Svarnalatha Rangam Bhavishyavani: ‘రంగం’ భవిష్యవాణి ఎవరితో ప్రారంభమైంది? రంగం రోజు ఏం జరుగుతుంది?
రంగం నిర్వహించే రోజు తెలంగాణ వ్యాప్తంగా భక్తులు ఉత్కంఠతో ఎదురుచూస్తారు. భవిష్యత్ లో ఏం జరుగుతుందో అమ్మవారి రూపంలో తెలుసుకుంటారు. రంగం నిర్వహించే రోజు ముందుగా భూమిలో పచ్చికుండను పాతిపెడుతారు.

Svarnalatha Rangam Bhavishyavani: తెలంగాణలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ముఖ్యంగా జంటనగరాల్లో ఆధ్యాత్మిక సందడి వెల్లివిరుస్తోంది. వాడవాడలా మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసం ప్రారంభం నుంచి మొదలయ్యే ఈ వేడుకలు దాదాపు నెల రోజుల పాటు కొనసాగుతాయి. ఈ వేడుకల్లో ప్రధానంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఈ సందర్భంగా నిర్వహించే రంగం తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. రంగం భవిష్యవాణిలో అమ్మవారు ఏం చెబుతారోనని అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. స్వర్ణలత అనే మహిళ రూపంలో అమ్మవారు భవిష్యత్ లో జరిగే విషయాలు చెబుతుందని అంటారు. ఈసారి అమ్మవారు చెప్పిన భవిష్యవాణి ప్రకారం వర్షాల గురించి బాధపడనక్కర్లేదని, సమృద్ధిగా కురుస్తాయని చెప్పింది. అయితే భవిష్యవాణి చెప్పే ఈ రంగం గురించి ఇప్పటి వారికి తెలియదు. దీంతో అసలు ఈ రంగం అనేది ఎలా మొదలైంది? అనేది ఆసక్తిగా మారింది.
ప్రతీ ఏటా బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఏర్పుల వంశానికి చెందిన వారే రంగాన్ని నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఈ వంశంలోని వారు తరతరాలుగా భవిష్యవాణిని వినిస్తున్నారు. భవిష్యవాణిని మొదటగా ‘ఏర్పుల జోగమ్మ’ అనే మహిళ చెప్పారు. ఆ తరువాత బాలమ్మ, పోచమ్మ, బాగమ్మలు చెబుతూ వచ్చారు. ఇప్పుడున్న స్వర్ణలత 1997 నుంచి భవిష్యవాణిని వినిపిస్తున్నారు. స్వర్ణలతకు చిన్నప్పుడే కత్తితో పెళ్లి చేశారు. అంటే ఈమె అమ్మవారికే అంకితమవుతారు. అమ్మవారి స్మరణ చేసుకుంటూ ప్రతీ ఏటా జరిగిే బోనాల ఉత్సవాల్లో భవిష్యవాణిని వినిపిస్తారు. ఈమె తరువాత ఆమె తమ్ముడు దినేష్ కుమార్తె రంగం నిర్వహిస్తారని అంటున్నారు.
రంగం నిర్వహించే రోజు తెలంగాణ వ్యాప్తంగా భక్తులు ఉత్కంఠతో ఎదురుచూస్తారు. భవిష్యత్ లో ఏం జరుగుతుందో అమ్మవారి రూపంలో తెలుసుకుంటారు. రంగం నిర్వహించే రోజు ముందుగా భూమిలో పచ్చికుండను పాతిపెడుతారు. ఆ తరువాత అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వర్ణలతకు కొత్త దుస్తులు సమర్పిస్తారు. ఆమె వాటిని ధరించిన తరువాత ఓడిబియ్యం సమర్పిస్తారు. అనంతరం ఆమెను రంగం నిర్వహించే ప్రదేశానికి తీసుకొస్తారు. అక్కడికి రాగానే స్వర్ణలతకు ఏం జరుగుతుందో తెలియదని ఆమె పలుసార్లు మీడియాతో చెప్పారు.
2023 జూలై 10న నిర్వహించిన రంగం సందర్భంగా అమ్మవారు భవిష్యవాణిని వినిపంచారు. నెలరోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్నవారికి బాధపడొద్దన్నారు. ఈసారి వర్షాలు బాగానే ఉన్నాయన్నారు. ఆలస్యమైనా వరదలు పారుతాయని చెప్పారు. తనకు ఏం చేయాలో? ఏం చేయొద్దో తెలుసని అన్నారు. భక్తులు చేసిన పూజకు సంతృప్తికరంగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే 5 వారాల వరకు తనకు సాక పోయండి అని కోరారు. గతేడాని చేసిన వాగ్దానాన్ని మరిచిపోయారని చెప్పారు.
