CM MK Stalin: సడన్ గా సీఎం స్టాలిన్ గీసిన ఈ ‘అవయవ’ స్కెచ్ వెనుక కథేంటి?
వాస్తవానికి మనదేశంలో అవయవాల దానానికి ముందుకు వచ్చే వారి సంఖ్య చాలా తక్కువ. మత పరమైన విశ్వాసాలు, సామాజిక కట్టుబాట్లు, మూఢనమ్మకాల వల్ల ఎవరూ పెద్దగా అవయవాలను దానం చేసేందుకు ఇష్టపడరు.

CM MK Stalin: ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో తెలియదు. ఏ రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతుందో తెలియదు. కానీ కళ్ళు మూసి తెరిచేలోగా దారుణం జరిగిపోతుంది. మిగతా అవయవాలు పనిచేస్తున్నప్పటికీ మెదడు పనితీరు ఆగిపోతుంది. ఇలాంటివారిని వైద్య పరిభాషలో బ్రెయిన్ డెడ్ కేసులు అంటారు. అయితే ఇలాంటి వారి అవయవాలను ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి అమర్చితే.. వారు బతికి బట్ట కడతారు. అయితే ఇలా అవయవాలు దానం చేసే వారి విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. తమ అవయవాలను ఇతరులకు దానం చేసే వారికి అంత్యక్రియలు ఘనంగా చేస్తామని నిర్ణయించింది. అది కూడా ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయించారు. ఈ నిర్ణయంతో తమిళనాడు వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది.
వాస్తవానికి మనదేశంలో అవయవాల దానానికి ముందుకు వచ్చే వారి సంఖ్య చాలా తక్కువ. మత పరమైన విశ్వాసాలు, సామాజిక కట్టుబాట్లు, మూఢనమ్మకాల వల్ల ఎవరూ పెద్దగా అవయవాలను దానం చేసేందుకు ఇష్టపడరు. ఫలితంగా దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడేవారు సరైన సమయంలో వారికి అవయవాలు లభించక కన్నుమూస్తున్నారు.. అయితే సమాజంలో చైతన్యాన్ని మరింత రగిలించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. అవయవాలను దానం చేసే వారికి గౌరవ మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ముందుకు వచ్చింది. అంతేకాకుండా వారికి ప్రభుత్వపరంగా లాంచనాలతో అంత్యక్రియలు చేస్తామని ప్రకటించింది. ఇలా అంతక్రియలు చేయడం వల్ల అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జీవన్ దాన్ వంటి సంస్థలకు తోడ్పాటుగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
“అవయవ దానం విషయంలో తమిళనాడు రాష్ట్రం దేశంలోనే అగ్రహారం గా ఉంది. విషాదకరమైన పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్ధమైన త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైంది. మరణానంతరం అవయవాలను దానం చేయటం వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబడ్డాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధువులకు తెలియజేయాలి. మిగిలిన వారు కూడా అవయవదానాన్ని చేసేలా ప్రోత్సహించాలి. అవయవ దాతలు, వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని గుర్తించి ఆర్గాన్ డోనర్స్ అంత్యక్రియలకు రాష్ట్రం తరఫున గౌరవం ఇవ్వాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం” అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. మరో వైపు బోధన ఆసుపత్రులకు మృతదేహాలను అందించే విషయంలోనూ తమిళనాడు దేశంలోనే ముందు వరసలో ఉంది.. ఇలా మృదేహాలను అందించిన వారిని కూడా ప్రభుత్వం తరఫున సన్మానించే యోచనలో స్టాలిన్ ఉన్నట్టు తెలుస్తోంది.
అకస్మాత్తుగా స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక వేరే విషయం ఉన్నట్టు తెలుస్తోంది.. ఎందుకంటే డీఎంకే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు ఈ ఇసుక అక్రమ రవాణాలో ఆరి తేరి పోయారు. ఒక మంత్రి జైల్లో ఉన్నాడు. రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోవడం, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఈ విషయాలను పదేపదే గెలుకుతుండడంతో.. వాటిని పక్కదారి పట్టించేందుకు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో తమిళనాడులో జరుగుతున్న అవినీతి పక్కకు వెళ్లిపోయింది. సుప్రీంకోర్టు మొట్టి కాయలు వేయడంతో సనాతన ధర్మంపై ఎవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని స్టాలిన్ తన మంత్రివర్గాన్ని ఆదేశించాడు. మరోవైపు ఈడి అధికారులు వరుసగా సోదాలు చేస్తున్న నేపథ్యంలో.. ఆ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు సడన్ గా ఆర్గాన్ డోనర్స్ కు ప్రభుత్వం తరఫున అంత్యక్రియలు నిర్వహిస్తామనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్న బిజెపి.. అవినీతి విషయంలోనూ స్టాలిన్ ఇలాంటి చర్యలకే ఉపక్రమిస్తారా అని ప్రశ్నిస్తోంది.
