KCR – Early Elections: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కొన్ని రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళతారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ వీటన్నింటికి ఒకే సమాధానం చెప్పారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవని తేల్చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఇవాళ జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు కుండబద్ధలు కొట్టారు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని చెబుతున్నారు.

టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే బీజేపీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిర్దేశిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చిన సందర్భంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఏడాది సమయం ఉండటంతో ఎమ్మెల్యేలందరు తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారు. ప్రజా క్షేత్రంలో ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తూ ఓటు బ్యాంకును కాపాడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీకి అనుకూలంగా ఉండే పరిస్థితులు తీసుకురావద్దని పేర్కొన్నారు.
తెలంగాణలో అప్పుడే రాజకీయ వేడి రగులుకుంటోంది. ఏడాది సమయం ఉండగానే పెట్టే బేడా సర్దుకుంటున్నారు. యుద్ధానికి సన్నద్ధం కావాలని చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండకపోతే టికెట్ కూడా రాదనే విషయం చెప్పకనే చెప్పారు. ఎవరి నియోజకవర్గాల్లో వారు విస్తృతంగా పర్యటించాలని ప్రజల సమక్షంలోనే ఉండాలని నిర్దేశిస్తున్నారు. భవిష్యత్ మనకు అనుకూలంగా మలుచుకోవాలని లేదంటే చావుదెబ్బ తినే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు చేశారు.

రాబోయే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అసవరం ఉందని సూచనప్రాయంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మనదే విజయం కావాలని ఆకాంక్షించారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవని చెప్పడంతో బీజేపీ, కాంగ్రెస్ కూడా తమ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అవి కూడా ప్రజల్లో ఉండి తమకు అనుకూల ఫలితాలు వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చుక్కలు చూపించిన బీజేపీని నిలువరించాలనే ప్రయత్నంలో గులాబీ పార్టీ కూడా పలు మార్గాలు అన్వేషిస్తోంది. ఇందుకు గాను ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలని చెబుతోంది.