IND VS AUS Test Match : పెర్త్ టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 150 పరుగులకు ఆల్ అవుట్ అయిందంటే దానికి ప్రధాన కారణం హేజిల్ వుడ్.. నిప్పులు జరిగే విధంగా బంతులు వేసిన అతడు.. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా భారత్ 150 పరుగులకే కుప్పకూలింది.. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ అతడు ఒక వికెట్ దక్కించుకున్నాడు. మొత్తంగా ఐదు వికెట్లతో పెర్త్ టెస్టులో సత్తా చాటాడు. మిగతా ఆస్ట్రేలియా బౌలర్లు కూడా అతడిలాగే బౌలింగ్ చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ మిగతా బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసరడంలో విఫలమయ్యారు. అందువల్లే భారత్ రెండవ ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేయగలిగింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాకు రెండవ టెస్ట్ మొదలయ్యే సమయానికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే మంచి ఊపు మీద ఉన్న హేజిల్ వుడ్ గాయం బారిన పడ్డాడు. పెర్త్ టెస్ట్ ఆడుతున్న సమయంలో అతడు పక్కటెముకలు గాయానికి గురయ్యాడు. దీంతో అతడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. అతడిని పరీక్షించిన ఆస్ట్రేలియా వైద్యుల బృందం విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. దీంతో అతడి స్థానంలో ఇతర బౌలర్లకు అవకాశం ఇవ్వాల్సి ఉంది. సీన్ అబాట్, బ్రెండన్ డెగాట్ ను తీసుకునే అవకాశం కల్పిస్తోంది.. అయితే తుది జట్టులో స్కాట్ బొలాండ్ కు అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ వర్సెస్ ప్రైమ్ మినిస్టర్ లెవన్ జట్టు మధ్య పోటీలో.. ప్రైమ్ మినిస్టర్స్ జట్టుకు బొలాండ్ నాయకత్వం వహిస్తున్నాడు. 2023లో బొలాండ్ చివరిసారిగా ఆస్ట్రేలియా జట్టులో ఆడాడు. అబాట్, డెగాట్ 2018లో పాకిస్తాన్ తో ఆస్ట్రేలియా తలపడిన సిరీస్ కు ఎంపికయ్యారు. ఆ సిరీస్ యూఏఈ వేదికగా జరిగింది. అయితే ఆ సిరీస్లో తుది జట్టులో వారు స్థానం సంపాదించుకోలేకపోయారు.
భారత్ కు శుభశకునం
అడిలైడ్ వేదికగా జరిగే రెండవ టెస్టును డే అండ్ నైట్ ఫార్మాట్లో నిర్వహిస్తారు. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్లో భారత్ పై హేజిల్ వుడ్ 5 ఓవర్లు బౌలింగ్ వేసి ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు నేలకు కూల్చాడు. అంతేకాదు ఈ మ్యాచ్ లో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలింది. అప్పుడు టీమ్ ఇండియాకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించాడు. అయితే అడిలైడ్ వేదికగా జరిగే టెస్టులో ఖచ్చితంగా హేజిల్ వుడ్ సత్తా చాటుతాడని ఆస్ట్రేలియా జట్టు భావించింది. కానీ అనుహ్యంగా అతడు గాయం బారిన పడటంతో.. ఆస్ట్రేలియా ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. అయితే ఇప్పుడు తుది జట్టులో బొలాండ్ పాడటం ఖాయం అని తెలుస్తోంది.. ఇక శనివారం జరగాల్సిన భారత్ వర్సెస్ ప్రైమ్ మినిస్టర్ -11 మ్యాచ్ వర్షం వల్ల ఇంకా టాస్ కూడా వేయలేదని తెలుస్తోంది. వర్షం తగ్గితే గాని ఈ వార్మప్ మ్యాచ్ ప్రారంభమయ్యేలా లేదు.