకు రాజకీయ నేతలు ఎవరు నిజాయితీగా ఉంటున్నారు? ఎవరు ప్రజల్లోకి నీతిగా వెళుతున్నారు? ఎవరికి ప్రజలకు సేవ చేయాలన్న నిబద్ధత ఉందన్న విషయాన్ని ఇట్టే కనిపెడుతారు. ఎందుకంటే వారు కూడా ప్రజలకు సేవ చేసేందుకు దాదాపు 30 ఏళ్లకు పైగా ఉద్యోగంలో ఉంటారు. అందుకే ఐఏఎస్, ఐపీఎస్ లు ఏ పార్టీని ఎంపిక చేసుకుంటే వారే రాజ్యాధికారంలోకి వస్తారు. అది అనాదిగా జరుగుతున్నదే.
నాడు 2004లో చంద్రబాబు పాలనపై విరక్తితో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మద్దతు తెలిపి ఆయనను సీఎం చేయడంలో నాటి ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ఇక తెలంగాణ రాష్ట్రసమితి అధికారంలోకి రావడంలో ఉద్యోగ సంఘాల పాత్ర కాదనలేనిది. అందుకే ఎప్పుడైనా సరే ఉద్యోగులు ఎంచుకున్న పార్టీలు రాజ్యాధికారంలోకి వస్తాయి.
ప్రస్తుతం ఏపీలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ల చూపు జనసేన వైపు మళ్లింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంతో నీతి నిజాయితీలతో రాజకీయం చేస్తున్నారు. వైసీపీ పాలనను తుదముట్టించాలని ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ అవసరార్థం రాజకీయాలు చేస్తుంటే.. ప్రజా సంక్షేమమే ధ్యేయగా జనసేన కదులుతోంది. బీజేపీ కేంద్రంలో వైసీపీతో స్నేహం చేస్తూ.. ఏపీ గల్లీలో ఫైట్ చేస్తుండడం ఆ పార్టీపై నమ్మకం సడలుతోంది. ఇక చంద్రబాబు వయసు మీద పడడం.. ఆయన వారుసుడు సమర్థుడు కాకపోవడంతో ఆ పార్టీ వైపు ఎవరూ వెళ్లడం లేదు. యువకుడు, ఉత్సాహవంతుడు.. పైగా చనిపోయిన కౌలు రైతుల కోసం తను సినిమాల్లో సంపాదించిన సొంత డబ్బును ఖర్చుపెడుతున్న పవన్ నిజాయితీకి అందరూ ఫిదా అవుతున్నారు. ఈరోజుల్లో ఐదారు కోట్లు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు అందిస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ కు డబ్బుపై వ్యామోహం లేదని అర్థమవుతోంది. ఇలాంటి వారే రాష్ట్రానికి అవసరం అన్నది ఫోకస్ అవుతోంది. అందుకే ఇలాంటి రాజకీయ నేతలు ఉంటే ప్రజలకు మంచి చేస్తారన్న నమ్మకం కలుగుతోంది. అదే జనసేనలోకి వలసలకు కారణం అవుతోంది. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ వరప్రసాద్ రాకతో జనసేనలో పాజిటివ్ వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో ఉద్యోగ విరమణ చేసిన ఐ.ఏ.ఎస్. అధికారి దేవ వరప్రసాద్ గారు జనసేన పార్టీలో చేరారు. గురువారం హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరారు. పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి వరప్రసాద్ ను ఆహ్వానించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజోలు నియోజకవర్గం దిండి గ్రామానికి చెందిన వరప్రసాద్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో 30 ఏళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించారు. పౌర సరఫరాల శాఖ కార్యదర్శి, కమిషనర్, కార్మిక శాఖ కమిషనర్ లాంటి కీలక పోస్టుల్లో పనిచేశారు.
వరప్రసాద్ మాట్లాడుతూ “ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చక్కబడి అభివృద్ధి చెందాలంటే మంచి నాయకత్వం అవసరం. అది పవన్ కళ్యాణ్ ద్వారానే సాధ్యమవుతుంది. ఆ నమ్మకంతోనే జనసేనలో చేరాను. పవన్ కళ్యాణ్ తో కలసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను” అని అన్నారు.
ఏపీలో సమర్థ, మంచి నాయకత్వం కావాలంటే పవన్ రావాలని అందరూ భావిస్తున్నారు. జగన్, చంద్రబాబు పాలన చూసిన జనాలకు పవన్ కళ్యాణ్ లోని నిస్వార్థ సేవాగుణం బాగా నచ్చుతోంది. అందుకే వరప్రసాద్ తో మొదలైన మేధావుల వలసలు ఎన్నికల వరకూ మరింతగా ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే జనసేనకు వచ్చేసారి అధికారం ఖాయమంటున్నారు.