Telangana Elections 2023: వలసలకే పెద్దపీట.. టికెట్ ఇవ్వకుంటే జంప్.. భ్రష్టుపట్టిపోతున్న పార్టీలు
గత ఐదేళ్లుగా చాలామంది నాయకులు పార్టీలకు సేవలు అందించారు. అదే సమయంలో పార్టీలు సైతం సదరు నేతలకు గౌరవిస్తూ వచ్చాయి. అయితే చివరకు ఎన్నికల సమీపించేసరికి అటు పార్టీలు గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి.

Telangana Elections 2023: తెలంగాణ రాజకీయాలు అంతుచిక్కడం లేదు. ఎన్నికల సమీపిస్తున్న కొలది రకరకాల ఎత్తుగడలతో రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సిద్ధాంతాలను పక్కన పెడుతున్నాయి. నేతలు సైతం గీత దాటుతున్నారు. పక్క పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. నిన్నటి వరకు అనరాని మాటలతో అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీలోకి నిస్సిగ్గుగా చేరిపోతున్నారు. తమ మాటలను సవరించుకుంటున్నారు. అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే అలా మాట్లాడాల్సి వచ్చిందని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ” గెలుపు” అనే తారక మంత్రాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలో టికెట్ దక్కని వారికి.. సాదరంగా ఆహ్వానించి టికెట్ కట్టబెడుతుండడం అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది.
గత ఐదేళ్లుగా చాలామంది నాయకులు పార్టీలకు సేవలు అందించారు. అదే సమయంలో పార్టీలు సైతం సదరు నేతలకు గౌరవిస్తూ వచ్చాయి. అయితే చివరకు ఎన్నికల సమీపించేసరికి అటు పార్టీలు గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. అటు నేతలు సైతం తమ రాజకీయ ప్రయోజనాలను ఆశించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక్కడ సిద్ధాంతం, ప్రజాసేవ అన్నది పక్కకు వెళ్ళిపోతుంది. కేవలం గెలుపు అన్న సూత్రం ప్రాతిపదికనే రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీలు, నాయకులు వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా మారింది.
నాయకులు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో? ఎవరు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటున్నారో తెలియని పరిస్థితి తెలంగాణలో నెలకొంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. అయితే అధికార బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుండగా.. కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బిజెపి మునుపటి దూకుడు కోసం చాలా కష్టపడుతోంది. అయితే పార్టీలు కనిపిస్తున్నా.. వెనుక ఉండే నేతలు మాత్రం ఇట్టే పార్టీలు మార్చేస్తున్నారు. ఐదేళ్లుగా సేవలందించిన నాయకులకు పార్టీలు పక్కన పెడుతుండగా.. గెలుపు కోసం సొంత పార్టీలను నాయకులు తన్నేసి పోతున్నారు. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ లోకి చేరికలు అధికమయ్యాయి. గతంలో వివిధ కారణాలతో కాంగ్రెస్ను ఆడిపోసుకుని చాలామంది నాయకులు బయటకు వచ్చారు. ఇప్పుడు అవసరం కోసం అదే పార్టీలో చేరుతున్నారు.
ప్రధానంగా మూడు పార్టీల మధ్య రాజకీయ క్రీడ ప్రారంభమైంది. ప్రత్యర్థి పార్టీని బలహీనం చేసేందుకు అసంతృప్త నేతలను వల విసిరి తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. అటు అసంతృప్త నేతలు సైతం తమకు కాదని.. వేరొకరికి టికెట్ ఇవ్వడం ఏమిటని భావిస్తున్నారు. తమ వ్యక్తిత్వానికి, సిద్ధాంతానికి వ్యతిరేకమైన పార్టీలో సైతం చేరేందుకు సిద్ధపడుతున్నారు. అన్ని పార్టీలు వలస పక్షులకు టిక్కెట్లు కట్టబెడుతుండడం విశేషం. పార్టీల సిద్ధాంతాలు, మేనిఫెస్టోలతో అస్సలు సంబంధం లేదు. ప్రజా సంక్షేమం అంతకంటే పట్టడం లేదు. కేవలం రాజకీయ అజెండాతో, పదవీకాంక్షతో పార్టీల్లో చేరుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ విష సంస్కృతిని పెంచి పోషిస్తుండడం విశేషం.
