Telangana Elections 2023: టికెటే పరమావధి.. జంపింగ్‌కు అదే దారి.. అన్నీ పార్టీల నేతలదీ అదే బాట!
చిన్నచితక నేతలు పార్టీలు మారితే ఆయా పార్టీలకు ప్రభావం ఏ మాత్రం ఉండకపోవచ్చు కానీ బడా నేతలు సైతం పార్టీలు మారుతుండటంతో ఆయా పార్టీల గెలుపుపై తీవ్ర ప్రభావం పడటట్టు కనిపిస్తుంది.

Telangana Elections 2023: తెలంగాణ వలస రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు అన్నట్లుగా నేతలు మారిపోతున్నారు. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేస్తున్నారు. పార్టీ లేదు.. బొక్క లేదు అని అచ్చెంనాయుడు అన్నట్లుగా తెలంగాణలో వలస రాజకీయాలు సాగుతున్నాయి. పార్టీ లేదు.. సిద్దాంతం లేదు.. టికెట్ వస్తే చాలు అన్నట్లుగా నేతలు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. తెలంగాణలో ముదిరాజ్ సమాజాకి వర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నేత, కేటీఆర్ సన్నిహితుడు నీలం మధు ఈ విషయం స్పష్టంగ చెప్పారు. పార్టీ లేదు.. దోస్తానీ లేదు. టికెట్ ఎవరు ఇస్తే ఆ పార్టీలో చేరుతా అని బీఆర్‌ఎస్ టికెట్ల ప్రకటన తర్వాత స్పష్టం చేశారు. చెప్పినట్లుగానే రెండు నెలల తర్వాత కారు దిగి హస్తం కండువా కప్పుకున్నారు. ఇప్పటి వరకు ఇలా అనేక మంది టికెట్ కోసమే వేచి ఉన్నారు. టికెట్ రానివారు పార్టీ వీడి మరో దారి చూసుకుంటున్నారు.
అన్ని పార్టీల్లో ఇదే వరుస..
తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీల్లో చిత్ర విచిత్రలు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం ఒక పార్టీ కండువా కప్పుకున్న నేతలు సాయంత్రానికి అదే పార్టీలో ఉంటాడనే నమ్మకం లేకుండాపోయింంది. దీంతో తెలంగాణ బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీకి జంపింగ్ నేతల తీరు తలనొప్పిగా మారింది. పార్టీలను నమ్ముకుని ఉండి ఎమ్మెల్యే టిక్కెట్లు తమకే వస్తాయనికొని చివరకు ఆశించిన చోట్ల టిక్కెట్లు రాకపోవటంతో వేరే పార్టీలకు మారుతున్నారు. మైనంపల్లి హనుమంతరావు నుంచి మొదలు.. నిన్న, మొన్న పార్టీ మారిన వివేక్ వెంకటస్వామి, వరకు అందరి వరస ఒక్కటే. ఎమ్మెల్యే టికెట్.. లేదంటే ఎంపీ టికెట్.. కుదిరితే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు.. అన్నట్లుగా పార్టీ మారిపోతున్నారు నేతలు.
పెద్ద నేతల నుంచి చిన్న నాయకుల వరకు..
జంపింగ్‌లు తెలంగాణలో పెద్ద నాయకుల నుంచి చిన్న నాయకుల వరకూ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ పట్టించుకోవటం లేదని బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిపోయారు. దీంతో పెద్దస్థాయిలో జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ఆయన వెంట పార్టీ మారారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వలేదని బీఆర్‌ఎస్‌ను వీడాడు. దీంతో అక్కడ బీఆర్‌ఎస్‌కు పెద్దస్థాయిలో దెబ్బపడింది. ప్రముఖ నేత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తమకు టికట్ రాలేదని కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. కొత్తగూడెం నుంచి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు జలగం వెంక్రటారావు కూడా తనకు టిక్కెట్ లభించలేదని బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరారు. జలగం వెంకట్రావు కొత్తగూడెం నుంచి మొదటిసారిగా తెలంగాణ ఏర్పడిన తరువాత ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తాను ఆశించిన చోట్ల టిక్కెటు రాలేదని బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. దీంతో చాలా చోట్ల ఈ జంపింగ్ జంపాంగ్‌లతో ఆయా పార్టీలకు తీవ్ర నష్టం జరిగేటట్టు కనిపిస్తోంది.
అన్ని పార్టీలకు నష్టం..
చిన్నచితక నేతలు పార్టీలు మారితే ఆయా పార్టీలకు ప్రభావం ఏ మాత్రం ఉండకపోవచ్చు కానీ బడా నేతలు సైతం పార్టీలు మారుతుండటంతో ఆయా పార్టీల గెలుపుపై తీవ్ర ప్రభావం పడటట్టు కనిపిస్తుంది. పార్టీ మారకుండా ఉండేందుకు బుజ్జిగింపులు సైతం చేపట్టినా ఫలితం లేకపోతుంది. ముఖ్మంగా ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారడంతో బీఆర్‌ఎస్‌కు ఓటు బ్యాంకు దెబ్బపడే అవకాశం ఉంది. అందున ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు, వాపపక్షాలకు ఓటు బ్యాంకు ఎక్కువ దీంతో ఇప్పుడు మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌లో ఉన్న పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు రూపంలో ఓటు బ్యాంకు దెబ్బపడే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా నల్లగొండ జిల్లాలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వల్ల కూడా బీజేపీ ఓటు బ్యాంకు తీవ్రస్థాయిలో దెబ్బపడే అవకాశం కనిపిస్తోంది. ఇక హైదరాబాద్‌లో పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వల్ల ఇటు కాంగ్రెస్ అటు బీఆర్‌ఎస్ ఓటుబ్యాంకు పడిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా కొందరు ముఖ్యనేతలు పార్టీలు మారన స్థానాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం కష్టంగా కనిపిస్తోంది.
కార్యర్తల్లో అయోమయం..
నేతలు పార్టీలు మారుతుండడంతో అప్పటి వరకు వారితో ఉన్న కార్యకర్తలు అయోమయంలోకి పడిపోతున్నారు. మొన్నటి వరకు వేరేపార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఆ పార్టీ నేతే పార్టీ మారిన తరుణంలో ఆయనతోపాటు వెళ్లి పనిచేయాలా లేకపోతే పార్టీని నమ్ముకుని అదే పార్టీలో ఉండాలే అర్థం కావటం లేదు. చాలా వరకు పార్టీ మారుతుండగా, మారకుండా ఉన్నవారిని సొంత పార్టీలో పట్టించుకునేవారు ఉండడం లేదు. దీంతో తమ లీడర్ వెంటే క్యాడర్ కూడా వెళ్లిపోతోంది. ఫలితంగా పార్టీలకు నష్టం జరుగుతోంది.
