Prajarajyam – Janasena : నాటి ప్రజారాజ్యం విజయాలు.. నేటి జనసేనకు అవకాశాలు
దీంతో ఇరు పార్టీల బలాబలాలు అంచనా వేసుకొని సీట్ల పంపకానికి సిద్ధమవుతున్నాయి. కానీ కొన్ని నియోజకవర్గాల్లో జఠిలమయ్యే పరిస్థితులైతే మాత్రం కనిపిస్తున్నాయి.

Prajarajyam – Janasena : పొత్తు అనేది పరస్పర సహకారం, గౌరవంతోనే సాధ్యమవుతుంది. సీట్ల పంపకాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగితేనే ఆ కలయిక వర్కవుట్ అవుతుంది. ఓట్లు బదలాయింపు జరిగితేనే ఉభయతారకంగా ఉంటుంది. అయితే ఈ విషయంలో తెలుగుదేశం, జనసేన ఎలా ముందుకెళతాయో అన్నది ఇప్పుడు ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో పొత్తు ఖాయమని పవన్ తేల్చేశారు.. అందుకు తగ్గట్టుగానే ఆ రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం ఉంది. జనసేనకు కేటాయించే సీట్ల విషయంలో టీడీపీకి స్పష్టత ఉంది. అదే సమయంలో తమకు బలమున్న చోట మాత్రమే జనసేన సీట్లను ఆశీస్తోంది. అయితే అధికారికంగా పొత్తు కుదరకపోయినా కొన్ని నియోజకవర్గాల విషయంలో ఇప్పడిప్పుడే స్పష్టత వస్తోంది. నాటి ప్రజారాజ్యం విజయాలు అక్కరకు వస్తున్నాయి. పొత్తుల్లో అవే కీలకంగా మారనున్నాయి.
అప్పట్లో కీలక నియోజకవర్గాల్లో..
పొత్తుల అంశం తెరపైకి వచ్చిన తరువాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన వస్తోంది. ఉమ్మడి ఏపీలోని 275 నియోజకవర్గాల్లో పోటీచేసిన పీఆర్పీ త్రిముఖ పోరులో 18 స్థానాలకే పరిమితమైంది. అధికార కాంగ్రెస్ ఒక వైపు.. టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షల మహా కూటమి మరో వైపు.. త్రిముఖ పోరులో పీఆర్పీ సీట్ల పరంగా వెనుకబడినా.. ఓట్లపరంగా 70 లక్షలు సాధించిన గణాంకాలున్నాయి. అప్పట్లో కాపుల ఓట్లు చీలిపోవడంతోనే పీఆర్పీకి ఓటమి ఎదురైంది. కొన్ని నియోజకవర్గాల చరిత్రను మాత్రం తిరగరాసింది. కాంగ్రెస్, వామపక్షాల కంచుకోట అయిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పీఆర్పీ గెలుపొందింది. టీడీపీ ఆవిర్భావం నుంచి గెలుస్తున్న కంకిపాడులో సైతం సత్తా చాటింది. అక్కడ కాపుల ఓట్లు పోలరైజ్ కావడం వల్లే గెలుపు సాధ్యమైంది.
ఆ నియోజకవర్గాలపై ఫోకస్..
ప్రజారాజ్యంతో పాటు గత ఎన్నికల్లో జనసేన సాధించిన గణాంకాల ఈక్వేషన్ తోనే పొత్తులుంటాయని సమాచారం. గత ఎన్నికల్లో జనసేన 20 వేలకుపైగా ఓట్లు సాధించిన నియోజకవర్గాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. అక్కడ టీడీపీతో సరిసమానంగా జనసేన ఓట్లు పొందింది. అటువంటి నియోజకవర్గాలను ఆ పార్టీ తప్పకుండా ఆశిస్తోంది. అయితే అదే నియోజకవర్గాల్లో ఈ మూడున్నరేళ్లలో బలం పెంచుకున్నట్టు టీడీపీ భావిస్తోంది. చంద్రబాబు తాజాగా చేయించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అటువంటి నియోజకవర్గాల్లో ఇరు పార్టీలు ఎలా ముందుకెళతాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఉభయ గోదావరి జిల్లాల్లో,.
ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు పార్టీల మధ్య సమస్య తలెత్తుతోంది. కాపుల సంఖ్య ఎక్కువగా ఉండడమే కారణం. వాస్తవానికి ఆ రెండు జిల్లాల్లో జనసేన గ్రాఫ్ గణనీయంగా పెరిగింది. అందుకే అక్కడ ఎక్కువగా ప్రాతినిధ్యం కావాలని జనసేన వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే గోదావరి జిల్లాల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకున్న వారే ప్రభుత్వం చేపడతారన్న ఒక సెంటిమెంట్ ఉంది. అందుకే చంద్రబాబు కూడా అక్కడ ప్రత్యేకమైన ఫోకస్ పెంచారు. అన్ని నియోజకవర్గాలపై దృష్టిపెట్టారు. అదే సమయంలో జనసేన సైతం ఆ నియోజకవర్గాల్లో బలం పెంచుకుంటూ వస్తోంది. దీంతో ఇరు పార్టీల బలాబలాలు అంచనా వేసుకొని సీట్ల పంపకానికి సిద్ధమవుతున్నాయి. కానీ కొన్ని నియోజకవర్గాల్లో జఠిలమయ్యే పరిస్థితులైతే మాత్రం కనిపిస్తున్నాయి.
