
pawan kalyan- chandrababu
TDP- Janasena: ఎమ్మెల్సీ ఎన్నికలతో టీడీపీ మనసు మారుతోందా? ఆ పార్టీ శ్రేణులు చంద్రబాబుకు వైట్ వాష్ చేస్తున్నాయా?సొంతంగా గెలిచే అవకాశాలున్నందున జనసేనతో సంబంధాలు వద్దంటున్నారా? ఆ పార్టీకి పదికి మించి సీట్లు కేటాయించవద్దన్న కొత్త వాదనను తెరపైకి తెచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లు మూడింటిని కైవసం చేసుకోవడంతో టీడీపీలో మరో రకమైన వైబ్రేషన్ ప్రారంభమైందన్నవార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పవన్ ఏ పార్టీకి సపోర్టు చేయ్యలేదు. కానీ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని మాత్రమే పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీకి ధీటుగా టీడీపీ అభ్యర్థులను నిలబెట్టడంతో జన సైనికులు ఆ పార్టీకి ఓటువేశారు. టీడీపీ విజయానికి కారణమయ్యారు. కానీ ఏరు దాటి ఒడ్డు తగిలినట్టు.. అదేదో సొంత విజయమని భ్రమించి టీడీపీ కొత్త సమీకరణలకు తెరతీసినట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే చంద్రబాబుతో చాలా జాగ్రత్తగా ఉండాలని పవన్ కు సొంత పార్టీ నాయకులు, కాపు సంక్షేమ నేతలు ఇది వరకే హెచ్చరించారు. వాస్తవానికి పవన్ అవసరం చంద్రబాబుకే ఎక్కువ ఉంది. ఇప్పటివరకూ అదే కొనసాగింది. అయితే ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వరించేసరికి టీడీపీ శ్రేణులకు కాలూ చేయి ఆడడం లేదు. చాన్నాళ్లకు విజయం పలకరించేసరికి నోటి మాట రావడం లేదు. కానీ చాలాదూరం ఆలోచించడం ప్రారంభించారు. పవన్ అవసరం లేకుండా ముందుకెళదామని ఆలోచన చేస్తున్నారు. అటు ఎల్లో మీడియా సైతం పవన్ కు అంత సీన్ లేదన్నట్టు ప్రచారం ప్రారంభించింది. అలూ లేదు చూలు లేదు అన్నట్టు పొత్తు ప్రక్రియ ప్రారంభం కాలేదు కానీ.. పవన్ కు 30 సీట్లు అవసరం లేదని కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు.

pawan kalyan- chandrababu
ఎమ్మెల్సీ విజయాన్ని టీడీపీ నేతలు తలకెక్కించుకున్నారు. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో 108 సీట్లలో సొంతగా అధికారంలోకి వచ్చేశామని భ్రమపడుతున్నారు. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండే మిగులుతాయని, మూడో పార్టీకి చోటు వుండదని చంద్రబాబు మనసు మార్చేందుకు కొంతమంది టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీడీపీ మైండ్‌సెట్‌ను పూర్తిగా మార్చేస్తోంది. జనసేనను విడిపించుకోడానికి ఈ ఫలితాలు దోహదం చేస్తున్నాయని టీడీపీ నేతలు అంటుండడం గమనార్హం.