
క్రికెట్ టోర్నీలో.. వరల్డ్ కప్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఫ్యాన్స్ నే అడగాలి. ఎలాగైనా స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడాలని ఆరాటపడేవాళ్లు కొందరైతే.. కన్నార్పకుండా టీవీలకు అతుక్కు పోయేవారు ఎందరో! అయితే.. ఈ టోర్నీ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు.. ప్లేయర్లకు సైతం ఎంతో ప్రత్యేకతం. ఈ మెగా టోర్నీలో చోటు దక్కించుకోవాలని ప్రతీ ఆటగాడు కోరుకుంటాడు. టైటిల్ గెలవాలని, అందులో తన పాత్ర ఉడాలని ఆరాటపడతాడు. అలాంటి టోర్నీ మరో రెండు నెలల్లో మొదలు కానుంది. దుబాయ్ వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం జట్లు ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేశాయి. ఇప్పటికే.. న్యూజీలాండ్, ఆస్ట్రేలియా తమ జట్లను కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా సమాలోచనలు చేస్తోంది.
అయితే.. భారత జట్టు ప్రస్తుత పరిస్థితి సెలక్టర్లకే పరీక్ష పెట్టేలా ఉంది. అవును మరి.. ఒక్కో స్థానానికి ఏకంగా ముగ్గురు ప్లేయర్లు పోటీ పడుతున్నారు! వారిలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి? ఏ కారణంతో మిగిలిన వారిని పక్కన పెట్టాలన్నది ఖచ్చితంగా సవాలే. ఇలాంటి పరిస్థితులను అధిగమించి, మేటి జట్టును దుబాయ్ ఫ్లైట్ ఎక్కించడం అన్నది సెలక్షన్ కమిటీ ముందున్న సవాల్. మరి, ఎవరికి జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది? ఏయే అంశాలు వారికి సానుకూలంగా ఉన్నాయి? అన్నది చూద్దాం.
ముందుగా.. ఓపెనింగ్ చూసుకుంటే తొలి బంతిని ఎదుర్కోవడానికి రోహిత్ రెడీ. మరి, రెండో ఎండ్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అదనపు బౌలర్ ను తీసుకోవడమనే వ్యూహంలో భాగంగా.. తానే ఓపెనింగ్ చేస్తానని కెప్టెన్ కోహ్లీ ప్రకటించాడు కూడా. ఇదే జరిగితే.. ఓపెనర్ స్థానంపై ఆశలు పెట్టుకున్న శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటీ? అన్నది చర్చ. అయితే.. మెజారిటీ అభిప్రాయం ఏమంటే రాహుల్ ను మిడిల్ ఆర్డర్ లో కూడా ఉపయోగించుకోవచ్చు కాబట్టి.. రాహుల్ కే ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఫామ్ లో ఉన్నప్పటికీ.. పృథ్వీషాకు సైతం చోటు లేనట్టే అనుకోవచ్చు. అయితే.. త్వరలో దుబాయ్ లో కొనసాగే ఐపీఎల్ ప్రదర్శనను బట్టి నిర్ణయాలు మారినా ఆశ్చర్యం లేదు. ఇక రిషబ్ పంత్ కీపర్ గా స్థానం పదిలమే.
ఇక, పొట్టి క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ కు ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. కోహ్లీ ఓపెనర్ అయితే.. ఫస్ట్ డౌన్ లో వెళ్లొచ్చు. లేదంటే.. నాలుగో స్థానంలో కూడా సూర్యను తీసుకోవచ్చు. ఇక, మరో కీలక ఆటగాడు హార్దిక్ పాండ్యా ఉంటాడా? లేదా? అనే సందేహం ఉంది. అతనికి ఆపరేషన్ జరిగిన దగ్గర్నుంచి బౌలింగ్ నామమాత్రంగానే వేస్తున్నాడు. ఈ మధ్య ఫామ్ తోనూ తంటాలు పడుతున్నాడు. కాబట్టి అతనికి ఛాన్స్ దక్కకపోయినా ఆశ్చర్యం లేదు. దుబాయ్ లో జరిగే ఐపీఎల్ లో ఘనత చాటుకుంటే ఛాన్స్ పరిశీలించొచ్చు.
ఇక, స్పిన్నర్లలో జడేజా, సుందర్, చాహర్, చాహల్, అక్షర్ పటేల్, కుల్దీప్ మధ్య పోటీ చాలా గట్టిగానే ఉంది. వీరిలో జడేజా ఆల్ రౌండర్ కోటాలో కర్చీఫ్ వేసేశాడు. మరి మిగిలిన వారిలో ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తికరం. అక్షర్, సుందర్ కు ప్రయారిటీ ఇవ్వొచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. పేసర్లుగా బుమ్రా, భువీ ఖాయం. దీపక్, శార్దూల్, సిరాజ్, నటరాజన్ మధ్య పోటీ ఉంది. వీరిలో ఏ ఇద్దరిని తీసుకుంటారో చూడాలి.