
AP MLC Elections- TDP
AP MLC Elections- TDP: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఉత్తరాంధ్రతో పాటు తూర్పు రాయలసీమలో ఆ పార్టీ అభ్యర్థులు పాగా వేశారు. తొలుత అర్ధరాత్రికే ఉత్తరాంధ్ర ఫలితం తేలిపోయింది. అక్కడికి కొద్దిసేపటికే తూర్పు రాయలసీమ ఫలితం వెల్లడైంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య నువ్వానేనా అన్న ఫైట్ కొనసాగుతోంది. అయితే ఫలితాలు ఆది నుంచి ఒకటే ట్రెండ్ కొనసాగుతూ వచ్చాయి. ఉత్తరాంధ్ర, తూర్పురాయలసీమలో ప్రతీ రౌండ్ లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. కానీ పశ్చిమ రాయలసీమ స్థానంలో మాత్రం అటు నెక్ అండ్ నెక్ ఫైట్ నెలకొంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ వస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో వైసీపీ అభ్యర్థికి స్వల్ప ఆధిక్యతలో ఉండగా..రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించడం ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ కౌంటింగ్ కొనసాగుతోంది.
తొలుత శుక్రవారం అర్ధరాత్రి ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం ఫలితం వెల్లడైంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి చిరంజీవిరావు తన ఆధిక్యతను కొనసాగిస్తూ వస్తున్నారు. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి 82,958 ఓట్లు సాధించారు. ఇంకా చిరంజీవిరావు గెలుపొందేందుకు 11,551 ఓట్లు అవసరమయ్యాయి. దీంతో రెండో ప్రాధాన్యం ఓట్లు లెక్కించడం ప్రారంభించారు. రాత్రి 11 గంటల సమయంలో రెండో ప్రాధాన్యత ఓట్లలో టార్గెట్ ను అధిగమించడంతో చిరంజీవిరావు గెలుపొందినట్టు అధికారులు ధ్రువీకరించారు. కానీ బయటకు వెల్లడించలేదు.
తూర్పు రాయలసీమ స్థానంలో టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్ గెలుపొందారు. ఇక్కడ కూడా తొలి రౌండ్ నుంచి శ్రీకాంత్ భారీ ఆధిక్యతను కొనసాగిస్తూ వచ్చారు. అయితే తొలి ప్రాధాన్యం ఓట్లలో గెలుపునకు అవసరమైన ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించడం ప్రారంభించారు. అయితే వాటిలో శ్రీకాంత్ గెలుపునకు అవసరమైన ఓట్లు లభించడంతో రిటర్నింగ్ అధికారులు శ్రీకాంత్ గెలిచినట్టు ధ్రువీకరించారు. దీంతో టీడీపీ ఖాతాలో రెండు పట్టభద్రుల స్థానాలు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

AP MLC Elections- TDP
పశ్చిమ రాయలసీమ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఓట్లలో వైసీపీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యతతో ఉన్నారు. ఎవరికి 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యంగా మారింది. ప్రస్తుతం అనంతపురం జేఎన్టీయూలో లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో వైసీపీ అభ్యర్థి వెన్నెపూస రవీంద్రరెడ్డి 1,820 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.ఇక్కడ 49 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో డిపాజిట్ దక్కించుకున్న వారి ఓట్ల వారీగా ద్వితీయ ప్రాధాన్యం ఓట్లు లెక్కిస్తున్నారు. ఇందులో లభించే మెజార్టీ 50 శాతానికి మించితే సదరు అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అయితే లెఫ్ట్ పార్టీలతో ఉన్న అవగాహనతో పశ్చిమ రాయలసీమ స్థానాన్ని కూడా గెలుస్తామని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే స్థానిక, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను సాధించిన వైసీపీ, పట్టభద్రుల స్థానాల్లో మాత్రం చతికిలపడింది. అందునా టీడీపీ చేతిలో ఓటమి చవిచూడడం ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో దెబ్బ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.