TDP Mahanadu : గోదావరి తీరం పసుపు శోభితం..

మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ మహానాడు తర్వాత ఇక టీడీపీ పూర్తి స్థాయి ఎన్నికల మూడ్ లోనే ఉండనుంది. అందుకే ఆ దిశగా దిశ నిర్దేశం చేసేందుకు టీడీపీ నాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

  • Written By: Dharma Raj
  • Published On:
TDP Mahanadu : గోదావరి తీరం పసుపు శోభితం..

TDP Mahanadu : గోదావరి తీరం పసుపు వర్ణిత శోభితంగా మారింది.తెలుగుదేశం పార్టీ పసుపు పండుగకు రాజమండ్రి సిద్ధమైంది. మహానాడు ఏర్పాట్లతో నగరం కళకళలాడుతోంది. ఎన్నికల చివరి ఏడాది కావడంతో కేడర్ కు దిశ నిర్దేశం చేసేందుకు మహానాడు వేదిక కానుంది. పార్టీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేశాయి. సంక్షేమానికి సంబంధించి మేనిఫెస్టో, పొత్తుల అంశంతో పాటు కీలక అంశాలపై చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారు. అటు లోకేష్ యుగళం పాదయాత్రకు తాత్కాలికంగా నిలిపివేసి మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు.

రాజమండ్రి నగరమంతా పసుపు వర్ణమాలతో నిండిపోయింది. దారిపొడవునా ఫ్లెక్సీలు, స్వాగత బోర్డులతో కనిపిస్తోంది. శుక్రవారం సాయంత్రానికే తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ శ్రేణులు రాజమండ్రి నగరానికి చేరుకున్నాయి. దీంతో హోటళ్లు, లాడ్జిలు కిటకిటలాడుతూ కనిపించాయి. కొందరు బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. అటు రాజమండ్రి నగరానికి వాహన రద్దీ కూడా పెరిగింది. దాదాపు అన్ని రహదారులు వాహనాలతో బారులుదీరుతూ కనిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీస్ శాఖ అలెర్టయ్యింది. దాదాపు 1200 మంది సిబ్బందితో బందోబస్తు విధులు నిర్వహిస్తోంది.

అయితే ఇప్పటివరకూ నిర్వహించిన మహానాడులకు ఇది భిన్నం. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను సైతం ఏర్పాటుచేయనున్నారు. ఆదివారం ఎన్టీఆర్‌ కు నివాళులర్పించిన అనంతరం దాదాపు 15 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించను న్నారు.పార్టీ నేతలు, శ్రేణులకు ఎన్నికల కార్యా చరణపై దిశా నిర్దేశం చేయనున్నారు. మహానాడులో మొత్తం ఏపీకి సంబంధించి 15 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించి ఆరు తీర్మానాలు ప్రవేశపెట్ట డంతో పాటు పలు కీలక ప్రకటనలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఉరకలేసిన ఉత్సాహంతో మహానాడుకు టీడీపీ శ్రేణులు తరలి రావడంతో నాయకత్వంలో కొత్త జోష్ నెలకొంది. మరోవైపు మహానాడుకు రాకుండా ప్రభుత్వం ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయినా టీడీపీ శ్రేణులు సొంత వాహనాలతో చేరుకోవడం కనిపిస్తోంది. గత మహానాడును ఒంగోలులో నిర్వహించారు. అప్పటి వరకూ ఎంతో నిరాశగా ఉన్న క్యాడర్..ఒంగోలు మహానాడుకు వెల్లువలా వచ్చిన జనాన్ని చూసినప్పటి నుండి ఓపిక తెచ్చుకుంది. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది. అప్పట్నుంచి జనంలోనే ఉన్న టీడీపీ.. మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ మహానాడు తర్వాత ఇక టీడీపీ పూర్తి స్థాయి ఎన్నికల మూడ్ లోనే ఉండనుంది. అందుకే ఆ దిశగా దిశ నిర్దేశం చేసేందుకు టీడీపీ నాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

సంబంధిత వార్తలు