TDP On India Alliance: ఇండియా కూటమి వైపు తెలుగుదేశం?
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు ఆయనను ఇండియా కుటుంబం వైపు ఆహ్వానిస్తున్నట్లు తెలియజేస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఇండియా కూటమి నేతలు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ప్రత్యేకంగా స్పందించారు.

TDP On India Alliance: తెలుగుదేశం పార్టీది సుదీర్ఘ చరిత్ర. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం సాధించిన ఏకైక పార్టీ. దేశంలో ప్రాంతీయ పార్టీలకు దిక్సూచిగా నిలిచింది. జాతీయస్థాయిలో సైతం కీలక పాత్ర పోషించింది. కూటమి ప్రభుత్వాలకు నాయకత్వం వహించింది. అటువంటి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. జాతీయ రాజకీయాల్లో ఎటువైపు అడుగులు వేయాలన్న డిఫెన్స్ లో ఉంది. ఎన్డీఏ వైపు వెళ్లాలా? ఇండియా కూటమి వైపు వెళ్లాలా? అన్న మీమాంస లో ఉంది.
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు ఆయనను ఇండియా కుటుంబం వైపు ఆహ్వానిస్తున్నట్లు తెలియజేస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఇండియా కూటమి నేతలు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ప్రత్యేకంగా స్పందించారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శలు చేశారు. అయితే ఆ స్థాయిలో బిజెపి నుంచి కానీ, ఎన్డీఏ నుంచి కానీ స్పందన లేదు. ముఖ్యంగా బిజెపి కేంద్ర నాయకత్వం నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, పురందేశ్వరి వంటి నాయకులే మాట్లాడారు.
కేవలం ఇండియా కూటమి నేతలు స్పందించడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. త్వరలో తెలుగుదేశం పార్టీ ఇండియా కూటమిలో చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో ఉండే వారంతా అవినీతి చేయడం, పంచుకోవడం అలవాటు పడిన నాయకులని కామెంట్స్ చేస్తూ ట్విట్ చేశారు. తద్వారా కీలక రాజకీయ పరిణామాన్ని తన ట్విట్ ద్వారా తెలియజేశారు. టిడిపి వేరే ఆలోచనతో ఉందని వెల్లడించేలా విజయసాయి రెడ్డి కామెంట్స్ ఉన్నాయి.
మరోవైపు లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇప్పటివరకు బిజెపి ఆగ్రనేతలను ఆయన కలుసుకోలేకపోయారు. అమిత్ షా ను కలవనున్నట్లు ప్రచారం జరిగినా.. ఇంతవరకు కలవలేదు. అమిత్ షా హైదరాబాద్ వచ్చేశారు. రెండు రోజులు పాటు ఇక్కడే ఉంటారు. 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అమిత్ షా బిజీగా మారడంతో లోకేష్ కలిసేందుకు అవకాశం లేదు. సరిగ్గా ఇదే సమయంలో ఎన్డీఏకు వ్యతిరేక మీడియాగా ముద్రపడిన కొన్ని నేషనల్ ఛానళ్లకు లోకేష్ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో సదరు మీడియా సంస్థలు శ్రద్ధ చూపుతున్నాయి. ఈ పరిణామాలన్నీ టిడిపి ఇండియా కూటమి వైపు అడుగులేస్తున్నట్లు సంకేతాలిస్తున్నాయి.
