
Telangana Budget
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఓట్లు కురిపించేవారికే కేటాయింపులు ఎక్కువగా చేసినట్లు ఆర్థిక నిపుణలు, విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ సారథ్యంలో అన్ని రంగాల్లో దూసుకుపోతోందంటూ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు మంత్రి హరీశ్‌రావు. తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శమని.. దేశంలో తెలంగాణ మోడల్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రూ.2,90,396 కోట్లతో తెలగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లుగా ఉంది. నీటిపారుదల రంగానికి రూ. 26,885 కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగానికి రూ.12,757 కోట్ల కేటాయింపులు జరిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్ల కేటాయించారు. ఆయిల్‌పాం సాగుకు రూ.1000 కోట్లు కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు. ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్ల కేటాయింపులు జరిపారు. గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమానికి రూ. 6,229 కేటాయించారు. కీలకమైన వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్ల కేటాయించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక పథకాలకు రూ. 3,210 కేటాయించారు.
వ్యవసాయం, నీటిపారుదల, దళితబంధుకు ప్రాధాన్యం…
బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. వ్యవసాయ రంగానికి ప్రతీ బడ్జెట్‌లో ఇస్తున్నట్లుగానే ఈ సారి కూడా భారీగానే కేటాయింపులు చేశారు. గత రెండు ఎన్నికల్లో రైతులే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడానికి కారణం. ఈ నేపథ్యంలో ఈసారి కూడా వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్ల కేటాయించారు. అయిల్‌పామ్‌కు మరో రూ.1000 కోట్లు, రైతుబంధుకు రూ.1,575 కోట్లు, రైతుభీమాకు రూ.1,589 కోట్లు అదనం. ఇక నీటిపారుదల రంగానికి కూడా భారీగానే నిధులు కేటాయించింది సర్కార్. ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటిరంగాన్ని బలోపేతం చేస్తున్నామంటున్న కేసీఆర్ ఈ బడ్జెట్‌లోనూ ఆ రంగానికి రూ. 26,885 కోట్లు కేటాయించారు. తర్వాత అత్యధిక కేటాయింపులు దళితబంధు, ఆసరా పెన్షన్లకే కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు ఈసారి ఎన్నికల్లో తమను గట్టెక్కిస్తుందని భావిస్తున్న కేసీఆర్ ఇందకోసం తాజా బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించారు. ఇక కేసీఆర్‌కే ఓట్లు కురిపించే మరో పథకం ఆసరా. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, గీత, చేనేత, ఇతర వృత్తి కార్మికులు పెన్షన్లు పొందుతూ కేసీఆర్ సర్కార్‌కు ఎన్నికల్లో అండగా ఉంటున్నారు. ఈ సారిక కూడా వీరి మద్దతు కోరుతున్న కేసీఆర్ ఆసరా పెన్షన్లకు బడ్జెట్‌లో రూ.12,000 కోట్ల కేటాయింపులు చేశారు.

Telangana Budget
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధి..
ఇక బడ్జెట్‌లో దళిత, గిరిజనులకే కేటాయింపు భారీగా చూపింది సర్కార్. ఎస్పీ ప్రత్యేక నిధి రూ.36,750 కోట్లు, ఎస్టీ ప్రత్యేక నిధి రూ.15,233 కోట్లు కేటాయిస్తున్నట్లు హరీశ్‌రావు ప్రకటించారు. ఇక్కడ ప్రత్యేక నిధి అంటే ఆ నిధులు దేనికైనా కేటాయించొచ్చు. ఇవి పూర్తిగా ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటాయి. ఆయన సూచన మేరకే కేటాయింపులు ఉంటాయి. అవసరమైతే ఇతర రంగాలకు మళ్లించే అవకాశం కూడా ఉంది.
విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు..
ఇక తెలంగాణలో అత్యంత కీలకమైన రంగం విద్యుత్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు చూపిన ప్రజలు తెలంగాణ వచ్చాక ఊరటనించిన విషయం కోతలు లేని కరెంటు. తెలంగాణ ప్రభుత్వానికి ఓట్లు కురిపించే అంశం కూడా ఇదే. దీంతో విద్యుత్ రంగానికి కూడా బడ్జెట్‌లో భారీగానే కేటాయింపులు చేశారు. ఈ బడ్జెట్‌లో రూ.12,727 కోట్లు కేటాయించారు. వాస్తవారిని డిస్కంలకు ప్రభుత్వం ఇప్పటికే రూ.25 వేల కోట్ల బకాయిలు ఉంది. అయినా తాజాగా రూ.12,727 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇది వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు మాత్రమే సరిపోతుంది. బకాయిలు అలాగే ఉండనున్నాయి. రైతులకు ఇబ్బంది కలిగితే అది వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని భావించిన సర్కార్ వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్‌కు రూ.10 వేల కోట్లు, అప్పులకు వడ్డీ, ఇతర అవసరాలకు మరో రూ.2,727 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం.
బడ్జెట్‌లో రంగాల వారీగా కేటాయింపులు ఇలా..
వ్యవసాయానికి కేటాయింపులు రూ.26,831 కోట్లు
నీటి పారుదల శాఖకు రూ.26,885 కోట్లు
విద్యుత్ కేటాయింపులకు రూ.12,727
ఆసరా ఫించన్ల కోసం రూ.12 వేల కోట్లు
దళితబంధు కోసం రూ.17,700కోట్లు
రైతుబంధుకు రూ.1575 కోట్లు
రైతుభీమాకు రూ. 1589 కోట్లు
ఎస్పీ ప్రత్యేక నిధి రూ.36,750 కోట్లు
ఎస్టీ ప్రత్యేక నిధి రూ.15,233 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు
మహిళా శిశు సంక్షేమం కోసం రూ.2,131 కోట్లు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక పథకాలకు రూ. 3,210 కోట్లు