Jio vs Airtel: ఒకప్పుడు టెలికాం మార్కెట్లో ఎయిర్టెల్ ఆడింది ఆట. పాడింది పాట. జియో దెబ్బకు ఒకసారిగా పరిస్థితి మారిపోయింది. నెట్వర్క్ విషయంలో పెద్ద ప్లేయర్ అయినప్పటికీ జియో తో పోటీ పడలేక ఎయిర్టెల్ చాలా ఇబ్బందులు పడుతున్నది. చాలా వరకు మార్కెట్లో తన వాటాను కోల్పోతున్నది. జియోను రన్ చేస్తోంది దేశంలోనే అతిపెద్ద ధనవంతుడు ముఖేష్ అంబానీ. అతడికి ప్రభుత్వపరంగా అండదండలు ఉన్నాయి. ఈ క్రమంలో జియోను ఎదుర్కోవడం అంటే కొండను ఢీకొన్నట్టే. ఇలాంటి తరుణంలో 5జీ స్పెక్ట్రం వేలం భారతి ఎయిర్టెల్ కు ఆయాచిత వరంలా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ 5 జీ సేవల వల్ల సంభవించే పెను మార్పులు ఏమిటి? దీనివల్ల వినియోదారులకు లభించే ప్రయోజనం ఎంత? 5జీ కేవలం నెట్వర్క్ మాత్రమేనా, ఇంకా ఏమైనా సేవలు లభించే అవకాశం ఉందా? ఇన్ని ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం ఈ కథనం.

48,084 కోట్ల పెట్టుబడులు పెట్టింది
ఇటీవల నిర్వహించిన 5జి స్పెక్ట్రమ్ వేలంలో భారతీయ ఎయిర్టెల్ 19867. 8 MGh ను 48,084 కోట్లకు కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎయిర్టెల్ 5జి తో భారత దేశంలో చాలా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎయిర్ టెల్ ప్రస్తుతం 1800/2100/2300 GHz బ్యాండ్ ను కలిగి ఉంది. దీనివల్ల వినియోగదారులకు తక్కువ ధరకే 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. తనకు ప్రధాన పోటీదారుగా ఉన్న జియోను ఎదుర్కోవడం కష్టమైన నేపథ్యంలో ఈ స్థాయిలో బ్యాండ్ విడ్త్ ఉండడం ఎయిర్టెల్ కు లాభించే విషయం. మరోవైపు 5జీ సేవలను తక్కువ యూసేజ్ చార్జీలలో అందించాలని ఎయిర్టెల్ భావిస్తోంది.
Also Read: China- Abdul Raoof: ఆ ఉగ్రవాదిపై చైనాకు ఎందుకు అంత ప్రేమ
వీలైనంత త్వరగా సేవలను అందించేందుకు
మరోవైపు టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుండడంతో అందుకు అనుగుణంగానే 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎయిర్టెల్ ప్రయత్నాలు చేస్తోంది. మొదట దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చేందుకు ఎరిగ్జన్, నోకియా, సామ్ సంగ్ వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. తయారీ, రిటైల్, టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాల్లో 5జీ వినియోగం విషయంలో ఎయిర్టెల్ బహుళ జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తోంది. 5జీ ఆధారిత అంబులెన్స్ కోసం అపోలో హాస్పిటల్స్ తో, తయారీ రంగంలో బాష్ కంపెనీ తో కలిసి ఎయిర్టెల్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కేవలం నగరాలు, పట్టణాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ మొదటిసారిగా 5జీ పరీక్ష నిర్వహించిన కంపెనీగా ఎయిర్టెల్ నిలిచింది. అదేవిధంగా గత ఏడాది 700MGh బ్యాండ్ విడ్త్ తో 5జీ పరీక్ష నిర్వహించింది. మరో వైపు భారత దేశంలో క్లౌడ్ గేమింగ్ పై టెస్ట్ కూడా నిర్వహించింది. ఇవే కాకుండా తొలి లైవ్ హోలో గ్రామ్ ను కూడా ఎయిర్టెల్ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పోయిన స్థానం తిరిగి దక్కించుకునేందుకేనా
వాస్తవానికి దేశంలో ఎయిర్టెల్ కు ఉన్న నెట్వర్క్ ఏ కంపెనీకి లేదు. కానీ సేవలు విషయంలో మాత్రం వినియోగదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేసేది. వినియోగదారులు కూడా గత్యంతరం లేక ఎయిర్టెల్ మాత్రమే వినియోగించుకునేవారు. అయితే హచ్ ( తర్వాత వోడాఫోన్), ఐడియా, డోకోమో, వర్జిన్, ఎయిర్ సెల్, రిలయన్స్ కంపెనీల రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పోటీ కంపెనీలు తక్కువ ధరకే సేవలు అందిస్తుండటంతో ఎయిర్టెల్ దిగివచ్చింది. తర్వాత ఇదే ధోరణి 3జీ సేవలను కొనసాగింది. ఎప్పుడైతే జియో మార్కెట్లోకి ఎంటర్ అయిందో అప్పుడే గేమ్ చేంజర్ అయింది. 4జీ సేవలను తక్కువ ధరకే అందించడంతో మిగతా కంపెనీలన్నీ టపా కట్టాయి. ఏకంగా వోడాఫోన్ ఐడియాతో చేతులు కలిపింది. జపాన్ దేశానికి చెందిన డొకోమో టెలికాం రంగం నుంచి వైదొలిగింది. ఇక ఎయిర్ సెల్, వర్జిన్ కూడా వచ్చినదారిలోనే వెళ్లాయి. ఈ క్రమంలో ఎప్పుడో పాతుకుపోయిన ఎయిర్టెల్ మాత్రం తన వాటాలను విక్రయించలేక అదే వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. అయితే వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని మొరపెట్టుకోవడంతో చార్జీలను పెంచుకునేందుకు ట్రాయ్ కల్పించింది. అయితే ఇప్పుడు 5జీ సేవలు అందుబాటులోకి వస్తుండటంతో పోగొట్టుకున్న మొదటి స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు ఎయిర్టెల్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే వినియోగదారులకు చవక ధరలో మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.
Also Read: Jr NTR In Oscar Race: ఆర్ఆర్ఆర్ దెబ్బకు.. ఆస్కార్ బరిలో ఎన్టీఆర్.. అందులో ఏం విశేషం ఏంటంటే?