TDP Janasena Alliance: టిడిపి,జనసేన పొత్తుకు అదే కీలకం
టిడిపి,జనసేన కూటమి కచ్చితంగా వర్కౌట్ అవుతుంది. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ వీటికి షరతులు వర్తిస్తాయని చెబుతున్నారు.

TDP Janasena Alliance: పొత్తు అంటేనే మిత్ర ధర్మం. ఒకరికొకరు సాయం చేసుకోవడం. ఓట్లు, సీట్లు బదలాయించుకోవడం. ఈ ప్రక్రియను సజావుగా చేసుకుంటే పొత్తు ఫలప్రదం అవుతుంది. ఉభయతారకంగా నిలుస్తుంది. ఇప్పుడు టిడిపి,జనసేన మధ్య ఈ తరహా వాతావరణం ఉందా? నాయకత్వాల నిర్ణయాలకు నేతలు కట్టుబడతారా? పొత్తులో భాగంగా తాను వదులుకున్న స్థానంలో మిత్రపక్ష అభ్యర్థి విజయానికి సహకరిస్తారా?ఇప్పుడు ఇదే చర్చ. ఈ విషయాల్లో సమన్వయం చేసుకుంటేనే టిడిపి, జనసేనల పొత్తుకు సార్ధకత చేకూరుతుంది. లేకుంటే మొదటికే మోసం వస్తుంది.
టిడిపి,జనసేన కూటమి కచ్చితంగా వర్కౌట్ అవుతుంది. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ వీటికి షరతులు వర్తిస్తాయని చెబుతున్నారు. గత ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం ద్వారా టిడిపి 40 నియోజకవర్గాలను కోల్పోయిందని తెలుస్తోంది. భారీగా ఓట్లు చీల్చడం ద్వారా అక్కడ వైసిపి విజయం సాధించగలిగింది. అటు జనసేన అభ్యర్థి 20 వేలకు పైబడి సాధించిన నియోజకవర్గాలు దాదాపు 40 వరకు ఉన్నాయి. అటువంటి చోట సైతం పొత్తుల ద్వారా ఓట్ల బదలాయింపు అనేది కీలకం. అదే సమయంలో సీట్ల కేటాయింపు కూడా జఠి లంగా మారే అవకాశాలు ఉన్నాయి.
తెనాలి వంటి నియోజకవర్గం విషయంలో ఇప్పటికే ఒక రకమైన భిన్న వాతావరణం నెలకొంది. అది జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ సొంత నియోజకవర్గం కావడమే అందుకు కారణం. 2014 ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసిన మనోహర్ ఓటమి చవిచూశారు. ఆ సమయంలో అక్కడ ఆలపాటి రాజా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇప్పుడు మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అటు ఆలపాటి రాజా సైతం టిడిపి అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్నారు. దీంతో మనోహర్ కు అక్కడ కేటాయిస్తారా? లేకుంటా రాజాకా అన్నది తెలియడం లేదు. అయితే ఒకరికి కేటాయిస్తే మరొకరికి ప్రత్యామ్నాయ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇలాంటి జఠిలం ఒక్క తెనాలిదే కాదు. రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఇలాంటి నియోజకవర్గాలు ఉన్నాయి. అటువంటి చోట రెండు పార్టీల నేతలను సమన్వయ పరుచుకుని.. ఒప్పించి, నప్పించకపోతే మాత్రం మూల్యం తప్పదు. అందుకే జనసేన అధ్యక్షుడు పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రెండు పార్టీల మధ్య సమన్వయ బాధ్యతలను నాదెండ్ల మనోహర్ కి అప్పగించారు.
పవన్ తాజా పొత్తు ప్రకటనను జనసైనికులు విభేదిస్తున్నారు. బలవంతంగానే జై కొడుతున్నారు. ముఖ్యంగా పవర్ షేరింగ్ విషయంలో స్పష్టమైన ప్రకటన రాకుంటే.. జనసైనికుల ఓట్లు టిడిపికి దక్కే అవకాశాలు తక్కువ. ఇటువంటి ప్రత్యేక అభిమానం ఉన్న ఓటర్ల విషయంలో పవన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అటు తెలుగుదేశం పార్టీలో సైతం పవన్ ఆధిపత్యాన్ని సహించలేని వారు ఉన్నారు. అటువంటి వారిని సైతం తమ రూట్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం చంద్రబాబుపై ఉంది. ఇలా ఎలా చూసుకున్నా పొత్తు ధర్మాన్ని ఇరు పార్టీల శ్రేణులు పాటిస్తేనే 2014 ఫలితాలు రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
