TDP Janasena Alliance: టీడీపీ, జనసేనను కలిపి ఉంచే బాధ్యత నాగబాబుదే.. షురూ చేసిన వైసీపీ
చంద్రబాబు అరెస్టు తర్వాత పవన్ స్పందించారు. నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. అనంతరం పొత్తు ప్రకటన చేశారు. పార్టీల మధ్య పొత్తు సమన్వయ బాధ్యతలను నాదెండ్ల మనోహర్ కి అప్పగించారు.

TDP Janasena Alliance: జనసేన,టిడిపి మధ్య పొత్తు విచ్ఛిన్నానికి వైసిపి ప్రయత్నిస్తోందా? రెండు పార్టీల మధ్య చిచ్చు రేపేందుకు సరికొత్త ఎత్తుగడవేసిందా? నాగబాబును కార్నర్ చేసుకుని సరికొత్త వ్యూహాన్ని రూపొందించిందా? సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న ప్రచారం నిజమేనా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్టుతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని ఓ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. టిడిపి వెనుక కుట్ర చేస్తున్నారని ఆ పార్టీ శ్రేణుల్లో అనుమానం వచ్చేలా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు.
చంద్రబాబు అరెస్టు తర్వాత పవన్ స్పందించారు. నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. అనంతరం పొత్తు ప్రకటన చేశారు. పార్టీల మధ్య పొత్తు సమన్వయ బాధ్యతలను నాదెండ్ల మనోహర్ కి అప్పగించారు. అయితే పవన్ స్పందించిన తీరుపై లోకేష్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని.. ఆయనకు పొత్తు ఇష్టం లేదని తొలుత ప్రచారం చేశారు. పవన్ స్పందించడం వెనుక బీజేపీ ఉందని.. ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో టాక్ నడిపిస్తున్నారు.
అంతటితో ఆగకుండా ఇప్పుడు నాగబాబు సైతం తిరుపతిలో ఓ కీలక ప్రకటన చేశారని.. భవిష్యత్తు అంతా జనసేన దేనని.. తెలుగుదేశం పాత్ర ఏమి ఉండదని నాగబాబు వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ప్రారంభించారు. నాగబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తిరుపతిలో పర్యటించారు. ” చంద్రబాబు అరెస్టుతో టీడీపీకి దిక్కులేదు. టిడిపికి పవనే దిక్కు. తమ్ముడే సీఎం అవుతాడు “.. అంటూ నాగబాబు వ్యాఖ్యానించినట్లు వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. టిడిపితో అనుకూలంగా ఉంటూ.. ఆ పార్టీని హస్తగతం చేసేందుకు పవన్తో బిజెపి మైండ్ గేమ్ ఆడుతుందని అనుమానాలు వచ్చేలా ప్రచారం ఊపందుకుంటుంది.
వాస్తవానికి పవన్ పొత్తు ప్రకటన తర్వాత రెండు పార్టీల మధ్య సమన్వయ బాధ్యతలను తాజాగా నాగబాబుకు అప్పగించినట్లు సమాచారం. ఓట్లు బదిలీ సాఫీగా జరిగేందుకు.. క్యాడర్ మధ్య సమన్వయం సాధించే బాధ్యతను మెగా బ్రదర్ కు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు జిల్లాల టూర్లు ప్రారంభించారు. తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. నిస్వార్ధంగా పనిచేసే ప్రతి కార్యకర్తకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పుకొచ్చారు. జగన్ దుర్మార్గపు పాలన అంతమొందించడానికి క్షేత్రస్థాయిలో జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. పొత్తులను తూట్లు పొడిచేలా ఎవరు ఎక్కడ మాట్లాడొద్దని సూచించారు. పవన్ నిర్ణయానికి అందరమూ కట్టుబడి ఉందామని.. కలిసికట్టుగా పనిచేసి జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందామని నాగబాబు పిలుపునిచ్చారు. అయితే ఇదే వ్యాఖ్యలను తెలుగుదేశం పై జరిగే కుట్రగా వైసిపి శ్రేణులు మళ్లించాయి. దీనిపై స్పష్టమైన ప్రకటన చేయడానికి అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన సిద్ధమవుతున్నట్లు సమాచారం. రెండు పార్టీల మధ్య సమన్వయ బాధ్యతలతో పాటు ఓట్ల బదలాయింపు సజావుగా జరిగేలా నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
