Sunrisers Hyderabad: సన్ రైజర్స్ ఓడినా.. ఆ జట్టుకు అతడే వన్ మ్యాన్ ఆర్మీ..!
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో హైదరాబాద్ జట్టు తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

Sunrisers Hyderabad: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ జట్టు బ్యాటర్లు పూర్తిగా విఫలం కావడంతో 34 పరుగులు తేడాతో హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. జట్టు ఆటగాళ్లంతా విఫలమైనప్పటికీ ఒకే ఒక్క ఆటగాడు అద్భుతంగా రాణించి జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసేందుకు దోహదం చేశాడు. అతడే హెన్రిచ్ క్లాసెన్.
ఐపీఎల్ 2023లో హైదరాబాద్ జట్టు ఘోరమైన ఆట తీరును కనబరిచింది. సమష్టి ప్రదర్శన చేయలేక అనేక మ్యాచ్ ల్లో ఆ జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో గెలవాల్సిన అనేక మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది. ఈ సీజన్ మొత్తం ఒకరిద్దరు మినహా ఎవరు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. ఈ జట్టులో ఆడిన ఆటగాళ్ళలో హెన్రిచ్ క్లాసెన్ ఒక్కడే కాస్త మెరుగైన ఆటతీరు కనబరిచాడు. సోమవారం జరిగిన హైదరాబాద్, గుజరాత్ మధ్య మ్యాచ్ లో మిగిలిన బ్యాటర్లంతా విఫలం అయినా.. క్లాసెన్ ఒక్కడే నిలబడి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు.
ఒంటరి పోరాటం చేసిన క్లాసెన్..
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో హైదరాబాద్ జట్టు తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక చతికిల పడింది. ఓపెనర్లు అన్మోల్ ప్రీత్ సింగ్ నాలుగు బంతుల్లో 5 పరుగులు, అభిషేక్ శర్మ ఐదు బంతుల్లో నాలుగు పరుగులు, కెప్టెన్ మార్క్రమ్ పది బంతుల్లో పది పరుగులు, రాహుల్ త్రిపాఠి రెండు బంతుల్లో ఒక పరుగు చేసి ఘోరంగా విఫలమయ్యారు. స్వల్ప స్కోర్ కే నాలుగు కీలక వికెట్లు కోల్పోయినప్పటికి క్లాసెన్ ఒంటరి పోరాటం చేశాడు. క్లాసెన్ ఒక్కడే 44 బంతుల్లో 64 పరుగులు చేసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జట్టులో మిగిలిన ఆటగాళ్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో హైదరాబాద్ జట్టు 9 వికెట్లు నష్టపోయి 154 పరుగులు మాత్రమే చేయగలిగి 34 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కూడా కీలక ఆటగాళ్లు ఘోరంగా విఫలం కావడంతో హైదరాబాద్ జట్టు ఓడిపోయింది.
భారీగానే పరుగులు చేసిన క్లాసెన్..
గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లోనే కాకుండా మిగిలిన మ్యాచ్ ల్లో కూడా క్లాసెన్ అద్భుతమైన ఆట తీరును కనబరిచాడు. హైదరాబాద్ జట్టుకు ఈ సీజన్ లో 9 మ్యాచ్ లు ఆడిన క్లాసెన్ 326 పరుగులు చేశాడు. ముంబై జట్టుపై 16 బంతుల్లో 36 పరుగులు, ఢిల్లీ జట్టుపై 27 బంతుల్లో 53 పరుగులు, కేకేఆర్ పై 20 బంతుల్లో 36 పరుగులు, లక్నోపై 29 బంతుల్లో 47 పరుగులు, సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అనేక సార్లు కీలకమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇప్పటి వరకు 172 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లేకపోయినప్పటికీ తన స్థాయిలో జట్టును విజయపథంలో నడిపించేందుకు కృషి చేశాడు.
