KCR vs Modi: రాష్ట్రంలో కెసిఆర్ వర్సెస్ కేంద్రం యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఉప్పు నిప్పు గా మారింది.. మొన్న మల్లారెడ్డి విద్యాసంస్థలు, బంధువుల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు 50 బృందాలతో దాడులు చేశారు. 100 కోట్లకు సంబంధించి లెక్కలు తేలకపోవడంతో మల్లారెడ్డిని కార్నర్ చేశారు.. ఇప్పటికే మల్లారెడ్డి చిన్న కొడుకు, అల్లుడిని ఒక దఫా విచారించారు. ఈ విచారణకు మల్లారెడ్డి హాజరు కాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో టిఆర్ఎస్ ఒక్కసారిగా ఉక్కపోతకు గురయింది. మెడ మీద ఢిల్లీ లిక్కర్ స్కాం వేలాడుతూనే ఉంది. దీంతో నష్ట నివారణ చర్యలకు కేసీఆర్ దిగారు. ఈ క్రమంలో రాజధాని లో ఉన్న కేంద్ర సంస్థలపై నిఘా పెంచాలని రాష్ట్ర పోలీసు అధికారులకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు.

KCR vs Modi
ఏం చేస్తారంటే
మొన్న జరిగిన మల్లారెడ్డి విద్యాసంస్థలు, బంధువుల నివాసాలపై దాడులకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారులు నేరుగా రంగంలోకి దిగారు. ఎక్కడా కూడా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వలేదు. గతంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసేటప్పుడు స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చేవారు. అయితే ఇటీవల ఒక కేసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చినప్పుడు అది టార్గెట్ వర్గానికి చేరిపోయింది. దీంతో వారు అప్రమత్తమయ్యారు. ఇది తెలుసుకున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈసారి కేంద్ర బలగాలకు సమాచారం ఇచ్చారు. బందోబస్తు కూడా వారితోనే నిర్వహించుకున్నారు. ఈ పరిణామం టిఆర్ఎస్ నాయకులకు మింగుడు పడటం లేదు. దీంతో ఎలాగైనా కేంద్ర సంస్థల్ని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు.
స్థానిక పోలీసులు కాపలా
హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలు చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా ఆదాయపు పన్ను శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల వద్ద పోలీసులను మఫ్టీలో నియమించనున్నారు.. అక్కడ ఏమాత్రం అలికిడి వినిపించినా వెంటనే అప్రమత్తమయ్యేలా ఇంటలిజెన్స్ శాఖ కార్యాచరణ రూపొందించింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏమాత్రం అవినీతికి పాల్పడినా ఏసీబీ కేసులు నమోదు చేయాలని సీఎం కేసీఆర్ పోలీస్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

KCR vs Modi
బెంగాల్ తరహా లోనే..
ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితులను చూస్తే ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో జరిగిన ఉదంతాలే గుర్తుకు వస్తున్నాయి.. శారదా స్కాంలో ఇరుక్కుపోయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సిబిఐ అధికారులు విచారించినప్పుడు… అక్కడ అధికార పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వారికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నరేంద్ర మోడీ లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. తర్వాత విద్యాశాఖ నియామకాల్లో చోటు చేసుకున్న అవినీతి వల్ల ఆమె ప్రభుత్వం పీకలలోతు కష్టాల్లో కూరుకుపోయింది. తర్వాత నరేంద్ర మోడీతో యుద్ధాన్ని విరమించుకుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే ఇవి మునుముందు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాల్సి ఉంది.