Site icon OkTelugu

Hyderabad Mutton Adulteration: మేక మాంసం అని చెప్పి ఎద్దు మాంసం విక్రయం..! పోలీసుల అదుపులో మటన్ విక్రయదారుడు..

Hyderabad Mutton Adulteration

Hyderabad Mutton Adulteration

Hyderabad Mutton Adulteration: ప్రస్తుతం కాలంలో ప్రతీ ఆహార వస్తువు కల్తీమయంగా మారుతోంది. ముఖ్యంగా బయట లభించే ఆహార పదార్థాల్లో కొందరు లాభాపేక్షను ఎక్కువగా ఆశించి కల్తీ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వరుసగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ మటన్ షాపులో మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి తక్కువ ధరకు హోటళ్లకు సరఫరా చేస్తున్న వ్యక్తిని అధికారులు పట్టుకోవడంతో నగరంలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో మాంసాహార ప్రియుల్లో ఆందోళన వ్యక్తమయింది. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

హైదరాబాద్ లోని హబీబ్‌నగర్ పోలీస్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లెపల్లిలోని ఓ మాంసం దుకాణంపై దాడి చేసి ఉస్మాన్ ఖురేషి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపి, స్వచ్ఛమైన మటన్‌గా చూపిస్తూ తక్కువ ధరకు హోటళ్లకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో దుకాణంలో నిల్వ ఉంచిన సుమారు 50 కిలోల అనుమానాస్పద మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మాంసాన్ని సీజ్ చేసి, ప్రయోగశాల పరీక్షల కోసం నమూనాలను పంపించారు. పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత మాంసంలో ఏయే రకాల కల్తీ జరిగిందో అధికారికంగా నిర్ధారణ కానుంది.

కల్తీ ఆహార పదార్థాల విక్రయం, వినియోగదారులను మోసం చేయడం, ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై నిందితుడు ఉస్మాన్ ఖురేషిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మాంసాన్ని ఏయే హోటళ్లకు సరఫరా చేశాడు? ఎంతకాలంగా ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతోంది? ఇందులో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ధరకు లభిస్తోందని నాణ్యత తెలియని మాంసాన్ని కొనుగోలు చేయొద్దని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. పరిశుభ్రత పాటించే, లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచే మాంసం కొనుగోలు చేయాలని, అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. నాసిరకం లేదా కల్తీ మాంసం వినియోగం వల్ల ఫుడ్ పాయిజనింగ్, ఇన్‌ఫెక్షన్లు, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Exit mobile version