KKR vs SRH: కోల్ కతా ను పడగొట్టాలంటే.. సన్ రైజర్స్ ముందు వీటికి స్వస్తి పలకాలి..

ఈ సీజన్లో హైదరాబాద్ ఆటగాళ్లు బెంగళూరుపై 287/3, ముంబై పై 277/3 పరుగులు చేసి ఐపిఎల్ లో సరికొత్త రికార్డులు సృష్టించారు. ఇదే క్రమంలో అహ్మదాబాద్ వేదికపై గుజరాత్ జట్టు తో జరిగిన మ్యాచ్లో 162 పరుగులకే పరిమితమయ్యారు..

Written By: Anabothula Bhaskar, Updated On : May 21, 2024 10:55 am

KKR vs SRH 2024

Follow us on

KKR vs SRH: లీగ్ దశలో అద్భుతమైన విజయాలను అందుకొని సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టింది. లీగ్ దశలో చివరి మ్యాచ్ పంజాబ్ జట్టుతో ఆడి గెలుపును దక్కించుకుంది. దానికి తోడు రాజస్థాన్, కోల్ కతా మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ క్రమంలో మంగళవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా కోల్ కతా జట్టుతో ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడనుంది. సాయంత్రం 7:30 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్ల బలాలు సమానంగా ఉన్నప్పటికీ.. గత చరిత్ర చూస్తే.. హైదరాబాద్ పై కోల్ కతా జట్టు దే పై చేయి. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే కచ్చితంగా హైదరాబాద్ కొత్త రకమైన ఆట తీరు ప్రదర్శించాలి. ముఖ్యంగా ఆ జట్టు ఆటగాళ్లు తమ ఆట తీరును పూర్తిగా మార్చుకోవాలి.. బలమైన కోల్ కతా ను మట్టి కరిపించాలంటే.. హైదరాబాద్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగాలి..

ఈ సీజన్లో హైదరాబాద్ ఆటగాళ్లు బెంగళూరుపై 287/3, ముంబై పై 277/3 పరుగులు చేసి ఐపిఎల్ లో సరికొత్త రికార్డులు సృష్టించారు. ఇదే క్రమంలో అహ్మదాబాద్ వేదికపై గుజరాత్ జట్టు తో జరిగిన మ్యాచ్లో 162 పరుగులకే పరిమితమయ్యారు.. అహ్మదాబాద్ మైదానం అటు పేస్, ఇటు బౌన్స్ కు సహకరిస్తుంది. అంటే ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లకు తోడ్పాటు లభిస్తుందన్నమాట. అలాంటప్పుడు ఈ మైదానంపై భారీ స్కోర్ చేసేందుకు అవకాశం ఉండదు. అలాగని దూకుడుగా ఆడకూడదని కాదు. టాస్ గెలిస్తే రెండవ మాటకు తావు లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే చేజ్ సమయంలో ఈ ప్రాంతంలో మంచు కురుస్తుంది. అప్పుడు బంతి బౌన్స్ అయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బ్యాటర్లకు పరుగులు తీయడం కష్టమైపోతుంది.. గత మ్యాచ్లో హైదరాబాద్ ఓపెనర్ హెడ్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలాంటి తప్పును ఈ మ్యాచ్లో పునరావృతం చేయకూడదు. పంజాబ్ జట్టు కాబట్టి సరిపోయింది. కోల్ కతా లాంటి జట్టు ముందు అలాంటి పప్పులు ఉడకవు. అభిషేక్ శర్మ, మార్క్రం, క్లాసెన్, నితీష్ రెడ్డి వంటి వారి మీద హైదరాబాద్ బ్యాటింగ్ ఆధారపడుకుంటూ వస్తోంది. సెమీఫైనల్ లో ఇలాంటి వాటికి హైదరాబాద్ ఆటగాళ్లు స్వస్తి పలకాలి. మిగతా ఆటగాళ్లు కూడా తమ వంతు భారాన్ని మోయాలి. అబ్దుల్ సమద్, కమిన్స్ వంటి వారు ధాటి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది.

బౌలింగ్లో భువనేశ్వర్, కుమార్ నటరాజన్, కమిన్స్ అద్భుతాలు చేస్తున్నారు. స్లో బంతులు వేస్తూనే వికెట్లు తీస్తున్నారు. పేస్ పరంగా హైదరాబాద్ జట్టుకు తిరుగులేదు. అయితే ఇదే సమయంలో స్పిన్ బౌలింగ్ లో హైదరాబాద్ జట్టు తేలిపోతుంది.. ఈ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడంతో మధ్య ఓవర్లలో హైదరాబాద్ జట్టు ఒత్తిడి ఎదుర్కొంటోంది.. ఇలాంటి క్రమంలో స్పిన్ బౌలర్లు తమ అంచనాలకు మించి రాణించాల్సి ఉంది. అప్పుడే కోల్ కతా ను కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది. నితీష్ రెడ్డి లాంటి బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తున్నారు.. అలాంటివారు లైన్ అండ్ లెన్త్ ను పాటించి, వైవిధ్యమైన బంతులు వేస్తేనే ప్రయోజనం ఉంటుంది.. ఎందుకంటే కోల్ కతా జట్టులో నరైన్, సాల్ట్ వంటి భీకరమైన బ్యాటర్లు ఉన్నారు.. అండ్రీ రస్సెల్ లాంటి పంచ్ హిట్టర్ కాచుకుని ఉన్నాడు. ఇలాంటి వారిని బోల్తా కొట్టించాలి అంటే బౌలర్లు మరింత కష్టపడాలి.

కీలక సమయాల్లో హైదరాబాద్ ఫీల్డర్లు ఒత్తిడికి గురవుతుంటారు.. సులభమైన క్యాచ్ లను నేలపాలు చేస్తుంటారనే అపవాదు ఉంది. అలాంటి వాటికి హైదరాబాద్ ఆటగాళ్లు చరమగీతం పాడాల్సి ఉంది. కచ్చితంగా ఈ మ్యాచ్లో చురుగ్గా ఫీల్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది.. ఇలా సమష్టిగా రాణిస్తేనే హైదరాబాద్ బలమైన కోల్ కతా ను మట్టి కరిపించేందుకు అవకాశం ఉంటుంది. దర్జాగా ఫైనల్ వెళ్లి..కప్ రేసులో ఉండే అవకాశం ఉంది.