Sukha Duneke Canada: కెనడాలో ఖలీస్థానీ గ్యాంగ్ స్టర్ మర్డర్ మిస్టరీ వెనుక కొత్త కోణం.. హత్య చేసింది ఎవరంటే?
పంజాబ్లో కరడుగట్టిన నేరస్తుడిగా ముద్రపడిన సుఖా నేరముఠాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ లో అతడు ప్రాణాలు కోల్పోయాడు. సుఖా పై హత్య, హత్యా ప్రయత్నం, దోపిడి వంటి 18 కేసులు నమోదయ్యాయి.

Sukha Duneke Canada: భారత్_ కెనడా మధ్య వివాదం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ వ్యవహారంపై అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అటు కెనడా, ఇటు భారత్ తమ తమ వాదనలు వినిపిస్తున్నాయి. కెనడా నుంచి వచ్చే వారికి వీసాల మంజూరు ప్రక్రియను తాత్కాలికంగా భారత్ నిలిపివేసింది. కాగా, ఆరు సంవత్సరాల క్రితం పంజాబ్ నుంచి కెనడాకు పారిపోయిన కరడుగట్టిన నేరస్థుడు సుఖ్దుల్ సింగ్ అలియాస్ సుఖా దునెకె బుధవారం అక్కడ హతమయ్యాడు. అయితే ఇతడి హత్యను కూడా భారత రా విభాగానికి ఆపాదించే ప్రయత్నాన్ని కెనడా ప్రభుత్వం చేపట్టింది. అంతేకాదు ఎటువంటి ఆధారాలు బయట పెట్టకుండానే భారత్ కెనడాలో అశాంతి కరమైన వాతావరణం సృష్టిస్తున్నదని ఆరోపించడం మొదలుపెట్టింది. అయితే దీనిపై తవ్వి చూడగా విస్మయకర వాస్తవాలు వెలుగు చూసాయి.
పంజాబ్లో కరడుగట్టిన నేరస్తుడిగా ముద్రపడిన సుఖా నేరముఠాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ లో అతడు ప్రాణాలు కోల్పోయాడు. సుఖా పై హత్య, హత్యా ప్రయత్నం, దోపిడి వంటి 18 కేసులు నమోదయ్యాయి. పంజాబ్ లోని దునేకా కలాన్ గ్రామానికి చెందిన సుఖా.. 2017 డిసెంబర్ లో నకిలీ పాస్ పోర్టు తో పారిపోయాడు. మరోవైపు సుఖా ను తామే హత్య చేశామని లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్ స్టర్ కు చెందిన ముఠా ప్రకటించింది. బిష్ణోయ్ ప్రస్తుతం అహ్మదాబాద్ జైల్లో ఉన్నాడు. సుఖా హత్య నేపథ్యంలో కెనడాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రభుత్వం సహకారం అందిస్తుండడంతో ఖలిస్థానీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు జరుపుతున్నారు.
కెనడాతో వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆ దేశంలో విద్యాభ్యాసం, ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల గురించి వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వివాదం త్వరగా సమసి పోవాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా పంజాబ్ నుంచి అనేకమంది విద్య, ఉద్యోగాల కోసం కెనడాకు వెళుతుంటారు. మరోవైపు, కెనడాలో ఉన్న భారతీయ హిందువులు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ అక్కడి ఖలిస్థానీ సంస్థలు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. దీంతో హిందువుల్లో అలజడి మొదలైంది. అక్కడ బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అత్యవసరం ఉంటే తప్ప అక్కడ ఉండకూడదని భారత్ తేల్చి చెప్పిన నేపథ్యంలో.. చాలామంది తిరుగు ప్రయాణం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం సుఖా హత్య నేపథ్యంలో భారతదేశాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించిన కెనడా అధ్యక్షుడు ట్రూడో ను నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. అధికారం కోసం ఉగ్రవాదులతో జట్టు కట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
