Cyber Theft: సైబర్ దొంగతనాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్!
2021లో దేశవ్యాప్తంగా మొత్తం 52,430 సైబర్ నేరాలు వెలుగుచూస్తే వాటిల్లో దాదాపు 20 శాతం తెలంగాణలోనే నమోదయ్యాయి. రెండోస్థానంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్(8,829) కంటే 1,474 ఎక్కువ కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. ఆర్థిక మోసాల కోణంలో జరిగే సైబర్ నేరాలూ తెలంగాణ(8690)లోనే అధికం

Cyber Theft: ఒకడేమో బ్యాంకు అధికారిలా ఫోన్ చేసి ఖాతాను అప్‌డేట్ చేస్తామని ఓటీపీ చెప్పమంటాడు. ఇంకొకడు ఫేస్‌బుక్‌లో లింక్ పంపి.. క్లిక్ చేయమని చెప్పి ఉన్న డబ్బును ఊడ్చేస్తాడు.. మరొకడు ఓఎల్‌ఎక్స్‌లో వాహనం అమ్మకానికి పెట్టి రూ.లక్షలు కొల్లగొడతాడు.. ఇలా ఎక్కడ చూసినా, ఎవరినోట విన్నా మోసపోయామన్న ఆవేదనలు తెలంగాణలో నిత్యకృత్యమయ్యాయి. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలు దడ పుట్టిస్తున్నాయి. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో రోజుకు సగటున 42కుపైగా కేసులు నమోదవుతున్నాయి.
ఆర్థిక మోసాలపైనే గురి
2021లో దేశవ్యాప్తంగా మొత్తం 52,430 సైబర్ నేరాలు వెలుగుచూస్తే వాటిల్లో దాదాపు 20 శాతం తెలంగాణలోనే నమోదయ్యాయి. రెండోస్థానంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్(8,829) కంటే 1,474 ఎక్కువ కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. ఆర్థిక మోసాల కోణంలో జరిగే సైబర్ నేరాలూ తెలంగాణ(8690)లోనే అధికం. 2022లో రాష్ట్రంలో నమోదైన 15,217 నేరాల్లో ఆర్థిక మోసాలకు సంబంధించినవే 12,272. ఒకప్పుడు మొత్తం నేరాల్లో దొంగతనాలు, భౌతిక దాడులకు సంబంధించిన కేసులు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు వాటిని సైబర్ నేరాలు ఆక్రమించాయి. 2019లో 2,691గా ఉన్న సైబర్‌నేరాలు గతేడాది ఏకంగా 15,217కు చేరడమే ఇందుకు నిదర్శనం. మూడేళ్లలో సైబర్ మోసాలు అయిదున్నర రెట్లు పెరిగాయి.
పోలీసుల వాదన ఇలా..
సైబర్‌నేరాల విషయమై రాష్ట్ర పోలీస్‌శాఖ వాదన మరోలా ఉంది. తమ వద్దకు వస్తున్న ప్రతీ ఫిర్యాదుపై కేసు నమోదు చేయడమే కాదు దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని కొన్నిచోట్ల ఫిర్యాదును పట్టించుకునేవారే ఉండరు. అందుకే రాష్ట్రంలో కేసుల సంఖ్య ఎక్కువ కనిపిస్తోందని చెబుతుంది. తెలంగాణ కంటే ఎక్కువ నేరాలు ఉత్తరాదిలోనే జరుగుతున్నాయని ఓ పోలీస్ అధికారి తెలిపాడు. కానీ అధికారికంగా వెల్లడించడం లేదని పేర్కొన్నాడు.
సత్వర ఫిర్యాదుతోనే ఉపశమనం
సైబర్ నేరాల నియంత్రణ విషయంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై ఫిర్యాదుల కోసం ఏర్పాటైన ఇండియన్ సైబర్‌క్రై మ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) తరహాలోనే తెలంగాణ సైబర్‌క్రై మ్ కోఆర్డినేషన్ సెంటర్(టీ4సీ)ని అందుబాటులోకి తెచ్చింది. సైబర్‌నేరం నమోదైన వెంటనే సత్వరం దర్యాప్తు ఆరంభించడం ద్వారా వీలైనంత మేరకు బాధితులు పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రప్పించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. గతేడాది దాదాపు రూ.16 కోట్లకు పైగా బాధితుల సొమ్మును వెనక్కి రప్పించగలిగింది. మోసపోయిన తర్వాత ఎంత తొందరగా 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే డబ్బు వెనక్కి రప్పించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.
