Site icon OkTelugu

Sunrisers Hyderabad Vs Lucknow: ఆ నలుగురు నట్టేట ముంచితే.. తెలుగోడు సన్ రైజర్స్ ను నిలబెట్టాడు..

Sunrisers Hyderabad Vs Lucknow

Sunrisers Hyderabad Vs Lucknow

Sunrisers Hyderabad Vs Lucknow: 300 లోడింగ్ అన్నారు. కాటే రమ్మ కొడుకులు అదరగొడతారని ఎలివేషన్లు ఇచ్చారు. లక్నో బౌలింగ్ ను చీల్చి చెండాడుతారని చెప్పారు. కానీ జరిగింది వేరు. పిచ్ పిచ్చి లేపింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు బ్యాటర్లకు నరకం చూపించింది. 300 స్కోర్ లోడింగ్ అనుకుంటున్న తరుణంలో.. లక్నో బౌలర్లు వీర విహారం చేశారు.

అభిషేక్ శర్మ (0), హెడ్(7), ఇషాన్ కిషన్ (1), లివింగ్ స్టోన్ (14) ఇలా ఈ నలుగురు హైదరాబాద్ జట్టును నట్టేట ముంచేశారు. దూసుకు వస్తున్న బంతులను ఎదుర్కోలేక చేతులెత్తేశారు. దీంతో హైదరాబాద్ జట్టు 26 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే లో పరుగులు తీయాల్సిన చోట వికెట్లు కోల్పోయి .. పీకల్లోతు కష్టాల్లో పడింది హైదరాబాద్ జట్టు.

నాలుగు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో.. హైదరాబాద్ జట్టు ఇక కోలుకోలేదని.. కనీసం వంద పరుగులైనా చేస్తే గొప్పేనని అందరూ ఒక అంచనాకొచ్చారు. హైదరాబాద్ జట్టు యజమాని కావ్య ముఖంలో అయితే నెత్తురు చుక్క కూడా లేదు. కొన్ని సందర్భాల్లో ఆమె తన కూర్చున్న కుర్చీ నుంచి లేచి వెళ్లిపోయింది. వ్యాఖ్యాతలు కూడా ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయారు.

ఈ దశలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి (56), క్లాసెన్ (62) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. హోమ్ గ్రౌండ్ మీద ఎలా ఆడాలో మిగతా ప్లేయర్లకు చూపించారు. వీరిద్దరి జోడి ఐదో వికెట్ కు ఏకంగా 116 పరుగులు జోడించింది. అదికూడా 63 బంతుల్లోనే చేయడం విశేషం. వీరిద్దరూ దూకుడుగా ఆడుతున్న క్రమంలో హైదరాబాద్ జట్టు స్కోరు ఏకంగా 200కు చేరుకుంటుందని అంచనాలు వెలువడ్డాయి. అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ జోడిని సిద్ధార్థ విడదీశాడు. సిద్ధార్థ బౌలింగ్లో నితీష్ ప్రిన్స్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడు ఔట్ కాగానే క్లాసెన్ ఆవేష్ ఖాన్ బౌలింగ్లో రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి హైదరాబాద్ స్కోరు 144 పరుగులు. ఈ దశలో హర్ష్ దుబే, షివాంగ్ కుమార్, హర్షల్ పటేల్ ఇలా వచ్చి అలా అవుట్ కావడంతో.. హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ 156 పరుగుల వద్ద ముగిసింది.

ఒకానొక దశలో 26 పరుగులకే నాలుగు వికెట్ల కోల్పోయిన క్రమంలో.. హైదరాబాద్ జట్టుకు నితీష్, క్లాసెన్ జీవం పోశారు.. లక్నో బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఫలితంగా హైదరాబాద్ జట్టు ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. వీరిద్దరు గనుక నిలబడకపోయి ఉండి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.. సొంత మైదానంలో మిగతా జట్లు వీరవిహారం చేస్తుంటే.. హైదరాబాద్ ప్లేయర్లు మాత్రం చేతులెత్తేశారు.

Exit mobile version