ED Attacks మోడీ.. నచ్చేవాళ్ళు నచ్చుతారు. తిట్టేవాళ్ళు తిడతారు. కానీ ఆయనను మాత్రం విస్మరించరు. దగ్గర నుంచే కాదు దూరం నుంచి చూసే వాళ్లకు కూడా మోడీ అంతు పట్టడు. ఒక టిపికల్ క్యారెక్టర్. అలాంటి మోదీ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతిపక్షాలను ఈడితో, సిబిఐతో, ఐటీతో చెడుగుడు ఆడిస్తున్నాడు. ఈ రాష్ట్రం,ఆ రాష్ట్రం అని లేదు. అంతటా, అన్నింటా దూకుడు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మీద పడ్డాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కవితను టెంపుల్ రన్ గేమ్ ఆడిస్తున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ప్రస్తుతానికి ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ ద్వారా శాంపిల్ రుచి చూపించాడు. ఇది ఎటువైపు దారి తీస్తుందో తెలియదు. దేశంలో ప్రతిపక్షాలు మొత్తం మోదీని విమర్శిస్తున్నాయి. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటూ శాపనార్ధాలు పెడుతున్నాయి. అయినప్పటికీ మోడీ ఊరుకోడు కదా. ముందే మనం చెప్పుకున్నట్టు అది ఒక టిపికల్ క్యారెక్టర్.
ఈసారి మరింత కొత్తగా
రాజకీయ అవసరాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి..మరీ ముఖ్యంగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ దూకుడు మరింత ఎక్కువైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ పట్టించుకోవడం లేదు..కించిత్ కూడా లెక్క చేయడం లేదు. ఇంకా మరింత వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నాడు.. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కు మరింత బలాన్ని చేకూర్చేలా మోడీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో 15 కు పైగా ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకునేందుకు ఇది అనుమతి ఇస్తుంది.. 15 ఏజెన్సీల్లో రాష్ట్రాల పోలీసు వ్యవస్థలు కూడా ఉన్నాయి. అంటే రాష్ట్ర పోలీస్ విభాగాలను కూడా ఇది ఈడి పరిధిలోకి తీసుకొస్తుంది. ఈడి కోరిన ఏ సమాచారన్నయినా రాష్ట్ర పోలీసు విభాగాలు ఇవ్వాల్సి ఉంటుంది.. ఇక మిగతా సంస్థలన్నీ కూడా కేంద్రానికి చెందినవే. ఏజెన్సీకి అందిన సమాచారం ఆధారంగా అరెస్టులు లేదా ఆస్తులను అటాచ్ చేయవచ్చు. సమాచారాన్ని పంచుకోవడం ద్వారా కొన్ని నిబంధనలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రాల అధికారాలకు కత్తెర
మోడీ తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రాల పోలీస్ వ్యవస్థలు స్వతంత్రంగా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ అవి అధికార పార్టీ చెప్పినట్టు నడుచుకుంటాయి. ఎమ్మెల్యే సిఫారసు లేఖ లేకుండా ఒక మండలానికి ఒక ఎస్ఐ ని నియమించలేని దుస్థితిలో ఉంది తెలంగాణ పోలీస్ శాఖ. అది వేరే విషయం. కానీ నిర్బంధంగా ఈడీ తో సమాచారం పంచుకోవాలనే నిబంధనల కారణంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నచోట్ల.. పరోక్షంగా పోలీసు వ్యవస్థపై పట్టు పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుందనే అంచనా ఉంది.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి ఉన్న పరిమితుల కారణంగా విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నచోట బిజెపి తన ప్రయత్నాలు తాను చేసుకోలేకపోతోంది. పైగా కొన్ని కేసుల విషయంలో ప్రాంతీయ పార్టీలు కేంద్రానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ఇటీవల కాలంలో ఇన్కమ్ టాక్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కంటే ఈడీ నే ఎక్కువ యాక్టిివ్ గా ఉంది. నిజానికి ఈడీ అనేది ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు, నగదు తరలింపు వంటి వాటిపై దృష్టి సారిస్తుంది..కానీ ఈ మధ్య కేంద్రం అడుగులకు అనుగుణంగా నడుచుకుంటున్నది. రాజకీయంగా కీలకంగా ఉన్న ప్రతి కేసులోనూ ఏదో ఒక కోణం చూసుకొని జోక్యం చేసుకుంటున్నది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది.