RTC fare: ఆర్టీసీ బస్సు పేదల ముఖ్య రవాణా సౌకర్యం. ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు సాధారణ ప్రజల ప్రయాణం భారంగా మారిన విషయం తెలిసిందే. సమ్మె తర్వాత ప్రయాణం యధావిధిగా నడిచినా రానున్న దీపావళి తర్వాత బస్సు ప్రయాణం భారం కానుంది. దీపావళి తర్వాత ఆర్టీసీ చార్జీలు పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన కార్మికులు, తమ కోరికలను ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో 2019 అక్టోబరు, నవంబరుల్లో సమ్మె చేసారు. 52 రోజుల పాటు జరిగిన ఈ సమ్మె, కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో రాష్ట్ర సర్కారు విఫలమైంది. 2019 అక్టోబరు 4 అర్థరాత్రి నుండి సమ్మె మొదలై, నవంబరు 25 న ముగిసింది. మొత్తం ఉద్యోగులు 49,860 మందిలోను 48,660 మంది వరకూ సమ్మెలో పాల్గొన్నారు. అక్టోబరు 8న దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి స్వగ్రామాలకు చేరుకుని, పండుగ తరువాత వెనక్కి వెళ్ళే ప్రజలకు ఈ సమ్మె ఇబ్బందులు కలిగించింది.
సమ్మె తర్వాత ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు కొత్తకొత్త ఆవిష్కరణలు చేశారు. ఆర్టీసీ పాత బస్సులను కొరియర్ సర్వీసులుగానూ మార్చారు. అయినా నష్టాల నుంచి గట్టెక్కలేకపోయామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దానికి తోడు కరోనా విలయతాండవం వల్ల ఆర్టీసీ పెద్ద ఎత్తున నష్టాలు మూటగట్టుకుందని లెక్కలు చెబుతున్నారు. తెలంగాణ ఆర్టీసీని ఆర్థిక కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఓ వైపు రూ.వేల కోట్ల అప్పులతో సంస్థ సతమతమవుతుంటే.. మరోవైపు నెలనెలా రూ.వందల కోట్ల నష్టాలు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లోనే ఆర్టీసీ ఏకంగా రూ.1,246 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుందని లెక్కలు తీస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రూ.1,424 కోట్లుగా నమోదైనట్టు తెలుస్తోంది. గతంతో పోలిస్తే రూ.178 కోట్ల నష్టం తగ్గినప్పటికీ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని అధికారులు అంటున్నారు.
ఆర్టీసీని కష్టాల నుంచి గట్టెక్కించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవల నూతనంగా ఎండీ, ఛైర్మన్‌లను నియమించింది. అయితే ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాటలో నడపడం వీరికి సవాలుగా మారింది. కరోనాతో సర్వీసులు తగ్గించడం, ప్రజా రవాణాను వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవటం, తెలంగాణ, ఏపీల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు లేకపోవటంతో నష్టాలు పెరిగిపోయాయి. ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజారవాణా క్రమంగా పెరుగుతోంది. ఇటీవలే దసరా, పెళ్లిళ్ల సీజన్ రావడంతో ఆర్టీసీ రూ.3.5కోట్ల వరకు అదనపు ఆదాయం పొందించింది. ఇటీవల ఒకేరోజు రికార్డు స్థాయిలో రూ.14.79 కోట్ల ఆదాయం రావడం అధికారుల్లో ఉత్సాహం నెలకొంది. అయినా ప్రభుత్వం టిక్కెట్ రేట్లను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
దీపావళి తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ఛార్జీల పెంపుదలకు పచ్చజెండా ఊపారు. అయితే ఛార్జీలు ఎంతమేర పెంచితే ఆర్థిక పరిస్థితి అదుపులోకి వస్తుందన్న దానిపై నివేదిక కోరారు. పెరిగిన చమురు ధరలే 50శాతానికి పైగా నష్టాలకు కారణంగా అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 15-20శాతం వరకు ఛార్జీలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మేర పెంచితేనే రోజువారీ ఆదాయం రూ.16-18కోట్లకు చేరి ఆర్థిక పరిస్థితి కాస్త కుదుటపడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే అంత మేర భారీగా ఛార్జీలు పెంచితే ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థలపై ద ష్టి సారించవచ్చని, అప్పుడు సంస్థకు కష్టాలు తప్పకపోవచ్చని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి దీనిపై ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.