Site icon OkTelugu

India Test cricket ranking: వన్డేలు, టి20 లు సరే.. మరి దాని సంగతేంటి.. అందులో అగ్రస్థానం ఎప్పుడు..

India Test cricket ranking

India Test cricket ranking

India Test cricket ranking: సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం టీమిండియా టి20, వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. అది చాలా రోజులపాటు కొనసాగింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి జట్లు ఉన్నప్పటికీ భారత్ ఆధిపత్యాన్ని అవి అడ్డుకోలేకపోయాయి.

కాలం మారింది. టీమ్ ఇండియా 2023 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా వెళ్ళినప్పటికీ ట్రోఫీ అందుకోలేకపోయింది. 2024, 2026 లో జరిగిన టి20 వరల్డ్ కప్ లు టీమిండియా సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. 2022లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ట్రోఫీ దక్కించుకునే క్రమంలో మధ్యలోనే ఓటమి వల్ల తన ప్రయాణాన్ని ముగించింది.

వన్డేలపరంగా, టి20 లపరంగా టీమ్ ఇండియాకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. పైగా ఇప్పుడు టీమ్ ఇండియా అత్యంత బలంగా కనిపిస్తోంది. యంగ్ ప్లేయర్లు వైట్ బాల్ ఫార్మాట్లో అదరగొడుతున్నారు. పరుగుల వరద పారిస్తున్నారు. ఐపీఎల్ లో సత్తా చూపించిన ప్లేయర్లకు మేనేజ్మెంట్ అవకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో వారు వాటిని అందిపుచ్చుకుంటున్నారు. అంతేకాదు అద్భుతమైన ఆట తీరితో అదరగొడుతున్నారు.

వైట్ బాల్ ఫార్మాట్లో టీమిండియా దుమ్ము రేపుతున్న నేపథ్యంలో టాప్ ర్యాంకును సుస్థిరం చేసుకుంటున్నది. పైగా ఈ ఫార్మాట్లలో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటూ అదరగొడుతున్నది. న్యూజిలాండ్ వల్ల కానిది.. ఆస్ట్రేలియా చేయలేనిది.. దక్షిణాఫ్రికా కలలో కూడా ఊహించలేనిది.. భారత్ చేసి చూపిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రెడ్ బాల్ విషయంలోనే భారత్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది.

టెస్ట్ విషయానికి వచ్చేసరికి టీమిండియా ప్లేయర్లు తడబడుతున్నారు. స్పిన్ బౌలింగ్ ఎదుర్కోలేకపోతున్నారు. రోజుల తరబడి క్రికెట్ ఆడలేక పోతున్నారు. ప్రస్తుతం టీమిండియా రెడ్ బాల్ ఫార్మాట్ లో మూడో స్థానంలో కొనసాగుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీలో రెండుసార్లు టీం ఇండియా ఫైనల్స్ వెళ్ళింది. రెండుసార్లు కూడా ట్రోఫీ అందుకోలేకపోయింది. ఒకసారి న్యూజిలాండ్, మరొకసారి ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిపాలైంది. గత సీజన్లో కనీసం ఫైనల్ కూడా వెళ్లలేకపోయింది.

స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో.. దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ కు గురైంది. అంతకుముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమిపాలైంది. ఇవన్నీ కూడా టీమిండియా టెస్ట్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అంతేకాదు డబ్ల్యూటీసి పాయింట్ల జాబితాలో టీమిండియా ఆరవ స్థానంలో కొనసాగుతూ ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి బంగ్లాదేశ్ కూడా మనకంటే పై స్థానంలో ఉంది. శ్రీలంక కూడా అప్పర్ హ్యాండ్ లో కొనసాగుతోంది. వీటన్నిటికీ చరమగీతం పాడాలంటే టీమిండియా ప్లేయర్లు సిసలైన టెస్ట్ క్రికెట్ ఆడాలి. టి20 ఫార్మాట్ నుంచి బయటికి రావాలి.. డిఫెన్స్ బ్యాటింగ్ ను ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే టీమ్ ఇండియా తెలుపు, ఎరుపు విభాగాలలో మొదటి స్థానంలో ఉంటుంది.

Exit mobile version