Smriti Mandhana World Record: పలాష్ ముచ్చల్ తో వివాహం రద్దయిన తర్వాత.. టీమిండియా ఏస్ ఉమెన్ క్రికెటర్ స్మృతి మందాన నిరాశలోకి వెళ్ళిపోతుందని.. కొద్దిరోజులపాటు మైదానంలోకి అడుగుపెట్టబోదని అందరు అనుకున్నారు. అంతేకాదు, వివాహం రద్దు ఆమె కెరియర్ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెప్పారు. కానీ అదంతా నిజం కాదని.. తన ఫోకస్ మొత్తం క్రికెట్ మీద మాత్రమే ఉందని స్మృతి మందాన నిరూపించింది. అంతేకాదు పలాష్ ముచ్చల్ కు తన బ్యాట్ తోనే సమాధానం చెప్పింది.
రికార్డుల రారాణి
భారత మహిళా క్రికెట్ జట్టులో రికార్డుల రారాణి గా స్మృతి మందాన పేరు తెచ్చుకుంది. శ్రీలంకతో జరుగుతున్న ఐదు టి20 మ్యాచ్ ల సిరీస్ లో స్మృతి ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. ఆదివారం జరిగిన నాలుగో మ్యాచ్ లో అద్భుతాన్ని సృష్టించింది స్మృతి. ఇంటర్నేషనల్ క్రికెట్లో అతడిక వేగంగా 10,000 పరుగులు పూర్తిచేసిన బ్యాటర్ గా రికార్డు అందుకుంది. కేవలం 281 ఇన్నింగ్స్ లలోనే ఆమె ఈ ఘనత సాధించింది. గతంలో ఇదే రికార్డు భారత జట్టుకు చెందిన మిథాలీ రాజ్ పేరు మీద ఉండేది.
మిథాలీ ఇంటర్నేషనల్ క్రికెట్లో పదివేల పరుగుల మహిళలు అందుకోవడానికి 291 ఇన్నింగ్స్ లు ఆడాల్సి వచ్చింది. స్మృతి తిరువనంతపురం వేదికగా శ్రీ లంక జట్టుతో జరిగిన మ్యాచ్లో స్మృతి 80 పరుగులు చేసింది. ఇందులో 11 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పదివేల పరుగుల మైలురాయిని స్మృతి సాధించింది.
ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్లో ఇప్పటివరకు నలుగురు ప్లేయర్లు మాత్రమే పదివేల పరుగుల మైలురాయి అందుకున్నారు. వీరిలో స్మృతి నాలుగవ క్రికెటర్. స్మృతి కంటే ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 10,868, న్యూజిలాండ్ జట్టుకు చెందిన సుజి బేట్స్(10,652), ఇంగ్లాండ్ జట్టుకు చెందిన చార్లోట్ ఎడ్వర్డ్స్ (10,273) ఈ రికార్డు అందుకున్నారు. ఇక తిరువనంతపురం వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. స్మృతి 80, శఫలివర్మ 79 పరుగులు చేయడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టాలకి 221 పరుగులు చేసింది. కాగా, ఈ సిరీస్ లో టీమిండియా వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచింది.