Telangana Liberation Day 2023: సెప్టెంబర్ 17: పైన విమానాలు.. కింద గుర్రపు సేన!
హైదరాబాద్ సంస్థానం ప్రజలను నరక యాతనలకు గురి చేసిన రజాకార్ల నేత ఖాసిం రజ్వీ ఓటమి తప్పదని గ్రహించాడు. ప్రజలనుద్దేశించి రేడియోలో ప్రసంగించాడు.

Telangana Liberation Day 2023: యుద్ధం మొదలైంది. నిజాం సైనికుల సంఖ్య సుమారు 32 వేలు. రజాకార్ సైనికులు సుమారు 44 వేలు. మరో లక్షన్నర మంది సాయుధ రజాకార్లు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ సంస్థానంపై దాడికి భారత సైన్యం ‘ఆపరేషన్ పోలో’ అని పేరు పెట్టింది. హైదరాబాద్‌కు పశ్చిమ భాగంలో సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న షోలాపూర్ నుంచి కొన్ని దళాలు దాడికి దిగాయి. మరి కొన్ని దళాలు హైదరాబాద్‌కు తూర్పు భాగంలో ఉన్న విజయవాడ నుంచి దాడి చేశాయి. అవసరమైన చోట సైన్యానికి విమాన దళాల సాయం కూడా అందించారు. విమానాల నుంచి బాంబు దాడులు చేశారు. ఈ సైనిక చర్యకు మేజర్ జనరల్ జేఎన్ చౌధురి నాయకత్వం వహించారు. ఎల్.ఇద్రూస్ హైదరాబాద్ సంస్థానం సేనలకు నాయకత్వం వహించాడు. అపారమైన భారత సైన్యం, ఆయుధ సంపత్తి ముందు తన సైన్యం నిలబడలేదని నిజాంకు తెలుసు. కానీ, ఖాసిం రజ్వీ మాటలు, రాజ్యకాంక్ష ఆయనను వాస్తవాల్ని విస్మరించేలా చేశాయి. ఆ ఐదు రోజులూ సంస్థానంలోని లక్షలాదిమంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. అల్లర్లు, లూటీలు, మహిళలపై అత్యాచారాలతో సంస్థానం అట్టుడికింది.
పాక్ పలాయనానికి రజ్వీ విఫలయత్నం
హైదరాబాద్ సంస్థానం ప్రజలను నరక యాతనలకు గురి చేసిన రజాకార్ల నేత ఖాసిం రజ్వీ ఓటమి తప్పదని గ్రహించాడు. ప్రజలనుద్దేశించి రేడియోలో ప్రసంగించాడు. నిజానికి, అంతకుముందు రోజే అప్పటి రైల్వే మంత్రి సహకారంతో పాకిస్థాన్ పారిపోయేందుకు రజ్వీ నిజాం సాయం అడిగాడు. విమానంలో పాకిస్థాన్ లేదా మరో దేశం వెళ్లేందుకు ఏర్పాటు చేయగలరా అని రైల్వే మంత్రి అబ్దుల్ రహీం ద్వారా నిజాంను అడిగించాడు. భారత సేనలు, వైమానికి దళాలు చుట్టుముట్టి ఉండగా విమానంలో అయినా పారిపోవడం అసాధ్యమని నిజాం తేల్చి చెప్పాడు. అనంతరం సైన్యం రజ్వీని అరెస్టు చేసింది. తొమ్మిదేళ్లు జైలుశిక్ష అనుభవించిన తర్వాత రజ్వీ పాకిస్థాన్ చేరి, అక్కడ సాదాసీదా జీవితం గడిపి 1970లో మరణించాడు.
ఆంధ్రాగేట్.. సూర్యాపేట
సెప్టెంబరు 13 – 15
తూర్పు దిశలో ఎటువంటి ప్రతిఘటన లేకపోవడంతో భారత సైన్యం సూర్యాపేట చేరుకుంది. మేజర్ ధనరాజులు నాయుడు ఆధ్వర్యంలో యుద్ధ శకటాలతో వస్తున్న సైన్యాన్ని 20 ఏళ్లలోపు యువకులు నినాదాలు చేసుకుంటూ అడ్డుకున్నారు. వారికి నచ్చచెప్పే ప్రయత్నం విఫలం కావడంతో శతఘ్ని పేలింది. కొందరు యువకులు నేలకూలారు. అక్కడి నుంచి సైన్యం ముందుకు సాగకుండా మూసీ నదిపై ఉన్న వంతెనను నిజాం దళం పేల్చివేసింది. ఆ వంతెనను మరమ్మతు చేసుకుని భారత సైన్యం ముందుకు సాగింది. నార్కట్‌పల్లి దగ్గర భారత సైన్యం చేతిలో నిజాం సేనలు చావుదెబ్బ తిన్నాయి.
