Renuka Singh Thakur: క్రికెట్‌లో మ్యాచ్‌లో చివరి వరకు ఏం జరుగుతుందో తెలియన్ ఉత్కంఠ నెలకొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క బంతితో ఎన్నో కీలక మలుపులు తిరిగిన మ్యాచ్‌లు కూడా చరిత్రలో ఉన్నాయి. అయితే, తాజాగా కామన్వెల్త్ క్రీడల్లో టీమిండియాకు చెందిన ఓ బౌలర్ కూడా.. తన అద్భుత స్వింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపుతోంది. తన అద్భుత స్వింగ్‌తో బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్ చేస్తోంది. సూపర్ పామ్‌తో మ్యాచ్ విన్నర్‌గా భారత జట్టును విజయ తీరాలకు చేరుస్తోంది. మహిళా క్రికెట్ అభిమానులతో శభాష్ అనిపించుకుంటోంది రేణుకాసింగ్ ఠాకూర్.

Renuka Singh Thakur
ప్రత్యర్థులకు పజిల్..
హిమాచల్‌కు చెందిన ఈ ప్లేయర్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యర్థి బ్యాట్స్‌ఉమెన్‌లకు అర్థంకాని పజిల్‌గా మారి వికెట్లను తన ఖాతాలో వేసుకుంటుంది. ఆమెను స్వింగ్ రాణి అని లేదా వికెట్ టేకింగ్ మెషిన్ అంటూ నెటిజన్లు పిలుస్తున్నారు. బంతితోనే విధ్వంసం సృష్టించడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. రేణుకా సింగ్ ఠాకూర్ బార్బడోస్‌పై కూడా అదే విధ్వంసం ప్రదర్శించింది.
Also Read: Toxic Fevers Rise in Telangana: బెడ్డుపై బాల్యం.. తెలంగాణలో విజృంభిస్తున్న విష జ్వరాలు
ఉమెన్ క్రికెట్ జట్టుకు భవిష్యత్ ఆశాకిరణం..
టీమిండియా మహిళా క్రికెట్‌లో రేణుకాసింగ్ ఠాకూర్ ఒక సంచలనంలా దూసుకొచ్చింది. జులన్ గోస్వామి తర్వాత భారత మహిళా క్రికెట్ కు ఆశాకిరణం(బౌలర్లలో) గా కనిపిస్తుంది రేణుకాసింగ్ ఠాకూర్. హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రముఖ ఆద్యాత్మిక స్థలం ధర్మశాలకు 325 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణం రోహ్రు ఆమెది. సముద్ర మట్టానికి 1600 మీటర్ల ఎత్తులో ఉంది. అక్కడి నుంచి కొండలు, కోనలు దాటుకుని టీమిండియాలోకి చేరింది రేణుకాసింగ్.
తండ్రి కాంబ్లీకి అభిమాని..
రేణుక తండ్రి కేహర్‌సింగ్ ఠాకూర్‌కు క్రికెట్ అంటే అభిమానం. ఆయన టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి వీరాభిమాని. తన సంతానం (ఒక కొడుకు, కూతురు) లో ఒకరినైనా క్రికెటర్ చేయాలని కలలు కన్నాడు. అందుకే తన కొడుకుకు వినోద్ అని తన అభిమాన క్రికెటర్ పేరు పెట్టుకున్నాడు. కేహర్ హిమాచల్ ప్రదేశ్‌లో ఇరిగేషన్ అండ్ పబ్లిక్ హెల్త్‌లో పనిచేసేవాడు. కానీ రేణుక 12 ఏళ్ల వయసులోనే అతడు మరణించాడు. దీంతో ఆ ఉద్యోగాన్ని రేణుక అమ్మకు ఇచ్చారు. వినోద్‌తోపాటే రేణుక కూడా చిన్నప్పుడే క్రికెట్‌పై మక్కువ పెంచుకుంది. తన అన్న ఎక్కడికెళ్లినా తానూ అక్కడికెళ్లి బౌలింగ్ చేసేది.
తల్లి కష్టాలు..
తండ్రి చనిపోయాక ఆ ఉద్యోగాన్ని రేణుక తండ్రికి ఇచ్చినా చాలీచాలని జీతాలతో జీవితాలు సాఫీగా ఏం సాగలేదు. కూతురు, కొడుకులోని ఆసక్తిని గమనించిన తల్లి.. ఇద్దరికీ ఖర్చు పెట్టే స్థోమత లేక వినోద్ కు నచ్చజెప్పింది. రేణుకను ప్రోత్సహించింది. తమ గ్రామానికి చుట్టుపక్కల ఎక్కడ టోర్నీలు జరిగినా వినోద్.. తన చెల్లిని తీసుకెళ్లి క్రికెట్ ఆడించేవాడు.

Renuka Singh Thakur
రాష్ట్ర క్రికెట్ పోటీలకు ఎంపిక..
ఆ క్రమంలో రేణుకకు 14 ఏళ్ల వయసులో ఆమె హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అకాడమీకి ఎంపికైంది. అక్కడ ఆమె రాటుదేలింది. ఆ తర్వాత 2018–19 సీజన్ లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ఆడుతూ 21 వికెట్లు పడగొట్టింది. దీంతో ఆమె జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిలో పడింది. ఆ తర్వాత ఛాలెంజర్ ట్రోఫీ, ఇండియా–ఏ జట్లకు ఎంపికైంది.
అవకాశాలు రాక..
జట్టుకు ఎంపికైనా రేణుకాకు అవకాశాలు రాలేదు. ఫిబ్రవరిలో న్యూజిలాండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో ఆమె ఎంపికైంది. అయితే అక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో ఆమె తీవ్ర నిరాశకు లోనైంది. తనను తాను నిరూపించుకునే అవకాశం కోసం ఎదురుచూసింది. ఆ ఛాన్స్ శ్రీలంక సిరీస్ ద్వారా వచ్చింది. లంకేయులను ముప్పుతిప్పలు పెట్టడంతో ఆమె కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనబోయే జట్టుకు ఎంపికైంది. ఆసీస్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసింది. ఆ తర్వాత పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఒక వికెట్ తీసినా పొదుపుగా బౌలింగ్ చేసింది. కామన్‌వెల్త్–2022లో బుధవారం బార్బడోస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కూడా నాలుగు వికెట్లు పడగొట్టి భారత్‌ను సెమీస్ చేర్చడంలో కీలక పాత్ర పోషించింది.
Also Read:Chandrababu- Pawan Kalyan: చంద్రబాబు, పవన్ ల భారీ స్కెచ్.. వైసీపీతో మైండ్ గేమ్