India vs Canada : భారత్, కెనడా మధ్య ఉద్రిక్తత.. అమెరికా ఎటువైపు అంటే
ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకెన్ కు మైకేల్ గుర్తు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మైఖేల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

India vs Canada : ఖలిస్తాని ఉగ్రవాది నిజ్జర్ హత్యకు గురికావడం.. కెనడా ప్రధానమంత్రి ట్రూడో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ఫలితంగా భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు దౌత్యాధికారులను బహిష్కరించుకున్నాయి. ఇరు దేశాలకు చెందిన ప్రతినిధుల మాటలు మంటలు రేపుతున్న నేపథ్యంలో దౌత్యపరమైన సంబంధాలు ఇరకాటంలో పడ్డాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా ఈ వివాదంలో ఎవరి వైపు మొగ్గు చూపుతుందో పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ ఒకరు తేల్చి చెప్పారు.
“రెండు మిత్ర దేశాల విషయంలో అమెరికా ఒకరికి మద్దతుగా నిలుస్తుందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అమెరికా ముందు అలాంటి పరిస్థితి కనుక ఉండి ఉంటే అది కచ్చితంగా భారత్ వైపు మొగ్గు చూపుతుంది. ఎందుకంటే నిజ్జర్ ఒక తీవ్రవాది ఉగ్రవాది. కెనడా కేంద్రంగా వేర్పాటువాద ఉద్యమానికి బీజం వేస్తున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. అమెరికాకు భారత్ చాలా ముఖ్యమైన దేశం. అమెరికాకు భారతదేశంతో ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైనది కూడా. మరోవైపు కెనడా ప్రధాని హోదాలో ట్రూడో ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కెనడాతో మా బంధాన్ని పునర్నిర్మించుకుంటాం” అని అమెరికా వ్యవహార శైలి గురించి ఆయన వివరించారు.
అయితే ఈ వివాదంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటుందా అని విలేకరులు ప్రశ్నిస్తే.. రూబిన్ స్పష్టంగా సమాధానం చెప్పారు..”నిజం చెప్పాలంటే ఈ ఘర్షణ భారత్ కంటే కెనడాకే ఎక్కువ ప్రమాదం. అది ఏనుగుతో చీమ పోరాటం లాగే ఉంటుంది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. చైనాను ఎదుర్కొనే విషయంలో వ్యూహాత్మకంగా భారతదేశంలో మా బంధం చాలా ముఖ్యమైనది” అని రూబిన్ ప్రకటించారు. అలాగే సీమాంతర అణిచివేత అంటూ అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు.”మనల్ని మనం మోసం చేసుకోకూడదు. నిజ్జర్ కేవలం కెనడా చెప్పినట్టు ప్లంబర్ కాదు. ఒసామా బిన్ లాడెన్ ఒక ఇంజనీర్ కాదు. ఎన్నో దాడులు తీసి నిజ్జర్ చేతులు రక్తంతో తడిసిపోయాయి. మనం మాట్లాడుతున్నది సీమాంతర అణచివేత గురించి కాదు. సీమాంతర ఉగ్రవాదం గురించి” అని రూపం పేర్కొన్నారు. అమెరికా దేశంలోని ట్విన్ టవర్ టవర్స్ దాదాపు 3,000 మందిని పొట్టన పెట్టుకున్న ఆల్కైదా అధినేత బిన్ లాడెన్ ను 2011 మే 2న అమెరికా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే. ప్రత్యేక కమాండో ఆపరేషన్ చేపట్టి పాకిస్తాన్లోని అబోటో బాద్ కాంపౌండ్ లో నక్కిన లాడెన్ ను మట్టుపెట్టింది. తమ దేశానికి హాని కలిగించిన ఉగ్రవాదిని అమెరికా దళాలు పాకిస్తాన్లోనే ప్రవేశించి హతమార్చాయి. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకెన్ కు మైకేల్ గుర్తు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మైఖేల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
