Telangana Bjp:సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కానీ తెలంగాణలో ‘ముందస్తు’ ఊహాగానాలు జోరుగా ఊపందుకున్నారు. గడువుకు ముందే తెలంగాణలో ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో రావడానికి అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీలు సమానస్థాయిలో పోటీ పడుతున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం కోసం తహతహలాడుతుండగా… దక్షిణాదిన పాగా వేసేందుకు తెలంగాణను వేదికగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది. అయితే ఉత్తరాదిన తుడిచిపెట్టుకుపోతున్న బీజేపీకి తెలంగాణ చేజిక్కే అవకాశం ఉందా..? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చిన టీఆర్ఎస్ ను కాదని ఇక్కడి ప్రజలు కమలంను ఆదరించనున్నారా..?
దేశ ప్రధాని నరేంద్ర మోదీ జూలై 2,3 తేదీల్లో హైదరాబాద్లో మకాం వేశారు. ఆయన తెలంగాణలో ఇలాంటి పర్యటనలు ఎన్నో చేశారు. కానీ ఈ పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకమైనంది. ఎందుకంటే జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు మోదీ రెండు రోజుల పర్యటన ఖరారు చేశారు. అయితే ఈ సమావేశాల కంటే ముందే కేంద్ర మంత్రులు, ఎంపీలు తెలంగాణ లోని అన్ని నియోజకవర్గాల్లో దిగారు. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ విజయం కోసం కష్టపడాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో 2018లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో బీజేపీ ఒకే ఒక్క సీటును గెలుచుకుంది. దీంతో ఇక బీజేపీ పని అయిపోయిందని భావించారు. కానీ ఆ తరువాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా నాలుగు సీట్లలో విజయం సాధించింది. ఆ తరువాత పార్టీకి కొంత ఊపు వచ్చింది. ఇక కమలం తెలంగాణ అధినేతగా బండి సంజయ్ ని నియమించడంతో యూత్ ఫాలోయింగ్ విఫరీతంగా పెరిగింది. ఇదే సమయంలో దుబ్బాక ఉప ఎన్నికను బీజేపీకి సవాల్ తీసుకొని ఆ నియోజకవర్గంలో గెలుపోందింది. అయితే ఒకే ఒక్క సీటులో ఒరిగేదేముంది..? అని అనుకున్న టీఆర్ఎస్ కు ఆ తరువాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీనిచ్చింది. ఇక టీఆర్ఎస్ నుంచి బయటికొచ్చిన ఈటల రాజేందర్ ను తమ పార్టీలో చేర్చుకొని బీజేపీ అవకాశంగా తీసుకొంది. ఈ ఎన్నికను కూడా సవాల్ గా తీసుకున్న కమలం నాయకులు ఈటలను గెలిపించుకున్నారు.
ఈ పరిణామాలతో తెలంగాణలో రాజకీయం మారుతోందని భావించారు. ఇదే అదనుగా బీజేపీ నాయకుల పాదయాత్ర లాంటి కార్యక్రమాలు చేపట్టారు. అటు ప్రభత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ ఆందోలన కార్యక్రమాలు నిర్వహించారు. ఇలా తెలంగాణలో బీజేపీ బలపడడం చూసి అధిష్టానం ఖుషీ అయింది. ఈ దూకుడును ఇలాగే కొనసాగించాలంటూ అగ్రనాయకత్వం అండగా ఉండడం పార్టీ కేడర్లో మరింత ఉత్సాహాన్ని నింపినట్లయింది. అయితే సందర్భాన్ని భట్టి జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలో మాత్రమే బీజేపీ పటిష్టంగా మారడం వారికి ఒకింత రూట్ మ్యాప్ దొరికినట్లయింది. దీంతో తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆ తరువాత దక్షిణాది రాష్ట్రాల్లో ఎలాగైనా గెలుపొందేలా వ్యూహం రచించాలని ఆలోచిస్తున్నారు.
అయితే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి ఆ తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. రైతుబంధు లాంటి స్కీంలతో ఆకట్టుకుంది. దీంతో 2014లో కాస్త కష్టమైనా.. 2018లో టీఆర్ఎస్ కు గెలుపు సునాయసమైంది. కానీ ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా గత డిసెంబర్లో వరిధాన్యాన్ని కేంద్రమే కొంటుందని టీఆర్ఎస్ బీజేపీపై ఆందోళన చేశారు. కానీ అది సక్సెస్ కాలేదు. కేంద్రంపై పలు ఆరోపణలు చేస్తూ తిరిగి తెలంగాణ ప్రభుత్వమే వడ్లను కొనుగోలు చేసింది. మరోవైపు పంటలను మార్చాలని రైతులను అయోమయంలోకి నెట్టారు. ఇలాంటి విషయాలను బీజేపీ క్యాష్ చేసుకుంటోంది.
సంక్షేమ పథకాల విషయాల్లో ఇప్పటి వరకు టీఆర్ఎస్ ముందుంది. బీజేపీ కంటే టీఆర్ఎస్ అనేక కొత్త కొత్త స్కీంలతో ప్రజలను ఆకట్టుకుంది. అయితే బీజేపీ హిందుత్వం మీదే ఆధారపడుతుందని కొందరు ఆరోపిస్తున్నా.. కొన్ని సంక్షేమ పథకాలను చూపిస్తున్నారు. ఇటు టీఆర్ఎస్ హిందుత్వానికి వ్యతిరేకం అని ప్రచారం కాకముందే యాదాద్రి ఆలయాన్ని కోట్లు పెట్టి నిర్మించారు. పలు దేవాలయాలకు భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. జాతీయ స్థాయిలో పర్యటిస్తూ సైనిక కుటుంబాలకు సాయం చేస్తున్నారు. ఈ సమయంలో టీఆర్ఎస్ ను బీజేపీ తట్టుకునే శక్తి తక్కువగానే ఉంది. కానీ ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ బీజేపీ ఎలాంటి మాయ చేస్తుందోనని రాజకీయంగా తీవ్ర చర్చ సాగుతోంది.